తెల్లబంగారం ధర దిగువకు
తెల్లబంగారం ధర దిగువకు
Published Thu, Feb 2 2017 11:01 PM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
ఆదోని: కొన్ని రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన పత్తి ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. గురువారం క్వింటాలు ధర రూ.4169- రూ. 5909 వరకు పలికింది. వారం క్రితం గరిష్టంగా రూ.6600కు చేరింది. సంక్రాంతి పండుగ ముందు నుంచి రోజు క్వింటాలుపై రూ.వంద నుంచి రూ.150 వరకు పెరుగుతూ వచ్చింది. పండుగ తరువాత కూడా ధర జోరు కొనసాగింది. అయితే వారం రోజులుగా ధర ఎలా పెరిగిందో అలాగే రోజు వంద నుంచి రూ.150 చొప్పున తగ్గుతూ వస్తోంది.
దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలవారు అంచనా. ఫలితంగా రైతులు తమ పత్తిని పెద్ద ఎత్తున మార్కెట్‌కు తెచ్చి అమ్ముకుంటున్నారు. గురువారం ఒక్కరోజే 13,971 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. అంతకు ముందు బుధవారం నాలుగు క్వింటాళ్లు ఎక్కువగా 17052 క్వింటాళ్లు వచ్చింది. వారం క్రితం ధరతో పోల్చుకుంటే రైతులు క్వింటాలుపై దాదాపు రూ.500 వరకు నష్టపోతున్నారు. గురువారం ఒక్క రోజే దాదాపు రూ70లక్షల వరకు నష్టపోయినట్లు అంచనా.
Advertisement
Advertisement