జీరో కమాల్
►చక్కర, సబ్బులు, నూనెసహా నిత్యావసర వస్తువుల అక్రమ దందా
►రోజూ రూ.10 లక్షల పన్నుఎగవేస్తూ ఒకే బ్రాండ్ సబ్బుల దిగుమతి
►చక్కెర, నూనెలదిగుమతిలోనూ రోజుకు రూ.లక్షల్లో పన్ను ఎగవేత
►సర్కారు ఆదాయానికి ప్రతినెలా రూ.100 కోట్లకుపైగా గండి
►జోరుగా కల్తీనూనె వ్యాపారం.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం
►కరీంనగర్ టవర్‌సర్కిల్, గంజ్ ప్రాంతాలు అడ్డాగా వ్యాపారం
►కార్పొరేషన్‌కు చెందిన ముఖ్య నేత అండతో చెలరేగుతున్న వైనం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: ‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ అక్రమాలకు అనర్హం’ అన్నట్లుగా జిల్లాలో పరిస్థితి తయారైంది. ఒకవైపు కల్తీ, మరోవైపు జీరో దందాతో సరుకులు దిగుమతి అవుతున్నాయి. చక్కెర, సబ్బులు, సర్ఫ్ వంటి వస్తువులు పన్నులు చెల్లించకుండా లారీల కొద్దీ దిగుమతి అవుతుండగా... పామాయిల్, పల్లీ, సన్‌ఫ్లవర్ నూనెల పేరుతో తయారు చేసిన కల్తీ నూనెల వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతిరోజూ రూ.కోట్లలో పన్నును ఎగవేస్తూ కొందరు వ్యాపారులు జీరో దందా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. జీరో దందా ఫలితంగా ప్రతినెలా పన్నుల రూపంలో సర్కారు ఖజానాకు చేరాల్సిన దాదాపు రూ.100 కోట్లు జీరో దందా కేటుగాళ్ల జేబుల్లోకి వెళుతోంది. మరోవైపు ఈ కేటుగాళ్లకు నగర పాలక సంస్థకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతో చెలరేగుతున్నారు.
ఒకే బ్రాండ్ సబ్బుతో సర్కారుకు రూ.కోటిన్నర గండి
కరీంనగర్ జిల్లాలో బట్టల సబ్బుల్లో ఓ బ్రాండ్‌కు సంబంధించిన సబ్బుల విక్రయాలు విరివిగా అమ్ముడుపోతున్నారుు. తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఈ బ్రాండ్ సబ్బు తయారవుతోంది. జిల్లాలో ప్రతిరోజు ఎన్ని బట్టల సబ్బులు అమ్ముడుపోతాయో అందులో సగం వాటా ఈ బ్రాండ్‌దే. ప్రతిరోజూ ఈ సబ్బుల కాటన్లతో జిల్లాకు లారీలు వస్తుంటారుు. నెలకు సగటున 40కిపైగా లారీలు జిల్లాకు వస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఒక్కో లారీకి సుమారు రూ.5 లక్షల వరకు టాక్స్ చెల్లించాలి. ఆ మేరకు ట్యాక్స్ చెల్లించినప్పటికీ సదరు సబ్బుల డీలర్‌కు ఒక్కో లారీలోని కాటన్లను అమ్మడం ద్వారా రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. కానీ సదరు డీలర్ టాక్స్ చెల్లించకుండా తెలివిగా ఎత్తులు వేస్తున్నాడు. నెలలో 5 నుంచి 10 లారీలకు మాత్రమే టాక్స్ కట్టి మిగతా వాటిని అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల ఒక్కోలారీకి రూ.5 లక్షల టాక్స్ మిగలడమే కాకుండా మరో రూ.5 లక్షల లాభం చేకూరుతుందని తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, లక్షెట్టిపేటతోపాటు పలు ప్రాంతాలకు నగరం నుంచే ఈ సబ్బులను సరఫరా చేస్తున్నారు.
టవర్‌సర్కిల్ అడ్డాగా నగరానికి చెందిన ఓ వ్యాపారి ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యాపారి జీరో దందాకు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఈ వ్యాపారి జీరో దందా విషయం తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధి మద్దతు ఉండటంతో కిమ్మనలేకపోతున్నారు. దీనికితోడు సదరు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో తమకెందుకులే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
చక్కెర దందాతో రూ.కోటి గండి
చక్కెర విషయంలోనూ ఇదే తంతు. ప్రతినెలా వందల కొద్దీ చక్కెర లారీలు జిల్లాకు వస్తుంటాయి. ఒక్క జిల్లా కేంద్రానికే ప్రతిరోజు సుమారు 5 లారీల చక్కెర దిగుమతి అవుతుంది. నిబంధనల ప్రకారం ఒక్కో లారీ లోడ్‌కు రూ.50 వేల మేరకు పన్ను చెల్లించాలి. ఆ పన్నులతో కలిపి అమ్మకాలు నిర్వహించాలి. కానీ టాక్స్‌లు చెల్లించకుండా రిటైల్ వ్యాపారులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. తద్వారా ప్రతినెలా ప్రభుత్వ ఖజానాకు రూ.కోటికి పైగా గండికొడుతున్నారు.
ప్రతినెలా మామూళ్లు వచ్చి చేరుతుండడంతోనే అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పుసహా పలు రకాల పప్పుల విషయంలోనూ ఇదే తంతు. నగరంలోని గంజ్ కేంద్రంగా కొందరు వ్యాపారులు రశీదులు, ట్యాక్స్‌లు లేకుండానే జీరో దందా కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పప్పు, చక్కెర వంటి వాటిని శివారు ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు.
కల్తీ నూనె దందా...
జిల్లాలో కల్తీ నూనె వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోరుుంది. నిబంధనల ప్రకారం లూజ్ నూనె అమ్మకాలు చేయరాదు. కాని నగరంలోని పలు వ్యాపార ప్రాంతాల్లో వందలాదిడ్రమ్ముల్లో నూనె అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పామాయిల్, పల్లీ, సన్‌ఫ్లవర్ పేరుతో శుద్ధి చేయకుండా కల్తీ నూనె విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటితోపాటు కొందరు అక్రమార్కులు కరీంనగర్ శివారు ప్రాంతాలు, సమీప గ్రామాల్లో డ్రమ్ముల కొద్దీ నూనెను నిల్వ చేస్తున్నారు. అక్కడే క్యాన్లు, టిన్లు, ప్యాకెట్లలో నూనెను నింపి కొత్త కొత్త పేర్లతో ప్యాకింగ్ చేస్తూ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రతి రోజు నకిలీ బ్రాండ్ల నూనె ప్యాకెట్లు, క్యాన్ల వ్యాపారం సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటున్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా తయారు చేస్తున్న నూనెల్లో ప్రమాదకరమైన రసాయాలను కలపడమే కాకుండా శుద్ధి చేయకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
గుట్కా రూటే సపరేటు
ఒకప్పుడు జిల్లాలో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. గుట్కా అక్రమార్కులకు కరీంనగర్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల అండ పుష్కలంగా ఉంది. ఇందులో ఒకరు గుట్కా దందాలో కీలక భాగస్వామి కాగా... మరొక ముఖ్యనేత అందడండలున్నారుు. ఇటీవల కరీంనగర్ మండలంలో సుమారు రూ.2.5 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. రంగంలోకి దిగిన ముఖ్యనేత తన అధికారిన్ని అడ్డుపెట్టి గుట్కా బయటకు రాకుండా దొరికి చోటనే తాళలు వేయిం చారు. ఈ కే సులో ప్రమేయమున్న తన నమ్మకస్తున్ని చాకచక్యంగా తప్పించారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది.