బాలిక మృతదేహం
మల్కన్‌గిరి/భువనేశ్వర్ : భద్రక్ జిల్లాలోని రాణితాల్ గ్రామం జాతీయ రహదారి నంబర్16పై రోహంజ కూడలి వద్ద ఓ లారీ ఢీకొట్టడంతో 8మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. స్కూల్ విడిచిపెట్టిన తర్వాత నడుచుకుంటూ, సైకిల్‌పై విద్యార్థులు ఇళ్లకు చేరుకునేందుకు వస్తున్నారు. అదే సమయంలో ఒక దానిని ఒకటి ఓవర్‌టేక్ చేయాలని రెండు లారీలు మితిమీరిన వేగంతో వస్తూ విద్యార్థులపైకి ఒక లారీ దూసుకెళ్లింది.
దీంతో సంఘటనా స్థలంలోనే 8మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పరుగు పరుగున వచ్చి గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపిస్తూ సంఘటనా స్థలానికి వచ్చి గుండెలు బాదుకుంటూ రోదించారు. మా ఆశాదీపాలు పిల్లలే అని నమ్మకంగా ఉన్న తమకు భవిష్యత్ అంధకారం అయిందని వారు రోదిస్తుంటే అందరి కళ్లు చెమర్చాయి.
ముఖ్యమంత్రి పరిహారం
ఈ దుర్ఘటనలో బాలల దుర్మరణంపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందుతుందని తెలిపారు. బాధిత బాలల వైద్య, చికిత్స ఖర్చుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment