ఎన్నికల ప్రభావం ఇప్పుడు పామాయిల్ సరఫరాపై పడింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించని కారణంగా జిల్లాలో తెల్లరేషన్ కార్డుదారులు వంట నూనెకోసం తంటాలు పడాల్సి వస్తోంది. రాయితీతో అందించే పామాయిల్ ఏప్రిల్ కోటా విడుదల చేయని కారణంగా ఈనెల కూడా అందేపరిస్థితి కనిపించడం లేదు. బయట వంటనూనెల ధరలు మండిపోతున్న తరుణంలో కొనుగోలుచేయలేక లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
పాలమూరు, న్యూస్‌లైన్: జిల్లాలో 2,304 రేషన్‌షాపులకు సంబంధించి మొత్తం 10.15లక్షల తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. మే నెలకు సంబంధించి జిల్లాలోని రేషన్ దుకాణాలకు పామాయిల్ కోటాను నిలిపేశారు. కొత్త సర్కారు కొలువు దీరిన తర్వాతే పామాయిల్ సరఫరా ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో తెలుపు రేషన్‌కార్డుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లబ్ధిదారులకు ప్రతినెలా రూ.40కే పామాయిల్ ప్యాకెట్‌ను రాయితీపై అందించేవారు. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన కోటా ఆగిపోవడంతో లబ్ధిదారులు రూ.65 నుంచి రూ.80 వరకు చెల్లించి పామాయిల్ ప్యాకెట్లను కొనుగోలు చేయాల్సి రావడంతో రేషన్ కార్డుదారులకు భారంగా మారింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వమే రేషన్ దుకాణాలకు రాయితీతో కూడిన పామాయిల్‌ను కేటాయించేది. కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే కేటాయింపు నిలిపేసింది.
దీంతో ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం లేకపోవడం, ఎన్నికలు జరుగుతుండటంతో ఏప్రిల్ కోటా విడుదల కాలేదు. మార్చిలో విడుదలైన కోటాలో మిగులును ఏప్రిల్‌లో పంపిణీచేశారు. ఇక ఈనెల నుంచి కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు రేషన్ దుకాణాల్లో పామాయిల్ ఉండదని చెప్పడంతో పేదలు నిరాశకు గురవుతున్నారు. రేషన్‌దుకాణాల్లో కిలో పామాయిల్ రూ.40కు అందిస్తుండగా బహిరంగ మార్కెట్‌లో దీనిధర రూ.59 నుంచి రూ.65 వరకు ఉంది. సన్‌ఫ్లవర్ నూనె ధర రూ.85 నుంచి రూ.90 వరకు పలుకుతోంది.
ఆందోళనలో కార్డుదారులు
జిల్లాలో 10.15 లక్షల తెలుపు రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటన్నింటికీ ప్రతినెలా పామాయిల్‌ను పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాకు ప్రతినెలా వెయ్యి టన్నుల పామాయిల్ కోటా విడుదలవుతోంది. జిల్లాలో 14 ఎంఎల్‌ఎస్ పాయింట్ల (గోదాంల) ద్వారా అన్ని మండలాలకు సరఫరా చేస్తుంటారు. జిల్లాలో 2,304మంది రేషన్‌డీలర్లు ఉన్నారు. వీరిలో 20 శాతం మంది ప్రతినెలా మాదిరిగానే మే నెల పామాయిల్‌కు డీడీలు చెల్లించారు. కోటా విడుదల కాదని తెలియడంతో ఆందోళనలో పడ్డారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో కొందరికి ఏప్రిల్‌లో మిగిలిన ప్యాకెట్లను సరఫరా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు పామాయిల్ కోటా రాదని అధికారులు స్పష్టంచేస్తున్న నేపథ్యంలో ఇటు డీలర్లు, అటు పేదలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కోటా నిల్!
Published Mon, May 12 2014 3:34 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement