పామాయిల్ పరేషన్
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: పండగపూటా పేదలకు పస్తులు తప్పడం లేదు. పండగొచ్చినా ఇంకా ప్రభుత్వ చౌకదుకాణాలకు పామాయిల్ చేరలేదు. దీంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుకాణానికి వెళితే ‘మమ్మల్ని ఏం చేయమంటారు. వస్తే కదా ఇచ్చేది’ అని డీలర్లు చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మండల స్టాకిస్ట్ పాయింట్లలో పనిచేసే అధికారులు అయినవారికి ఆకుల్లో, కానివారికి కం చాల్లో అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
తమకు అనుకూలంగా ఉన్న రేషన్‌దుకాణాలకు మాత్రమే పామాయిల్ పంపారని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పామాయిల్ పరిస్థితే కాకుండా అమ్మహస్తం సరుకుల విషయంలోనూ ఎంఎల్‌ఎస్ పాయింట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లాలో మొత్తం 1872 రేషన్‌దుకాణాలు ఉండగా సగానికిపైగా దుకాణాలకు ఇంకా పామాయిల్ చేరలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పామాయిల్ పంపిణీ చేయాలని కార్డుదారులు కోరుతున్నారు.