చేతి‘చమురు’ | Palm oil for sale at a higher price than the market rate | Sakshi
Sakshi News home page

చేతి‘చమురు’

Published Sun, Aug 17 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

చేతి‘చమురు’

చేతి‘చమురు’

  • చౌకడిపోలలో వింతపోకడ
  •  మార్కెట్ రేటు కంటే ఎక్కువ  ధరకు పామాయిల్ విక్రయం
  •  లబోదిబోమంటున్న రేషన్ కార్డుదారులు
  • విశాఖ రూరల్/పెదగంట్యాడ : ప్రజాపంపిణీ వ్యవస్థ రూపురేఖలు మారనున్నాయి. పేదవాడి ‘చౌక’ సరకులు ఒక్కొక్కటిగా మాయం కానున్నాయి. అమ్మహస్తం పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది. సరకుల్లో కోత విధించి ఎన్‌టీఆర్ ప్రజా పంపిణీ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న సరకుల ధరలను పెంచాలని భావిస్తోంది.

    దీనిపై పూర్తి విధి విధానాల రూపకల్పనకు మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. పదేళ్ల క్రితం టీడీపీ హయాంలో చేపట్టిన విధానాలనే మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తొలుతగా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీ ధరకు విక్రయించాల్సిన వంట నూనెను సరఫరా చేసే ఏర్పాట్లు చేయకుండా విజయ పామాలిన్‌ను అందిస్తోంది. దీన్ని మార్కెట్ ధరకే విక్రయిస్తుండడంతో కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది.
     
    6 నెలలుగా పామాయిల్ లేదు

    జిల్లాలో 12.5 లక్షల తెల్లరే షన్‌కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతి నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్‌ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. గత మార్చి నుంచి ఉత్పత్తి కొరత పేరుతో పామాయిల్ పంపిణీ పూర్తిగా ఆపేశారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌డిపోల్లో సరఫరా చేసే పామోలిన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ విడుదల చేయాల్సి ఉంటుంది. గత ఆరు నెలలుగా రాయితీ నిధులు జమ చేయడం లేదు. దీంతో సరఫరా నిలిచిపోయింది.

    పామోలిన్ లీటర్ ధర రూ.63.50 ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూ.8.50 చెల్లించి.. కార్డుదారులకు రూ.40కే చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మలేషియా నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్‌ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయింపులు చేసేవారు. కానీ గత 6 నెలలుగా పామాయిల్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో లీటర్ పామోలిన్‌ను రూ.60 నుంచి రూ.65కు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
     
    రేషన్‌షాపుల్లో మళ్లీ ‘విజయ’ పామోలిన్
     
    చౌక దుకాణాల ద్వారా పేదలకు తక్కువ ధరలకు నిత్యావసరాలను విక్రయించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా వారిపై మరింత భారం మోపుతోంది. వంటనూనెను సబ్సిడీ ద్వారా ఇవ్వకుండా అందుకు భిన్నంగా మార్కెట్ ధరకు విక్రయిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కార్డుదారులు సైతం ఆయిల్‌ను కొనుగోలు చేయలేక లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వం నిన్నమొన్నటి వరకూ రూ.40లకే పామోలిన్ ప్యాకెట్‌ను విక్రయించింది.

    ప్రస్తుతం పామాయిల్ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫెడరేషన్‌కు చెందిన ‘విజయ’ ప్రీమియం బ్రాండ్ పామోలిన్, రిఫైన్డ్ సన్‌ప్లవర్ వంటనూనెను చౌకదుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్‌కు చెందిన పామోలిన్ ప్యాకెట్ (లీటరు) రూ.62గా ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఇతర బ్రాండ్‌ల పామాయిల్‌లు కూడా అదే ధరకు లభ్యమవుతున్నాయి. విజయ బ్రాండ్ పామాయిల్ విధిగా విక్రయించాలని అధికారులు ఆదేశించడం వల్ల వీటిని విక్రయిస్తున్నట్టు కొంతమంది డీలర్లు చెబుతున్నారు. ప్యాకెట్ అమ్మితే వచ్చే లాభం కన్నా లబ్ధిదారులు పెట్టే శాపనార్థాలు ఎక్కువగా ఉన్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే బ్రాండ్ నూనె విక్రయించేవారని, మళ్లీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విజయ ప్రీమియం బ్రాండ్ తెరపైకి రావడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాము మాత్రం ఎవరిపైన ఒత్తిడి తెచ్చి విజయ వంటనూనె విక్రయించాలని చెప్పలేదని సర్కిల్-3 ఏఎస్‌ఓ పి.భీమశంకరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు ఉన్నందున ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు డిపోల ద్వారా విజయ బ్రాండ్ వంటనూనెను లబ్ధిదారులకు విక్రయిస్తున్నట్టు తెలిపారు.
     
    నెలకో వస్తువు మాయం


    తెల్లరేషన్ కార్డుదారులకు తొమ్మిది రకాల నిత్యావసరాల సరకులు అందించేందుకు గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా పామాయిల్ లీటర్, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు కిలోచొప్పున, పంచదార 500 గ్రామాలు, కారం 250 గ్రాములు, పసుపు 100 గ్రామాలు, చింతపండు అరకిలో కలిపి రూ.185కే అందిస్తామని ప్రకటించింది. కానీ ఒక్క నెల కూడా సక్రమంగా సరకులు పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. ఈ సరకుల్లో నాణ్యత లేకపోవడంతో కార్డుదారులు వాటిపై ఆసక్తి చూపించలేదు. ఫలితంగా తొలుత కారం, పసుపు, చింతపండు పంపిణీని నిలిపివేశారు. పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి పంపిణీ చేస్తున్నప్పటికీ ఎవరూ విడిపించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం కందిపప్పు, పంచదార మినహా మిగిలిన అన్ని సరకుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఒకటి, రెండు సరకుల సరఫరాకే పరిమితమైన ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement