= ఆరునెలలుగా పత్తాలేని నూనె
= రేషన్‌దుకాణాల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు
= పట్టింపులేని ఉన్నతాధికారులు
సాక్షి,సిటీబ్యూరో: పేదలకు అంత చేస్తున్నాం..ఇంత చేస్తున్నాం..రూ.185కే తొమ్మిదిసరుకులు...ఇక హాయి గా ఉండండి.. అన్న ప్రభుత్వ ఆర్భాటపు నినాదాలు నీటి మూటలవుతున్నాయి. 9 సరుకుల సంగతి దేవుడెరుగు.. ఇస్తున్న సరుకుల్లోనే సర్కారు కోత పెడుతోంది. ఫలితంగా రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు దుకాణాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కటికాదు..రెండుకాదు..ఆరునెలలుగా పామాయిల్‌ను దుకాణాలకు సరఫరా చేయడం లేదు.
ప్రతినెలా డీలర్లు ఆయిల్ కోసం డీడీలు కడుతున్నా పౌరసరఫరాల అధికారులు పామాయిల్‌ను పంపించడం లేదు. దీంతో చేసేదిలేక కార్డుదారులు బహిరంగమార్కెట్లో అధిక ధరలకు పామాయిల్‌ను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలోని 12 సర్కిళ్లలో సుమారు 15లక్షల వరకు తెల్లకార్డుదారులు ఉండగా, ప్రతినెలా కనీసం సగటున 15లక్షల లీటర్ల వరకు పామాయిల్ డిమాండ్ ఉంటుంది. డీలర్లు ప్రతిసారి డీడీలు కడుతున్నప్పటికీ సరఫరా మాత్రం సకాలంలో జరగడం లేదు.
అయితే పలుమార్లు ఆలస్యంగా సరఫరావుతున్న పామాయిల్ డీలర్ల చేతివాటంతో పక్కాదారి పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరకు రెక్కలు రావడంతో మార్కెట్‌లో ఇతర కంపెనీల ధర రూ.58 నుంచి 65 వరకు పలుకుతోంది. బహిరంగమార్కెట్‌లో వేరుశనగ, సన్‌ఫ్లవర్ నూనె లీటర్ రూ.85 నుంచి 95 పలుకుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పామాయిల్ లీటర్ రూ.40కే లభిస్తుండడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు.
కొరత వాస్తవమే : డీఎం
నెల్లూరు నుంచి తగిన సరఫరా లేకపోవడంతో పామాయిల్ కొరత ఉన్నమాట వాస్తవమేనని సివిల్‌సప్లై డీఎం లక్ష్మీ అంగీకరించారు. పూర్తిస్థాయి కోటాను త్వరలో అందిస్తామని పేర్కొన్నారు. ఒక్కోకార్డుకు ఒక ప్యాకెట్ చొప్పున ఈనెల కోటాలో ఇచ్చేలా సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.
పామాయిల్ నిల్..
Published Sat, Jan 4 2014 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement