పండక్కి ప‘రేషాన్’!
తీపి లేదు.. పులుపు లేదు. పల్లెవాసులకు సంక్రాంతి పండుగ సంబురమే లేదు. ఏం కొందామన్నా..ఏం తిందామన్నా ధరలు మండిపోతున్నాయి. చౌక సరుకులైనా కాసింత ఆసరా ఉంటాయనుకుంటే వాటి అతీగతి లేదు. మూణ్నెళ్లుగా పామాయిల్ పంపిణీ చేయకపోవడంతో పేదలకు పిండివంటలు చేసుకొనే భాగ్యమే లేదు. పసుపు, చింతపండు, కారం, చక్కెర లేదు.. పండుగపూట అదనపు కోటా జాడేలేదు.
పాలమూరు/కలెక్టరేట్, న్యూస్‌లైన్: అమృతహస్తం పథకం ద్వారా రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందిస్తున్నట్లు ప్రభుత్వం ఓ వైపు చెబుతుండగా..జిల్లాలో మాత్రం ఆ పరి స్థితి లేదు. పండుగ పూట కందిపప్పు, పామాయిల్ కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో తెలుపు రేషన్‌కార్డులతో పాటు ఇతర పథకాల కింద 11.50 లక్షల కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతినెలా చౌక దుకాణాల ద్వారా సరుకులను పౌరసరఫరాల శాఖ అందజేయాలి.
2,304 రేషన్‌షాపులకు 10.90 లక్షల పామాయిల్ ప్యాకెట్‌లను సరఫరా చేయాల్సి ఉంటుంది. పండుగ వేళ పామాయిల్ లభించకపోవడంతో లబ్ధి దారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండునెలలుగా జిల్లాలో పామాయిల్‌ను సరఫరా చేయడమే మానేశారు. దీంతో చేసేదిలేక రేషన్‌షాపుల్లో రూ.40కి లభించే పామాయిల్ పాకెట్‌ను బహిరంగ మార్కెట్‌లో రూ.70కు కొనుగోలుచేస్తున్నారు. జిల్లాలో చక్కెర పరిస్థితి కూడా అదేతంతుగా మారింది.
మారుమూల గ్రామాల్లో కొందరు డీలర్లు చక్కెర ఇవ్వడం లేదని లబ్ధిదారులు గగ్గోలుపెడుతున్నారు. ప్రతికార్డుపై ప్రస్తుతం అరకిలో చక్కెర ఇస్తున్నారు. పండుగ సమయాల్లో మరో అరకిలోను కలిపి కిలో చక్కెర ఇవ్వాలి. కానీ పౌరసరఫరాల అధికారులు అదనపుకోటా మాటనే మరిచారు.
‘కొత్త’ కోటా హుష్‌కాకి!
ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం జిల్లావ్యాప్తంగా1.90లక్షల మం ది తెల్లరేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే విచారణ పేరుతో 60 వేలకు పైగా తొలగించిన అధికారులు ఎట్టకేలకు రెండేళ్ల తరువాత 1.32లక్షల మంది అర్హులంటూ తేల్చారు. వారికి తాత్కాలిక రేషన్ కూపన్లు జారీచేశారు. వీ రందరికీ గతేడాది నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండలో కూపన్లను పంపిణీచేశారు. ఇక పంపిణీ సమయంలో డిసెం బర్ కోటాను తీసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
కానీ వారికి ఇప్పటివరకు సరుకులను అందించలేకపోయారు. కానీ రేషన్‌కోటా మాత్రం రెండు నెలలు యథావిధంగా పంపిణీకా గా, దాన్ని లబ్ధిదారులకు పంపిణీచేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక కోటా విషయానికొస్తే డిసెం బర్‌లో 1.32 లక్షల మందికి రేషన్‌కోటా మంజూరుచేయగా, ఆనెలలో కేవలం 60వేల మంది మాత్రమే రేషన్ తీసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇలా ఈ రెండునెలల కాలంలో కేవలం 70వేల మంది మాత్రమే రేషన్‌కోటాను తీసుకున్నారు. ఇక జనవరిలో ఈ కోటాను కాస్త పెంచి లక్షమందికి పంపిణీచేసి మిగిలిన వారిని పక్కకు పెట్టేశారు.
30 వేలకు పైగా పెండింగ్‌లోనే..
మంజూరైన కూపన్లను పంపిణీచేయడంలో అధికారులు కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే లబ్ధిదారులకు కూపన్లను అందించకపోతే వారికి కోటా ఉండదు, కావునా ఆ కోటాను స్వాహా చేయొచ్చని అనుకున్నారేమో తెలియదు కానీ లబ్ధిదారులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిని ఎప్పటివరకు పంపిణీచేస్తారో అంతుచిక్కని ప్రశ్నంగా మారింది.
కోటాను పక్కదారిపట్టిస్తే చర్యలు
కూపన్లు అందరికీ పంపిణీ చేయని మా టవాస్తవమే. కానీ వారికి మంజూరు చేసిన కోటాను క్లోజింగ్ బ్యాలెన్స్‌లో డీలర్లు చూ పాల్సిందే. కూపన్లను సకాలంలో పంపిణీచేయని అధికారులపై కఠినచర్యలు తప్పవు.
- ఎల్.శర్మణ్, జేసీ