జ్యోతి వెలిగించి సమిట్ ప్రారంభిస్తున్న తోమర్. చిత్రంలో నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వంట నూనెలలో స్వావలంబనే తమ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ‘వంట నూనె– ఆయిల్ పామ్ జాతీయ మిషన్ బిజినెస్ సమిట్’ను హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పామాయిల్ రంగంలో దేశం స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ జాతీయమిషన్‌కు వనరుల కొరత ఉండబోదని తెలిపారు.
ప్రస్తుతం సుమారు 3 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగులో ఉండగా, ఆయిల్ పామ్ సేద్యానికి అనువుగా ఉన్న 28 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.
కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి మాట్లాడుతూ మనం వంట నూనె దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్‌ను ప్రోత్సహించడానికి కేరళ ప్రభు త్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు.
30 లక్షల ఎకరాలు ఆయిల్‌పాం: నిరంజన్‌రెడ్డి
తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు ఆయిల్‌పాం లక్ష్యంగా పెట్టుకుందని, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్‌పామ్ కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు కేటాయించాలని ఆయన కోరారు.
ఆయిల్ పామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ. 15 వేలు కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని కోరుతూ కేంద్ర మంత్రి తోమర్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు పూర్తి సహకారం అందిస్తామని తోమర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, 3–4 సంవత్సరాలలో తెలంగాణ దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ఉత్పత్తి ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పంపిణీ కూడా జరిగింది. అంతకుముందు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ప్రభుత్వ దార్శనికతను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment