
పామాయిల్ రైతు నెత్తిన ‘క్రూడ్’ పిడుగు!
అంతర్జాతీయంగా తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు పామాయిల్ రైతుల పాలిట పిడుగులయ్యాయి. తగ్గిన క్రూడాయిల్ ధరలతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గి హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో పామాయిల్ రైతులు మాత్రం గొల్లుమంటున్నారు. పామాయిల్ దిగుమతి కోసం భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వం పామాయిల్ రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్ధంకాకపోతుండడం విషాదకరం.
- పుట్టా సోమన్న చౌదరి
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు(క్రూడాయిల్) బ్యారల్ ధర తాజాగా 62 డాలర్లకు పడిపోవడంతో పామాయిల్ ముడి నూనె ధరపైన కూడా తీవ్రప్రభావం పడింది. ఈ కారణంగా స్థానికంగా టన్ను పామాయిల్ గెలల ధర కూడా భారీగా పతనమవుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు నెల క్రితం రూ. 8,400 ఉన్న ధర తొలుత రూ. 6,400 కు, ప్రస్తుతం రూ. 5,650కు పడిపోయింది. ధర వేగంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ రైతులు ఈ పంట కొనసాగింపుపై పునరాలోచనలో పడ్డారు. పామాయిల్ తోటల పెంపకం మొదటి నుంచీ ఒడిదుడుకులతోనే సాగుతోంది. ఉద్యానవన పంటల్లో రాజుగా పేరుపొందిన పామాయిల్ తోటల పెంపకం అంతర్జాతీయ ముడి చమురు ధరలతో ముడిపడి ఉండటం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ కారణంగా ముడిచమురు ధరలతోపాటు తరచూ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ రైతులను గందరగోళపరుస్తున్నాయి. ధరలు బాగా తగ్గినప్పుడు కనీస మద్దతు ధరను అమలుపర్చకపోవటం వల్ల రైతులు నష్టాలపాలవుతున్నారు.
తెలుగు రైతులు భేష్
ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించిన మన దేశం నూనె గింజల సాగు విషయంలో చతికిలపడి.. ఏటా రూ. 40 వేల కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నది. 2012-13లో 70 లక్షల టన్నుల పామాయిల్ దిగుమతైంది. ఇతర వంట నూనెల కంటే పామాయిల్ ధర తక్కువ. అందువల్లే మన దేశంలో వాడే వంట నూనెల్లో మూడొంతుల వాటా పామాయిల్‌దే. ప్రపంచంలో ఉత్పత్తయ్యే పామాయిల్‌లో 40 శాతాన్ని మనమే వాడుతున్నాం. ఏటా వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకోక తప్పటం లేదు. నూనెగింజల సాగులో స్వయం సమృద్ధి సాధించడమే ఈ సమస్యకు పరిష్కారం. అయితే, భారత ప్రభుత్వం అరకొర ప్రోత్సాహం వల్ల అవసరమైనంతగా సాగు విస్తరించడం లేదు. గత ఇరవయ్యేళ్లలో 6 లక్షల ఎకరాల్లో మాత్రమే పామాయిల్ తోటల విస్తీర్ణం పెరిగింది. అయితే, 60 వేలకు పైగా తెలుగు రైతులు మాత్రం తెగువను ప్రదర్శించి పామాయిల్ సాగు చేపట్టారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 4 లక్షల 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగులోకి వచ్చింది. ఇతర 5 రాష్ట్రాల్లో కలిపి చూసినా లక్షా 50 వేల ఎకరాలకు మించదు. పామాయిల్ సాగు విస్తీర్ణంలో పశ్చిమ, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాలు దేశంలోనే మొదటి 3 స్థానాలు పొందాయి. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కూడా పామాయిల్ తోటలున్నాయి.
సంక్షోభాల చరిత్ర..
పామాయిల్ రైతులు గతంలో మూడుసార్లు తీవ్రస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన రైతులు అప్పట్లోనే 30 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలను నరికివేశారు. టన్ను గెలలకు కనీసం రూ. 5,800 ధర ఉండేలా చూస్తామని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో తిరిగి పామాయిల్ సాగు కొనసాగింది. 2012 మార్చిలో ధర రూ. 5,100కు దిగజారినప్పుడు తోటల నరికివేతకు రైతులు సిద్ధపడ్డారు. అప్పటి కిరణ్‌కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల వల్ల టన్నుకు రూ. 7,516 వరకు రైతులకు గిట్టుబాటైంది. క్రమంగా రికార్డు స్థాయిలో రూ. 8,500కు పెరిగి ప్రస్తుతం రూ. 5,650కి దిగజారింది.
ప్రోత్సాహ లోపమే సమస్య
మొక్కలు నాటిన 4 ఏళ్లకు గాని ఫలసాయం చేతికి అందదు. ఈ కారణంగా చిన్న రైతులు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత వల్ల పెద్ద రైతులు మాత్రమే మొగ్గుచూపుతున్నారు. సాగు విస్తీర్ణం పెంచాలంటే హెక్టారుకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 30 వేలతోపాటు అదనంగా రూ. 20 వేల ప్రత్యేక నగదు ప్రోత్సాహాన్నివ్వాలన్నది రైతుల డిమాండ్. ఏటా రూ. 10,800 కోట్ల చొప్పున ఆరేళ్లపాటు కేటాయిస్తే 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరింపజేసి, విదేశీ మారకద్రవ్యాన్ని 60% వరకు ఆదా చేసుకోవచ్చని జాతీయ వ్యవసాయ ధరల నిర్ధారణ కమిషన్ (సీఏసీసీ) కేంద్రానికి సూచించినా స్పందన కరువైంది.
వంట నూనెల కొరత దేశాన్ని పీడిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగునుఅవసరమైనంతగా ప్రోత్సహించడం లేదు. ముడిచమురు ధర ఎంత పతనమైనా పామాయిల్ గెలల ధర కనీస మద్దతు ధరకన్నా తగ్గకుండా ఉండేలా ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నది రైతుల ఆకాంక్ష. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంటులో ప్రస్తావించారు. ఏది ఏమైనా వంట నూనెల కొరత సమస్యకు పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం గుర్తించాలి.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు. మొబైల్: 94403 39682)