
అమ్మహస్తం..అస్తవ్యస్తం
ఖమ్మం కలెక్టరేట్ : పేదలకు రూ.185కే తొమ్మిదిరకాల నిత్యావసర సరుకులను అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా తయారైంది. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో పాటు మార్కెట్ ధరతో పోల్చితే పెద్దగా తేడా లేకపోవడంతో ఈ పథకానికి ప్రజల నుంచి ఆదరణ కొరవడింది. గత ఉగాది సందర్భంగా లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి వచ్చేసరికి ఘోరంగా విఫలమైంది.
మూడు నెలలుగా అందని పామాయిల్...
రేషన్ వ్యవ స్థపై అధికారుల అజమాయిషీ కొరవడింది. ప్రజలకు కావాల్సిన సరుకులు అందించడంలో ఇటు అధికారులు, అటు డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు ప్రతి నెల 7.70 లక్షల పామాయిల్ ప్యాకెట్లు అవసరం కాగా, గత మూడు నెలలుగా అసలు సరఫరానే లేదు. డీలర్లు తేవడం లేదా.. అసలు ప్రభుత్వమే సరఫరా చేయడమే లేదా.. అని వినియోగదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోజుల తరబడి రేషన్ షాపుల వద్దకు తిరుగుతున్నా సరుకుల అందని పరిస్థితి నెలకొంది.
నాణ్యతకు తిలోదకాలు...
అమ్మహస్తం ద్వారా అందించే తొమ్మిది రకాల నిత్యావసరాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముక్కిపోయిన కందిపప్పు, గింజ తీయని చింతపండు, పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి, ఘాటు లేని కారం పొడి, రుచిలేని నూనె ప్యాకెట్లు పంపిణీ చేస్తుండడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు వెనుకాడుతున్నారు. రూ.185కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. ఇటీవల పలు దుకాణాల్లో నాసిరకం సరుకులు ఇస్తున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి..
మూడు సరుకులపైనే ఆసక్తి ..
ఈ పథకం కింద అందించే తొమ్మిది రకాల సరుకుల్లో వినియోగదారులు మూడు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ కొనుగోలు చేసి మిగితా వాటి జోలికి వెళ్లడం లేదు. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ పథకాన్ని ప్రారంభమైన మరుసటి రోజునే నాణ్యత లేని సరుకుల సరఫరా చేసిన ప్రభుత్వం తన అసలు రంగును బయటపెట్టింది. దీంతో సరుకులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చింతపండు, పసుపు ఏనాడూ సక్రమంగా పంపిణీ చేసిన దాఖలాలు లేవు.
ప్రచార అర్భాటమే...
‘అమ్మహస్తం’తో ప్రజలకు కలిగే లబ్ధి గోరంతే అయినా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నామని ప్రకటిం చింది. అయితే వీటిపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపు మాత్రం మార్కెట్ ధరకంటే ఎక్కువకే విక్రయిస్తుండటం గమనార్హం.
డీలర్ల నిరాసక్తత...
రేషన్ డీలర్లు సైతం ఈ తొమ్మిది రకాల సరుకులు తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. వీటి అమ్మకాలపై కమీషన్ గిట్టుబాటు కాకపోవడం, వాటిని వినియోగదారులు కొంటారనే నమ్మకం లేకపోవడంతో వారు తెచ్చేందుకు వెనుకాడుతున్నారు. తొమ్మిది సరుకులు(ఒక కిట్) విక్రయిస్తే లభించే కమీషన్ రూ.4.09 పైసలు మాత్రమే. అయితే ఇందులో సరుకుల దిగుమతి, రవాణా ఖర్చులే ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు సరుకులన్నీ అమ్ముడుపోకపోవడంతో తమకు నష్టం వస్తోందని డీలర్లు వాపోతున్నారు.