రిక్త హస్తం
- అరకొరగా సరుకుల పంపిణీ
- 48 వేల రచ్చబండ కార్డులకు సరుకుల నిలిపివేత
- పామాయిల్‌పై రాయితీ ఎత్తేసిన గత ప్రభుత్వం
- దీనిపై స్పష్టత ఇవ్వని నూతన ప్రభుత్వం
సాక్షి, అనంతపురం : అమ్మహస్తం.. ఈ పేరు వింటేచాలు నిరుపేదలు హడలెత్తుతున్నారు. నెలనెలా అందించే నిత్యావసర సరుకుల్లో కోతలు పెడుతుండడంతో పేదల కడుపునిండడం లేదు. పేదలకు సబ్సిడీపై అందించే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువుల పథకం ‘అమ్మ హస్తం’ అమలు అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది సరుకులలో కోత విధిస్తుండటంతో ఉపయోగం లేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో మొత్తం 2,880 చౌకధరల దుకాణాల పరిధిలో 11.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.
కార్డుదారులకు ప్రతి నెలా అమ్మహస్తం పథకం కింద పామాయిల్ (లీటర్), కందిపప్పు (కిలో), చక్కెర (అరకిలో), గోధుమ పిండి (కిలో), గోధుమలు (కిలో), అయోడైజ్డ్ ఉప్పు (కిలో), కారంపొడి (250 గ్రాములు), పసుపు (100 గ్రాములు), చింతపండు (అరకిలో) సరఫరా చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జరిగిన రచ్చబండలో ఇచ్చిన 48 వేల రేషన్‌కార్డులకు రెండు నెలలుగా సరుకులు ఇవ్వడం లేదు. ఇక మిగతాకార్డుదారులకు పామాయిల్, పసుపు పంపిణీ చేయడం లేదు.
పామాయిల్‌కు రాయితీ ఎత్తివేత
మలేషియా నుంచి పామాయిల్‌ను కాకినాడకు తీసుకువచ్చి అక్కడే ప్యాకింగ్ చేసి జిల్లాకు పంపుతారు. దీనిపై మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం రాయితీ నిలిపివేసింది. ఆ వెంటనే దిగుమతి కూడా ఆగిపోయింది. రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడం, వరుస ఎన్నికలు వచ్చిపడడంతో దీనిపై దృష్టి సారించలేదు. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరినా పామాయిల్‌కు రాయితీ కొనసాగింపు విషయంలో ప్రకటన చేయలేదు. దీంతో రెండు నెలలుగా కార్డుదారులు పామాయిల్‌కు నోచుకోలేదు.
అంతా గందరగోళమే
అమ్మహస్తం సరుకుల సరఫరాలో గందరగోళం నెలకొంది. వీటి కొనుగోలుకు డీలర్ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టాలి. డీలర్లు అంత మొత్తంలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం లేకపోవడంతో బ్యాంకు రుణాలు తెచ్చుకుంటున్నారు. అయితే అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత లోపిస్తుండంతో వీటిలో కొన్నింటిని తీసుకోవడానికి కార్డుదారులు సుముఖత చూపడం లేదు. దీంతో కొన్ని సరుకులు అమ్ముడుపోనందున.. అప్పు చేసి డీడీ తీయాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఆదాయం.. చేసిన అప్పుకు వడ్డీ కట్టేకే సరిపోతుందంటున్నారు. ఈ కారణంతో డీలర్లు కొన్ని సరుకులను సరఫరా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సరుకులను జిల్లాకు తెప్పించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. బియ్యంతో పాటే సరుకులను కూడా గోదాముల్లో నిల్వ చేయాలి. బియ్యంతో పాటే రేషను సరుకులు సకాలంలో జిల్లాకు రాకపోవడం, సకాలంలో వచ్చినా రెండింటినీ నిల్వ చేసే సామర్థ్యం గోదాముల్లో లేకపోవడంతో ఆలస్యంగా వచ్చిన సరుకులు గోదాముల్లోనే మూలగాల్సిన దుస్థితి నెలకొంది.
పథకం అమలు తీరుపై ఆరా
‘అమ్మహస్తం’ పథకంపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఆ సరుకులు ఎంతవరకు ప్రజల అవసరాలు తీరుస్తున్నాయో పరిశీలించి నివేదికలు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటుతో ఉంది.
ఈ మేరకు లోటును తగ్గించుకోవాలంటే ప్రజలకు పెద్దగా అవసరం ఉండని పథకాలను కొన్నింటిని ప్రభుత్వం రద్దు చేసే యోచనతోనే ఈ విధమైన ప్రతిపాదనలు కోరుతున్నట్లు తెలిసింది.
‘అమ్మహస్తం’లోని తొమ్మిది రకాల వస్తువుల్లో కొన్నింటిని ప్రజలు తీసుకెళ్లడం లేదన్నది బహిరంగ రహస్యం. బియ్యంతో పాటు పామాయిల్, పంచదార, గోధుమలు, కందిపప్పు సరఫరా చేస్తే చాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సరుకులలో కొన్నింటిని తొలగించే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది.