సాక్షిప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. గత పదిహేనేళ్లుగా పామ్ తోటలు సాగుచేసే రైతులు నెమ్మదిగా పెరుగుతున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పామాయిల్‌కు డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలు కల్పిస్తూ ఈ పంట సాగును ప్రోత్సహిస్తోంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మంలో 17,834 ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేయగా.. ప్రస్తుతం అది 73,938 ఎకరాలకు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈ పంట సాగు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు ఉండటంతో ఒక వైపు పంట సాగు విస్తరిస్తుండగా, పామాయిల్‌ను ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటల్లో టీఎస్ ఆయిల్‌ఫెడ్ కంపెనీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో ఐదు వరకు ఫ్యాక్టరీలు రానున్నాయి.
సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వాల దృష్టి..
గ్లోబల్ ఈడిబుల్ ఆయిల్ మార్కెట్‌లో వ్యాపారం సాగే తొమ్మిది ప్రధాన నూనెల్లో పామాయిల్ ఒకటి. కాగా, ప్రపంచ మార్కెట్‌లో ఇండోనేసియా, మలేసియా మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచ ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ రెండు దేశాల నుంచి 90 శాతం వరకు వాటా ఉంది. ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ పామాయిల్‌కు డిమాండ్ పెరగడంతో ఇక్కడ కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.
ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. 2020 వరకు తెలంగాణలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్, రుచిసోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు ఉండగా, ప్రస్తుతం వీటితోపాటు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఫ్యాక్టరీ జోన్లలో నర్సరీలు కూడా ఏర్పాటయ్యాయి.
ప్రాసెసింగ్ ప్లాంట్లకు ప్రాధాన్యం..
పామాయిల్ దీర్ఘకాల పంట కావడంతో దేశీయంగా నూనె లభ్యతను పెంపొందించే ప్రక్రియలో ఆయిల్‌పామ్ సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాయి.
2000 సంవత్సరంలో ఈ పంట 17,834 ఎకరాల్లో సాగవగా, 2020 నాటికి 42,899 ఎకరాలకు, ప్రస్తుతం 73,938 ఎకరాలకు చేరుకుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరుగుతూ వచ్చింది. 2010లో టన్ను గెలల ధర రూ.సగటున రూ.5,136 ఉండగా 2022 నాటికి రూ.18,069కి చేరింది
మొదట్లో రెండు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి..
2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. తొలుత 5 టన్నుల సామర్థ్యంతో ప్రారంభించగా, పలు దఫాలుగా సామర్థ్యం పెరుగుతూ, ప్రస్తుతం 60 టన్నులకు చేరింది. ఇక్కడ పామాయిల్ గెలలను 120 నుంచి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు స్టీమ్ చేస్తారు. ఆ తర్వాత యంత్రాలతో గెలల నుంచి ముడి నూనెను తీసి, నేరుగా పైపులైన్‌ల ద్వారా పెద్ద ట్యాంకుల్లోకి పంపి నిల్వ ఉంచుతారు.
ఇలా నిల్వ చేసిన క్రూడాయిల్‌ను లారీ ట్యాంకర్లలో ప్రాసెస్ యూనిట్లకు తరలిస్తారు. స్టీమ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను, నూనె గింజలను (నెట్) వేరు చేస్తారు. గెలల వ్యర్థాలను టన్నుల లెక్కన ఇతర అనుబంధ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. అశ్వరావుపేట తర్వాత దమ్మపేట మండలం అప్పారావుపేటలో 2017 ఏప్రిల్‌లో మరో ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
రూ.80 కోట్ల వ్యయం, మలేసియా టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించారు. తొలుత ఇది 60 టన్నుల సామర్థ్యంతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 90 టన్నులకు పెరిగింది. ఈ ఫ్యాక్టరీకి 2018లో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ రంగ విభాగంలో ఉత్తమ ఫ్యాక్టరీ అవార్డు దక్కింది. అదే ఏడాది కేంద్రం ద్వారా గ్లోబల్ అవార్డు వచ్చింది.
కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం..
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 3 ఫ్యాక్టరీలు ఉండగా.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అశ్వాపురం మండలం బి.జె.కొత్తూరు, ములకలపల్లి గ్రామాల్లో నూతనంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో పామాయిల్ తోటల సాగు మరింతగా విస్తరించి దేశీయంగా నెలకొన్న కొరతను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈయనే సాగు మొదలు పెట్టింది..
1991లో ప్రభుత్వ సబ్సిడీ ఏమీ లేకుండా.. అశ్వారావుపేటకు చెందిన పిన్నమనేని మురళి అనే రైతు ఆయిల్‌పామ్ పంట సాగును ప్రయోగాత్మకంగా మొదట ఐదు ఎకరాల్లో ప్రారంభించారు. మొదట్లో ఆయన మొక్క రూ.25 చొప్పున కొనుగోలు చేశారు.
సమీపంలో గెలల కొనుగోలు, ఫ్యాక్టరీ లేనప్పటికీ.. ఆయన ఈ పంట సాగు చేయడంతో మిగిలిన రైతులు కూడా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం మురళి 100 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటం, ఫ్యాక్టరీలు అందుబాటులో ఉండటంతో ఈ పంట ఆదాయం మెరుగ్గా మారిందని మురళి చెప్పారు.
లాభదాయకమైన పంట..
పామాయిల్ సాగు ద్వారా రైతులకు ఏటా లక్షల్లో ఆదాయం వస్తుంది. పంట సాగు చేసిన నాలుగేళ్లలో ఆదాయం ప్రారంభమవుతుంది. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పామాయిల్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఫ్యాక్టరీలు సైతం రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. –జినుగు మరియన్న, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం
ఎకరం ఆయిల్‌పామ్‌సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ..
మొక్కలకు(ఎకరానికి 57 మొక్కలు): రూ.11,600
ఎరువులు, అంతర పంటలకు ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు: రూ.16,800
బిందు సేద్యం: రూ.22,518
మొత్తం రూ. 50,918
Comments
Please login to add a commentAdd a comment