హాస్టళ్ల మూసివేతను నిరసిస్తూ..
హాస్టళ్ల మూసివేతను నిరసిస్తూ..
Published Wed, Jul 20 2016 10:32 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు
కాకినాడ సిటీ : హాస్టళ్ల మూసివేతను నిరసిస్తూ బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కలెక్టరేట్‌ను ముట్టడించింది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని సుమారు మూడు గంటల పాటు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించారు. విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనలో పేద విద్యార్థులను చదువుకు దూరం చేసిందని విమర్శించారు. హస్టళ్లను మూసివేస్తూ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నామని బూటకపు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తూ కార్పొరేట్‌వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. సంక్షేమ హాస్టళ్ల మూసివేత ఆపాలని, మూసిన వాటిని వెంటనే తిరిగి పునఃప్రారంభించాలని, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, శాశ్వత భవనాలు నిర్మించాలని, ఫీజులకు అనుగుణంగా ఉపకార వేతనాలు, మెస్‌చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, విద్యార్థులకు ప్రతినెలా వైద్యపరీక్షలు నిర్వహించాలని, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి హాస్టల్‌కు వార్షిక సమీక్ష కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి టి.రాజా, మహిళా కన్వినర్ స్పందన, నాయకులు దుర్గాప్రసాద్, శివ, శివదుర్గా పాల్గొన్నారు.
Advertisement