సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లేదని, ఏడాదిలో రెండుసార్లు తనిఖీ చేయాలన్న చట్ట నిబంధనల్ని అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రిజిస్టర్ చేసినవి 89 ఉంటే రిజిస్టర్ చేయనివి 41 ఉన్నాయని తెలుసుకున్న ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. రిజిస్టర్ కూడా చేసుకోని వృద్ధాశ్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని, తనిఖీలు చేయాల్సిన అధికారులు తమ విధులను సరిగ్గా నిర్వహించకపోవడంపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నదీ కూడా వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వృద్ధాశ్రమాల్లో వసతులు లేవని, అక్కడి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు ప్రజా హిత వ్యాజ్యంగా పరిగణించింది. ఈ పిల్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహా న్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తయారు చేసిన నివేదికను ధర్మాసనానికి అందజేశారు.
జంటనగరాల్లో 41 వృద్ధాశ్రమాలు కనీసం రిజిస్టర్ చేయకుండా నిర్వహిస్తున్నారని, పలు ఆశ్రమాల్లో కనీస వసతులు లేవని నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ కల్పించుకుని, లాక్‌డౌన్ కారణంగా అన్ని ఆశ్రమాలను అధికారులు తనిఖీలు చేయలేకపోయారని, కొన్ని చోట్ల వసతులు సాధారణంగా ఉన్నాయని తెలిపారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. 41 ఆశ్రమాలకు నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోకపోతే వృద్ధాశ్రమాల్ని రద్దు చేస్తామని చెప్పామన్నారు. వాదనల అనంతరం జూలై 14 నాటికి ప్రభుత్వ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.
రిజిస్ట్రేషన్ లేని వృద్ధాశ్రమాలా?
Published Thu, Jun 25 2020 4:52 AM | Last Updated on Thu, Jun 25 2020 4:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment