కామారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
కామారెడ్డి టౌన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదాం నవీన్, సుధీర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో శుక్రవారం కామారెడ్డిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్దకు చేరుకుని, ధర్నా చేశారు. ఈ సందర్భంగా నవీన్, సుధీర్‌లు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు.
ఫీజులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పలు విద్యా సంస్థలు కొనసాగుతున్నాయన్నారు. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ లోపించిందన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులతోపాటు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పృథ్విరాజ్, కుంబాల గణేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment