సాక్షి, నిజామాబాద్: ఫుట్‌బోర్డు ప్రయాణం బీటెక్ విద్యార్థి ప్రాణాలను బలిగొంది. వివరా లు.. నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన తోకల దేవిదాస్, మమతలకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మదన్‌కుమార్ (22) ఉన్నారు. ఆర్మూర్‌లోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న మదన్.. ఎప్పటిలాగే గురువా రం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు రెడీ కాగా, దేవిదాస్ అతడ్ని కంఠేశ్వర్ బస్టాప్ వద్ద దింపి వెళ్లాడు. ఆర్మూర్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు నిజామాబాద్ నుంచి మెట్‌పల్లికి వెళ్తుండగా, మదన్ అందులో ఎక్కాడు. ప్ర యాణికులు ఎక్కువగా ఉండటంతో అతడు ఫుట్‌బోర్డుపై నిలబడ్డాడు. బస్సు కొద్ది దూరం వెళ్లిందో లేదో.. ఫుట్‌బోర్డు పైనున్న మదన్ కాలుజారి కిందపడి పోయాడు. గమ నించిన తోటి విద్యార్థులు, ప్రయాణికులు గమనించి కేకలు వేసే లోపే.. బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి దూసుకెళ్లాయి. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. క్షణాల్లో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.
బోరుమన్న తల్లిదండ్రులు
కొడుకును దింపి వెళ్లిన కొద్ది సేపటికే అతడు మృతి చెందాడని తెలియడంతో తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. మదన్‌ను దిగబెట్టిన స్థలానికి హుటాహుటిన వచ్చి చూడగా విగతజీవిగా మారిన కొడుకును చూసి బోరుమన్నాడు. ఏకైక కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఎంతో హుషారుగా కళాశాలకు వెళ్లిన మదన్ శమమై తిరిగి రావడం కాలనీవాసులను కలచి వేసింది.
విద్యార్థుల రాస్తారోకో..
మదన్ మృతి విషయం తెలిసి విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కళాశాలల సమయంలో సరిపడా బస్సులు నడపకుండా ఆర్టీసీ అధికారులు విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మదన్ మృతి చెందాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏసీపీ సుదర్శన్, మూడో టౌన్ ఎస్సై కృష్ణ విద్యార్థులకు సర్దిచెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ టీవీయూవీ జిల్లా అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో రాస్తారోకో చేశారు.
నగర సీఐ సుభాష్ చంద్రబోస్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్‌రావు, ఎస్సై గౌరేందర్ అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆర్‌టీసీ నుంచి రావాల్సిన బెనిఫిట్లు వస్తాయని, ఇందుకు తాము సహకరిస్తామని సీఐ హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు డిపో–1 మేనేజర్ ఆనంద్‌కుమార్‌ను కలిసి మదన్ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. బస్సులు తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని, కళాశాలల సమయంలో బస్సుల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన మేనేజర్ బస్సు సర్వీసులు పెంచుతామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment