sfi dharna
-
గర్జించిన విద్యార్థులు
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్) : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల నినాదాలతో ఏలూరు కలెక్టరేట్ దద్ధరిల్లింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో గురువారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను దాటుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన 19 మంది ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు విద్యార్థుల ధర్నానుద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వై.రాము మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించిన విదార్థులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తూ అరెస్ట్‌లు చేయడాన్ని ఖండిస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల ఫీజు చెల్లించాల్సిన తేదీలు యూనివర్సిటీలు ప్రకటిస్తున్నా విద్యార్థులకు స్కాలర్షిప్లు మాత్రం ప్రభుత్వం విడుదల చేయడంలేదన్నారు. సంక్షేమ హాస్టల్స్‌ని రెసిడెన్షియల్ హాస్టల్స్ చేస్తామనే పేరుతో 56 బీసీ హాస్టల్స్‌ని మూసివేయాలనుకునే ప్రభుత్వ ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ మెస్ బిల్లులు, కాస్మొటిక్స్ నెలల తరబడి విడుదల చేయకపోవడం వల్ల హాస్టల్ విద్యార్థులు అరకొర సౌకర్యాల మధ్య, అర్ధాకలితో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కాలేజ్ అటాచ్డ్, సంక్షేమ హాస్టల్స్ మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఫీజుల భారం విజిలెన్స్ దాడుల్లో ఎంత అవినీతి బైటపడినా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకపోవడంలో ప్రభుత్వ ఆంతర్యం అర్థమవుతోందని అన్నారు. జీఓనెం 35 కారణంగా నరసాపురం వైఎన్, భీమవరం డీఎన్ఆర్, పెనుగొండ ఎస్వీకేవీ, ఏలూరు సీఆర్ఆర్ వంటి కళాశాలల్లో అన్ఎయిడెడ్ పోస్టులు రెగ్యులరైజ్ అవ్వకపోవడం వల్ల విద్యార్థుల ఫీజుల నుండే అధ్యాపకులకు జీతాలు చెల్లించడం వల్ల విద్యార్థులపై ప్రతి సంవత్సరం ఫీజుల భారం పెరుగుతోందన్నారు. ఎస్ఎఫ్ఐ డెల్టా, అప్ల్యాండ్ జిల్లా కార్యదర్శులు మాట్లాడుతూ విద్యార్థులు డిమాండ్ ఉన్న నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో నూతనంగా కాలేజ్ సంక్షేమ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మారుస్తున్నామనే పేరుతో మూసివేయడం వల్ల విద్యార్థులు వారికి ఇష్టమైన పాఠశాలలో చేరే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని తక్షణం ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. మధ్నాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.రాము, అరశాడ మణికంఠ, కాగిత అనిల్, ఎం.శివరాజు, పి.సాయికృష్ణ, అరకట్ల శరత్, కె.ప్రసాద్, డి.సాగర్, ఎ. కార్తీక్, డి.పెద్దిరాజు, బి.వినయ్, టి.కార్తీక్, సీహెచ్ నాని, ఎన్.ప్రసాద్, వై.దిలీప్, ఎం.వెంకటాజు, బి.నాగబాబు, ఎం. మనికాంత్, ఎస్.రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆచంట ప్రసాద్, బాతిరెడ్డి ఆనంద్, పాలకొల్లు యుగంధర్, ప్రతీప్, వాసు తదితరులు నాయకత్వం వహించారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి టౌన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదాం నవీన్, సుధీర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో శుక్రవారం కామారెడ్డిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్దకు చేరుకుని, ధర్నా చేశారు. ఈ సందర్భంగా నవీన్, సుధీర్‌లు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. ఫీజులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పలు విద్యా సంస్థలు కొనసాగుతున్నాయన్నారు. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ లోపించిందన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులతోపాటు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పృథ్విరాజ్, కుంబాల గణేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ హాస్టల్లో సిబ్బంది మందు..విందు
విద్యారణ్యపురి : హన్మకొండ బాలసముద్రంలోని బీసీ హాస్టల్లో ఆదివారం ముగ్గురు సిబ్బంది విందు పార్టీ చేసుకున్నారు. మందుతాగుతూ, మాంసాహారాన్ని ఆరగించారు. ఆ సమయంలోనే ఎస్ఎఫ్ఐ బాధ్యులు అక్కడికి వెళ్లారు. ప్రభుత్వ బీసీ హాస్టల్లో విద్యార్థులు ఉన్నారని, మీరు హాస్టల్లో మందు తాగడం సరికాదని సిబ్బందితో వారు అన్నారు. మా ఇష్టం అంటూ సిబ్బంది ఎస్ఎఫ్ఐ నాయకులతో వాగ్వాదం చేశారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ విధుల్లో లేరు. హాస్టల్ వాచ్‌మన్ తిరుపతితో సహా మరో ఇద్దరు చంద్రయ్య, కొమురయ్య మందు తాగుతుండగా ఇదేమిటని ప్రశ్నిస్తే మా ఇష్టం అంటూ దురుసుగా మాట్లాడారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోష్ ఆరోపించారు. బీసీ హాస్టల్లో విద్యార్థులను గాలికి వదిలేసి సిబ్బంది పట్టపగలే విందు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సంబంధిత హాస్టల్ వార్డెన్, ఆముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ హాస్టల్ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులతో ధర్నా చేశారు. హాస్టల్ వార్డెన్‌కు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన హాస్టల్లో ఇలా సిబ్బంది మద్యం మత్తులో తూగారని ఆరోపించారు. వర్కర్లు తిరుపతిని, చంద్రయ్య, కొమురయ్య తాగుతున్న మందు బాటిల్‌ను కూడా ఎస్ఎఫ్ఐ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఎఫ్ఐ బాధ్యులు తెలిపా రు. ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అర్బన్ జిల్లా బాధ్యులు ఎం.రాజేష్, టి.రఘు పాల్గొన్నారు. -
హాస్టళ్ల మూసివేతను నిరసిస్తూ..
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు కాకినాడ సిటీ : హాస్టళ్ల మూసివేతను నిరసిస్తూ బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కలెక్టరేట్‌ను ముట్టడించింది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని సుమారు మూడు గంటల పాటు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించారు. విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో పేద విద్యార్థులను చదువుకు దూరం చేసిందని విమర్శించారు. హస్టళ్లను మూసివేస్తూ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నామని బూటకపు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తూ కార్పొరేట్వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. సంక్షేమ హాస్టళ్ల మూసివేత ఆపాలని, మూసిన వాటిని వెంటనే తిరిగి పునఃప్రారంభించాలని, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, శాశ్వత భవనాలు నిర్మించాలని, ఫీజులకు అనుగుణంగా ఉపకార వేతనాలు, మెస్‌చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, విద్యార్థులకు ప్రతినెలా వైద్యపరీక్షలు నిర్వహించాలని, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి హాస్టల్‌కు వార్షిక సమీక్ష కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి టి.రాజా, మహిళా కన్వినర్ స్పందన, నాయకులు దుర్గాప్రసాద్, శివ, శివదుర్గా పాల్గొన్నారు.