ఇది ఒక విచిత్ర పరిస్థితి. ఒక వస్తువును అత్యధికంగా ఉత్పత్తి చేసి, అతి పెద్ద ఎగుమతిదారుగా నిలిచే దేశంలోనే ఆ వస్తువుకు కొరత ఏర్పడితే? ఆ ఉత్పత్తి మీద అక్కడి ప్రభుత్వం ధరల నియంత్ర ణలు, రవాణాపై నిరోధాలు పెడితే? ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధిస్తే? ప్రపంచంలోకెల్లా పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇండోనేషియాలోని చిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఇదే. నిజానికి, గత ఏడాది చివరి నుంచి ప్రపంచవ్యాప్త ముడి పామాయిల్ (సీపీఒ) ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ శాక నూనెల సరఫరా తగ్గడం, పామాయిల్ ఉత్పత్తిలో రెండో అతి పెద్ద దేశమైన మలేషియాలో కరోనాతో శ్రామికుల కొరత, ప్రపంచవ్యాప్త ఆహార ఇన్‌ఫ్లేషన్, ఉక్రె యిన్ యుద్ధం – ఇలా కర్ణుడి చావుకు కారణాలెన్నో! అందుకే, ఇండొనేషియా పామాయిల్ ధరలపై నియంత్రణ పెట్టింది. దానివల్ల అక్రమ నిల్వలు, తిరిగి అమ్మడాలు పెరిగాయి. చివరకు ఈ ఏప్రిల్ 28 నుంచి ఎగుమతుల నిషేధం విధించింది. భారతదేశపు శాకనూనెల వినియోగంలో 40 శాతం పామాయిలే! అక్కడి సంక్షోభంతో భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పామాయిల్ వరకు నిషేధం లేదని ఇండొనేషియా చెప్పినా, ఇప్పటికీ వంట నూనెల్లో విదేశీ దిగు మతులపై ప్రాథమికంగా ఆధారపడుతున్న మనం దీర్ఘకాలిక పరిష్కారం చూడాలని గుర్తు చేశాయి.
వివరంగా చెప్పాలంటే, ఇండొనేషియాలో పామాయిల్ కొరతకు ప్రధానంగా రెండు కారణాలు. మొదటి కారణం– పామాయిల్ తర్వాత ప్రపంచంలో అధికంగా ఎగుమతి అయ్యే సన్‌ఫ్లవర్, సోయాబీన్ లాంటి ఇతర వంటనూనెల సరఫరాకు అంతరాయాలు ఏర్పడడం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం ఉక్రెయిన్, రష్యాలవే. తీరా ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్ యుద్ధంతో నౌకా రవాణా చిక్కుల్లో పడింది. రష్యాపై ఆంక్షలతో సన్‌ఫ్లవర్ ఆయిల్ వాణిజ్యానికీ అడ్డు ఏర్పడింది. మరోపక్క దక్షిణ అమెరికాలో పొడి వాతావరణంతో సోయాబీన్ ఉత్పత్తి ఆరేళ్ళలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోనుందని అంచనా. వెరసి, యుద్ధం, వర్షాభావంతో సన్‌ఫ్లవర్, సోయా బీన్ నూనెల కొరవడి, భారం పామాయిల్ మీద పడింది. ఇక, రెండో కారణం – బయో ఇంధనంగా పామాయిల్ వినియోగం పెరగడం. ఇండొనేషియా ప్రభుత్వం 2020 నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించడం కోసం డీజిల్‌లో 30 శాతం మేర పామాయిల్‌ను కలపడం తప్పనిసరి చేసింది. ఇలా బయో ఇంధనం దిశగా పామాయిల్‌ను మళ్ళించడంతో దేశీయ వంట నూనె వాడకం, ఎగుమతి విషయంలో కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇండొనేషియాలో పామాయిల్ ధరలు పైపైకి ఎగబాకి, అక్కడి ప్రభుత్వం నియంత్రణలు, చివరకు ఎగుమతుల నిషేధం బాట పట్టింది.
ఇండొనేషియాలోని సంక్షోభం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచంలో వంటనూనెలు అత్యధికంగా దిగుమతి చేసుకొనేది మన దేశమే. మన వార్షిక దిగుమతులైన 14–15 మిలియన్ టన్నుల వంట నూనెల్లో 8–9 మిలియన్ టన్నులతో సింహభాగం పామాయిలే. తర్వాత స్థానంలో సోయాబీన్ (3–3.5), సన్‌ఫ్లవర్ నూనె (2.5 మిలియన్ టన్నులు) వస్తాయి. మూడింటికీ ఇబ్బంది వచ్చిపడడంతో మన వంట నూనెల మార్కెట్ కుదుపునకు లోనైంది. ఇండొనేషియాలో ఈ జనవరి చివరలో పెట్టిన ఎగుమతి నియంత్రణల దెబ్బకే మన దేశంలో సీపీఓ మూల్యం 38 శాతం పెరిగింది. కొత్త నిషేధంతో పరిస్థితి మరింత జటిలమైంది. అయితే, శుద్ధి చేసిన ‘రిఫైన్డ్ బ్లీచ్డ్ డీ–ఓడరైజ్డ్’ (ఆర్బీడీ) పామోలిన్ ఎగుమతి మీదే నిషేధం పెట్టామనీ, ముడి పామాయిల్‌కు ఆ నిషేధం వర్తించదనీ ఇండొనేషియన్ అధికారులు తాజాగా వివరణ ఇచ్చింది. ఇటు వినియోగదారులకూ, అటు విధాన నిర్ణేతలకూ ఇది కొంత సాంత్వన. కనీసం ముడి పామాయిల్‌ను తెప్పించుకొని, ఉన్న దేశీయ నూనె శుద్ధి వసతులతో రిఫైన్డ్ వంటనూనె సిద్ధం చేసుకొనే వీలు అయినా మిగిలింది. అలా కాకుండా పూర్తి నిషేధమంటే గనక మన వార్షిక వంటనూనెల అవసరాల్లో నాలుగో వంతు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చేది. మన ఆహార మార్కెట్‌లో సంక్షోభం తలెత్తేది.
యుద్ధంతో ఈ మార్చిలో ప్రపంచవ్యాప్త ఆహార ధరలు 13 శాతం పెరిగాయని ఐరాస లెక్క. కనివిని ఎరుగని రీతిలో ఇండొనేషియా సర్కార్ చేసిన నిషేధ ప్రకటనతో ఇతర శాకనూనెల ప్రపంచ ధరలు నింగి వైపు చూడసాగాయి. ప్రకటన వెలువడ్డ ఏప్రిల్ 22నే సోయాబీన్ నూనె ధర ఒక్క సారిగా 4.5 శాతం హెచ్చింది. ఈ ఒక్క ఏడాదే మన దేశంలో 29 శాతం పెరిగింది. కొన్ని దశాబ్దాలు గానే మనకీ పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలు అలవాటు. ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి, ఆ ధరల హెచ్చుతగ్గులు భరించే బదులు, వాటిని క్రమంగా తగ్గించుకుంటూ దేశీయ వంట నూనెల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. వేరుసెనగ నూనె, ఆవనూనె, నువ్వుల నూనె లాంటి స్థానిక సాంప్రదాయిక నూనెల వినియోగాన్ని పెంచాలి. చౌకధరల దుకాణాల్లో పంపిణీ లాంటి ఆలోచనలు చేయవచ్చు. అప్పుడే దేశీయంగా వంటనూనెల విషయంలో భద్రత సాధ్యం. వంటనూనెలపై మన దేశ విధా నాలు సైతం తాత్కాలిక ఉపశమన ధోరణిలో సాగడం మరో సమస్య. 1.25 లక్షల హెక్టార్లలో పామా యిల్ సాగును సబ్సిడీలతో ప్రోత్సహించి, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గత ఏడాదే ఓ ప్రణాళికను ప్రకటించింది. కానీ, పామాయిల్ చెట్లు ఫలించడానికి అయిదారేళ్ళు పడు తుంది. ఈలోగా పరిస్థితి ఏమిటి? ఎగుమతుల నిషేధంతో ఇండొనేషియాలో ధరలు తగ్గచ్చేమో కానీ, మన దగ్గర చుక్కలనంటడం ఖాయం. రానున్నది మంటనూనెల కష్టకాలమని భయపడుతున్నది అందుకే!
మంట నూనెలు!
Published Fri, Apr 29 2022 12:42 AM | Last Updated on Fri, Apr 29 2022 12:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment