ఈ నెల నూనె లేనట్టే
- ఇంత వరకు దిగుమతి కాని పామోలిన్
- తెల్లకార్డుగలవారిపై రూ.3.70 కోట్ల అదనపు భారం
నర్సీపట్నం: జూలై నెలకు పామాయిల్ సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ డీలర్లు డీడీలు తీయకపోవడం దీనికి నిదర్శనం. జిల్లాలో ప్రస్తుతం 12,34,104 కార్డులున్నాయి. ఒక్కొక్క కార్డుపై నెలకు లీటరు పామాయిల్ నూనె సరఫరా చేసేవారు.
నూనె సరఫరా ఎప్పటినుంచో కొనసాగుతున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అమ్మహస్తం పథకంలోకి చేర్చింది. వాస్తవానికి పౌరసరఫరాల కోటాగా జిల్లాకు 12 లక్షల 34వేల 104 లీటర్ల పామాయిల్‌ను సరఫరా చేయాలి. మలేషియా నుంచి కాకినాడ పోర్టుకు దిగుమతయ్యే పామాయిల్‌ను రాష్ట్రంలోని 18 జిల్లాలకు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం దిగుమతి లేకపోవడంతో సరఫరా నిలిచిపోయింది.
రేషన్ కార్డుపై రూ.40కు లీటరు నూనె సరఫరా చేస్తున్నారు. దీని ధర బయటి మార్కెట్లో రూ.70 వరకు పలుకుతోంది. ప్రస్తుతం కోటాలో పామాయిల్ సరఫరా చేయకపోవడం వల్ల కార్డుదారులు బయట రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారులు సుమారు రూ.3.70 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం.