‘అమ్మహస్తం’ అదృశ్యమయ్యేనా?
మే నెల రేషన్ సరఫరా ఏదీ?
నిలిచిపోయిన ఏడు రకాల సరుకులు
సరుకుల పంపిణీకి ముగిసిన కాంట్రాక్టు
పట్టించుకోని పౌరసరఫరాల శాఖ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదలకు రేషన్ సరుకుల పంపిణీ అరకొరగా మారింది. మే నెల రేషన్ లో రెండు, మూడు మినహా మిగతా సరుకుల సరఫరా లేకుండా పోయింది. నెల ప్రారంభమై వారం రోజులు గడిచినా బియ్యం, గోధుమ పిండి తప్ప మిగిలిన సరుకులు చౌకధర దుకాణాలకు చేరలేదు. ముఖ్యంగా పామాయిల్‌తో పాటు చక్కెర, కందిపప్పు, చింతపండు, పసుపు, కారం, ఉప్పు సరఫరా లేకుండా పోయింది.
గతేడాది ‘అమ్మహస్తం’ కింద తొమ్మిది సరుకుల సరఫరాకు కుదుర్చుకున్న కాంట్రాక్టు గడువు ఏప్రిల్ మాసంతో పూర్తికావడంతో ఈ నెల సరుకుల సరఫరా నిలిపోయింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాత కాంట్రాక్టు పునరుద్ధరణ, లేక కొత్త కాంట్రాక్టుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితం మే నెలకు సంబంధించి సుమారు ఏడు రకాల సరుకుల సరఫరా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి పాలసీ నిర్ణయాలు తీసుకుంటే గానీ సరుకుల సరఫరాకు మోక్షం లభించే అవకాశాలు లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
సబ్సిడీ సరుకులపై అనుమానాలు
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. రూపాయికి కిలో బియ్యం మినహాయిేస్తే మిగిలిన సరుకుల సరఫరా లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం ప్రస్తుతం లబ్ధిదారులకు అందించిన తెల్లరేషన్ కార్డులను అమలు చేస్తుందా.? లేక వాటిని రద్దు చేసి వేరే కార్డులను జారీ చేస్తుందా? అనేది నిరుపేదలకు తొలిచేస్తున్న ప్రశ్న. మరోవైపు సబ్సిడీ సరుకులు కొనసాగించేనా.. లేదా అనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 17.69 లక్షల వరకు తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం ప్రతి నెలా గ్రేటర్‌కు కోటా ప్రకారం పెద్దఎత్తున సరకుల సరఫరా జరుగుతుంది. ఈ నెల సరుకుల సరఫరా లేకుండా పోవడంతో లబ్ధిదారులు చౌకధర ల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు.