మాకెందుకీ ‘పరీక్ష’! | Agitated students protest outside office in Delhi | Sakshi
Sakshi News home page

మాకెందుకీ ‘పరీక్ష’!

Published Sun, Apr 1 2018 1:34 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

Agitated students protest outside office in Delhi - Sakshi

ఢిల్లీలో సీబీఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనతో విద్యార్థిలోకం నైరాశ్యంలో కూరుకుపోయింది. ఏడాదంతా కష్టపడి చదివితే.. కొందరు స్వార్థపరులు దౌర్జన్యంగా తమ హక్కులను కాలరాస్తున్నారని మనోవేదన వ్యక్తం చేస్తోంది. పరీక్షలు పూర్తయి.. తదుపరి ప్రవేశ పరీక్షలకు కొందరు, సెలవులకు కొందరు ప్లాన్‌ చేసుకుంటున్న సమయంలో ఈ దారుణమైన వార్త తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన చెందుతున్నారు.

బాధితుల్లో సాధారణ కుటుంబాల వారి నుంచి బడా రాజకీయ నేతల పిల్లలూ ఉన్నారు. ‘చాలా నిరాశగా ఉంది. పరీక్షకు ముందు రోజే ప్రశ్నాపత్రం లీకేజీ విషయం తెలిసి ఉంటే.. సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌కు విషయం తెలిస్తే అప్పుడే పరీక్ష రద్దుచేయాల్సింది. ఎందుకింత సమయం వృథా చేస్తున్నారో అర్థం కావటం లేదు’ అని ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ మాకెన్‌ కుమారుడు ఔజస్వి ఆవేదన వ్యక్తం చేశారు.  

మమ్మల్నెందుకు ఇబ్బందిపెడతారు?
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనమిక్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు.. నిర్ణయించిన తేదీలకు సుమారు అటూ ఇటుగానే పలు జాతీయ, ప్రాంతీయ ఉన్నత విద్య కోర్సులకు ప్రవేశ పరీక్షలుండటంతో.. దేనికోసం సిద్ధం కావాలో తెలియక సతమతమవుతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఎకనమిక్స్‌ వంటి కఠినమైన సబ్జెక్టు పరీక్షకు సిద్ధమవటం కష్టమైన పనేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘పునఃపరీక్షకు నిర్ణయిస్తే.. మళ్లీ సిద్ధం కాక తప్పదు.

కానీ ఇకపై పేపర్‌ లీక్‌ జరగదని అధికారులు భరోసా ఇవ్వాలి. మళ్లీ మళ్లీ పరీక్షలతో మమ్మల్నెందుకు ఇబ్బంది పెడతారు’ అని 12వ తరగతి విద్యార్థిని వంశిక బాధగా వెల్లడించారు. లీక్‌తో ఏమాత్రం సంబంధంలేని తమను.. ఇంత క్షోభపెట్టడం సరికాదంటున్నారు. అయితే పరీక్ష రాయటానికి ఇబ్బందేమీ లేదని.. కానీ.. మొదటిసారి రాసినంత ఉత్సాహంగా పరీక్ష రాయలేమంటున్నారు. ఈ లీక్‌ తర్వాత సీబీఎస్‌ఈపై నమ్మకం పోయిందంటున్నారు.

‘పరీక్షకు ముందురోజు రాత్రి.. లీకైన పరీక్షపేపర్‌ రూ.16వేలకు ఇస్తున్నారని.. అదే పరీక్షకు కొద్దిగంటల ముందైతే రూ.3వేలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇదెంత దారుణమైన విషయం. మా జీవితాలతో ఆడుకోవటం ఎందుకు?’ అని గురుగావ్‌కు చెందిన స్నేహ అగర్వాల్‌ అనే విద్యార్థిని ఆవేదనగా తెలిపారు. ‘విద్యార్థులతో సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌ సమావేశం ఏర్పాటుచేసి.. ఇకపై లీక్‌ జరగదని భరోసాగా చెప్పగలరా?’ అని ఆందోళన చేస్తున్న విద్యార్థులు ప్రశ్నించారు. సరైన సమాధానం వచ్చేంతవరకు నిరసనలు తగ్గవని స్పష్టం చేశారు.

సీబీఎస్‌ఈదే బాధ్యత
‘బోర్డు ఎగ్జామ్‌ అంటేనే తెలియని ఆందోళన. ఈ పరిస్థితుల్లో ఏడాది చదివిందంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరైంది. పరీక్షకు ముందురోజే పేపర్‌ లీక్‌ అయిందని తెలిసింది. అయినా మనకెందుకులే అని సిద్ధమై.. పరీక్ష హాల్‌కు వెళ్లే సరికి ప్రతి ఒక్కరికీ లీక్‌ గురించి తెలిసిందని అర్థమైంది. పరీక్ష బాగా రాశామని సంబరపడుతుండగానే.. ఈ వార్త ఉలిక్కిపడేలా చేసింది. మళ్లీ గణితం పరీక్ష రాయాలా? అని భయమేస్తోంది. అసలు ఈ ఘటనంతటికీ సీబీఎస్‌ఈదే పూర్తి బాధ్యత. ఇటీవలి కాలంలో బోర్డు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ఇలాగే ఉంటున్నాయి. దీంతో వ్యవస్థపై నాకు పూర్తిగా నమ్మకం పోయింది’ అని శ్రీజన్‌ సిన్హా అనే పదో తరగతి విద్యార్థిని పేర్కొంది.  

మరో లీక్‌ కలకలం

► అవి వదంతులేనన్న సీబీఎస్‌ఈ

► జార్ఖండ్‌లో ఇద్దరు కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్ల అరెస్టు

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే.. మరో లీకేజీ జరిగిందన్న వదంతులు కలకలం సృష్టించాయి. సోషల్‌ మీడియాలో 12వ తరగతి హిందీ, పొలిటికల్‌ సైన్స్‌ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు.. వార్తలు రావటంపై సీబీఎస్‌ఈ తీవ్రంగా స్పందించింది. లీక్‌ జరగలేదని.. వాట్సప్, యూట్యూబ్‌.. తదితర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది.

‘సోషల్‌ మీడియాలో విస్తృతమవుతున్న ఈ రెండు పేపర్లు గతంలోనివే. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దు’ అని సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పరీక్షకు ముందురోజే.. పదవతరగతి ప్రశ్నాపత్రం సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌ అనిత కార్వాల్‌కు ఈ–మెయిల్‌లో రావటంపై వివరాలివ్వాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిపై గూగుల్‌ సమాధానమిచ్చింది. ఓ పదోతరగతి విద్యార్థి వాట్సప్‌ ద్వారా తనకు వచ్చిన ప్రశ్నాపత్రాన్ని.. తండ్రి ఈ–మెయిల్‌ ద్వారా సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌కు పంపారని ఢిల్లీ కమిషనర్‌ (క్రైం) ఆర్పీ ఉపాధ్యాయ వెల్లడించారు.

ఆ విద్యార్థిని, ఆయన తండ్రిని విచారిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 60 మందిని పోలీసులు విచారించారు. ఢిల్లీతోపాటు నగర శివార్లలో ఉన్న కోచింగ్‌ సెంటర్లు, పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నించారు. అయినా ఇంతవరకు ఎలాంటి సమాచారం దొరకలేదని తెలిసింది. 12వ తరగతి ఎకనమిక్స్‌ పునఃపరీక్షకు సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పరీక్ష నిర్ణయాన్ని రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీలోని శకర్‌పూర్‌కు చెందిన రీపక్‌ కన్సాల్, కొచ్చికి చెందిన రోహన్‌ మ్యాథ్యూ వేర్వేరు పిటిషన్లు వేశారు.

జార్ఖండ్‌లో ప్రకంపనలు
సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రం లీక్‌ తాలూకూ ప్రకంపనలు జార్ఖండ్‌లోనూ కనబడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఛాత్రా జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల డైరెక్టర్లు (ఇద్దరు), నలుగురు విద్యార్థులను (10, 11 తరగతి విద్యార్థులు) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలోని సీబీఎస్‌ఈ కార్యాలయం ముందు విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రీత్‌ విహార్‌లోని కార్యాలయం ముందున్న రోడ్డును బ్లాక్‌ చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement