
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ ఉత్పత్తుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నవభారత్ లిమిటెడ్ (ఎన్‌బీఎల్) కంపెనీ ఇకపై మరింత విస్తరణకు సిద్ధమైంది. ఇప్పటి వరకు దాదాపు పూర్తిగా హోల్‌సేల్ అమ్మకాలకే పరిమితమైన ఎన్‌బీఎల్ మున్ముందు రిటెయిలింగ్ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్ టీమ్ ‘సన్‌రైజర్స్’తో ఎన్‌బీఎల్ జత కట్టి తమ ప్రచార కార్యక్రమాలను వేదికగా మార్చుకుంది.
తాజా సీజన్‌లో రైజర్స్‌కు ‘సింప్లిఫై పార్ట్‌నర్’గా ఎన్‌బీఎల్ వ్యవహరించింది. బుధవారం ఎన్‌బీఎల్ బృందంతో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రైజర్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌తో పాటు కోచ్‌లు డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌బీఎల్ సంస్థ పురోగతి గురించి సీఈఓ శ్రీనివాస ప్రసాద్ వెల్లడించారు. ‘రూ. 40 కోట్లతో మొదలైన మా టర్నోవర్ ప్రస్తుతం రూ. 1700 కోట్లకు చేరింది.
ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తులపైనే దృష్టి పెట్టాం. సూపర్‌మతి ఆయిల్‌కు మంచి గుర్తింపు ఉంది. రిఫైనరీ ద్వారా రోజుకు సుమారు 850 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయిల్ రంగంలో ఇతర సంస్థలకు పోటీగా సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్ ఆయిల్‌ల రంగంలో కూడా అడుగుపెడుతున్నాం. రిటైల్‌పై ఇక ముందు ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం ఆసక్తి చూపించే ఐపీఎల్ ఫ్రాంచైజీతో జత కట్టి ప్రచారం చేశాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment