పండగ ప‘రేషన్’
- అమ్మహస్తం.. అస్తవ్యస్తం...
- నేటికీ అందని వస్తువులు
- సంక్రాంతి గడిచేదెలా..
అమ్మహస్తం పథకం రానురాను అస్తవ్యస్తంగా తయారవుతోంది. పండగపూట కూడా పేద, మధ్యతరగతి ప్రజలు పచ్చడి మెతుకులతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఎందుకింత అలక్ష్యం వహిస్తోందో అర్థం కావడం లేదు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని చౌకధరల దుకాణాలకు నేటికీ సగానికి సగం సరకులు చేరలేదు. అధికారులు సోమవారం నాటికి పామాయిల్ గోడౌన్లకు చేర్చారు. స్టాక్ లేకపోవడంతో గత డిసెంబర్‌లో జిల్లా వ్యాప్తంగా పామోలిన్ సరఫరా పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం పండగ వచ్చేసినా పంపిణీ చేయలేకపోయింది. అధికారులు ప్రయాసలు పడి ఎంఎల్‌సీ పాయింట్లకు చేర్చినా ఇంకా ప్రజలకు అందలేదు.
విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని పలు రేషన్ దుకాణాలకు పామాయిల్ సరఫరా కాలేదని తెలిసింది. స్టాక్ వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో కొందరు డీలర్లు సరకు కోసం డీడీలు కట్టకపోవడంతో ప్రజలకు పామాయిల్ తోపాటు ఇతర వస్తువులు అందలేదని చె బుతున్నారు. 49 మండలాల్లో 30 మండలాలకు మాత్రమే అదికారులు ఇప్పటి వరకు పామాయిల్ సరఫరా చేశారు. జిల్లాకు ప్రతి నెలా 1209 మెట్రిక్ టన్నుల పామాయిల్‌ను అధికారులు కార్డుదారులకు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం 900 మెట్రిక్ టన్నులు మాత్రమే డిపోలకు సరఫరా అయినట్లు తెలిసింది. తాజాగా ఇచ్చిన కొత్త కార్డుదారులతో కలిపి జిల్లా వ్యాప్తంగా 2,150 డిపోలలో12లక్షల రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరకులు అందించాల్సి ఉంది.
తొమ్మిదింటిలో నాలుగే సరఫరా ....
అమ్మహస్తంలో భాగంగా రూ.185కు 9 వస్తువులు సరఫరా చేయాల్సి ఉంది. ఈ నెలలో అధికారులు బియ్యం, పంచదార, పామాయిల్, కందిపప్పు మాత్రమే సరఫరా చేశారు. ఉప్పు, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పసుపు, కారం సరఫరా నిలిపివేశారు.