హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు ఫిబ్రవరిలో 9,83,608 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2021 ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనె భారత్‌కు సరఫరా అయింది. ప్రధానంగా శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో శుద్ది చేసిన పామాయిల్ 6,000 నుంచి ఏకంగా 3,02,928 టన్నులకు చేరింది.
వంటలకు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలో వాడే నూనెలు 42,039 నుంచి 36,389 టన్నులకు వచ్చి చేరింది. ఇతర ఉత్పత్తులకు వినియోగించే నూనెలతో కలిపి మొత్తం నూనెల దిగుమతులు 8,38,607 నుంచి 10,19,997 టన్నులకు ఎగశాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య అన్ని రకాల నూనెలు 7 శాతం అధికమై 46,94,760 టన్నులుగా ఉంది. శుద్ధి చేసిన పామోలిన్ 21,601 నుంచి 5,19,450 టన్నులకు చేరాయి. ముడి పామాయిల్ 24,89,105 నుంచి 15,62,639 టన్నులకు దిగొచ్చింది. ప్రతి నెల సగటున 1.75–2 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ విదేశాల నుంచి భారత్‌కు వస్తోంది.
యుద్ధం కొనసాగితే..
‘రష్యా–ఉక్రెయిన్ వివాదం సన్‌ఫ్లవర్ (పొద్దు తిరుగుడు) నూనె సరఫరాకు అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 2022లో దాదాపు 1,52,000 టన్నులు భారతదేశానికి దిగుమతైంది. అదే పరిమాణం ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు బయలుదేరిన ఓడలు ప్రస్తుత నెలలో భారతీయ ఓడరేవులకు చేరుకుంటాయి. యుద్ధం కొనసాగితే తరువాతి నెలల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ రవాణా తగ్గుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీయంగా సోయాబీన్, ఆవనూనెల అధిక లభ్యత ఉపశమనం కలిగిస్తుంది.
దేశీయ విక్రయాల పరిమితిని 20 నుంచి 30 శాతానికి పెంచుతూ మార్చి 9న ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇండోనేషియా ఎగుమతి పరిమాణాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే ప్రపంచ ఎగుమతి సరఫరాలను కఠినతరం చేస్తుంది. ఈ అంశాలు అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరల్లో గత కొన్ని రోజులుగా అధిక అస్థిరతకు దారితీస్తున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్‌కు వస్తోంది. ముడి సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతోంది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి భారత్‌కు సరఫరా అవుతోంది’ అని అసోసియేషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment