సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైనట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తుండటం, ఇతరత్రా కారణాల వల్ల వారి భద్రత విషయమై జాగ్రత్తలు తీసుకుంటోంది. నాలుగేళ్లుగా గన్‌మెన్లను నియమించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అధికారులు నివేదించినట్లు సమాచారం.
ఉండాల్సిందే..
రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒకే గన్‌మెన్‌తో, మరికొంత మంది గన్‌మెన్లు లేకుండానే నియోజకవర్గాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు గన్‌మెన్లను నియమిస్తే మరుసటి రోజే హెడ్‌క్వార్టర్స్‌కు రిటర్న్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌కు ఎస్పీలు రిపోర్టు చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్‌ఓ)లను తొలగించుకోవడం సరికాదని చెప్పారు. ఎమ్మెల్యేలు సొంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ తిరగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతపై ఆయా జిల్లాల మంత్రులతోనూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా కొంతమందికి ఫోన్లు వెళ్లడంతో తప్పక పలువురు గన్‌మెన్లను నియమించుకున్నట్లు తెలిసింది.
ముగ్గురు ఎంపీలూ..
ముగ్గురు ఎంపీల విషయంలోనూ ఇదే వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. గన్‌మెన్లను కేటాయిస్తే క్యాంపు ఆఫీసు, ఇళ్లలో వదిలి కార్యకర్తలు, అనుచరులతో వెళ్తున్నారని.. ఆ ఎంపీలకూ మందలింపులు జరిగాయని సమాచారం. దీంతో ఇద్దరు 2+2 నియమించుకోగా, ఓ ఎంపీ 1+1 స్వీకరించినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎస్పీలు, కమిషనర్ల మధ్య గన్‌మెన్లు ఒత్తిడికి గురవుతున్నారు. వారిని ఎమ్మెల్యేలు వెంట తీసుకెళ్లకపోవడం.. వెళ్లకపోతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు.
Published Fri, May 11 2018 4:01 AM | Last Updated on Fri, May 11 2018 4:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment