దిగుమతుల యోచన మానుకోరా?
సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, పామాయిల్ తదితర వ్యవసాయోత్పత్తుల దిగుమతులను వచ్చే ఏడాది 50 శాతం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శాసనసభ అంచనాల కమిటీ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఉత్పత్తి పెంచడంపై దృష్టిపెట్టకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. ‘ఉల్లిగడ్డను మహారాష్ట్ర, పూలను కర్ణాటక, బియ్యాన్ని పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి, పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి, పామాయిల్‌ను విదేశాల నుంచి.. దిగుమతి చేసుకోవడమేనా పని?... రైతులకు సబ్సిడీలిచ్చి ఆయా పంటలను బాగా పండించి.. ఎగుమతి చేసి ఆదాయం సమకూర్చుకోవాలనే ధ్యాసే మీకు పట్టదా? దిగుమతి ఆలోచనను అసలు మానుకోరా?’ అని శాసనసభ అంచనాల కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు.
గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు ఉల్లిపాయలు, కూరగాయల కొరత, పామాయిల్ దిగుమతి వంటి అంశాలపై సమీక్షించారు. చెరుకు ముత్యంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె.ఆర్.ఆమోస్, మల్లాది విష్ణు, పి.నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, పంతం గాంధీ తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ ఉత్పత్తిలో మన రాష్ర్టం అగ్రస్థానంలో ఉన్నా... విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. పామాయిల్ పంటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
పామాయిల్‌ను ఎగుమతి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన రాకపోగా... రూ.వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం శోచనీయమన్నారు. ఉల్లిపాయల తీవ్రకొరతకు దారితీసిన కారణాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది ఉల్లి ధర పడిపోవడంతో గిట్టుబాటు లేదనే భావనతో రైతులు ఈ ఏడాది ఆ పంటవైపు చూడలేదని అధికారులు చెప్పారు. దీనికితోడు మహారాష్ర్టలోనే ఉల్లికి కొరత రావడంతో మన రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. దీనిపై స్పందించిన సభ్యులు ఉల్లికి కొరత వస్తుందని తెలిసీ ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.