ammahastam scheme
-
పేదల బియ్యం బొక్కేస్తున్నారు..!
డీలర్లకు శఠగోపం పెడుతున్న ఎమ్మెల్‌ఎస్ పాయింట్ అధికారులు ఒక్కో బస్తాకు కేజీ చొప్పున బియ్యం మాయం నరసరావుపేట డివిజన్‌లోనే తూకం తేడాలు అధికం గతంలో అమ్మహస్తం పథకంలోనూ ఇదే తీరు మిల్లర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు సాక్షి, గుంటూరు : చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని గోడౌన్లలోనే కొందరు అధికారులు బొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు చేరేలోపు బస్తాల్లో బియ్యం మాయమౌతున్నాయి. బస్తాలో బియ్యం ఎలా మాయమౌతున్నాయి.. ఎలుకలు, పందికొక్కులు ఏమైనా బొక్కేస్తున్నాయేమో అని అనుకుంటున్నారా.. అదేమీ కాదు కొందరు అవినీతి అధికారులు ధనార్జనే ధ్యేయంగా రేషన్ డీలర్‌కు సరఫరా చేసే బియ్యాన్ని బస్తాకు కేజీ చొప్పున నొక్కేస్తూ నెలనెలా రెండు లారీల బియ్యాన్ని మిగులుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బస్తా గోతంతో కలిపి 50.665 కేజీలు ఉండాల్సి ఉండగా, ఎమ్మెల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్‌కు చేరే సరికి దీని బరువు 49.500 కేజీలు మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి రెండు కేజీల వరకూ తగ్గుతుంది. ఇటీవల కొందరు డీలర్లు 48 కేజీలు వచ్చిన బస్తాలను గుర్తించి రిటన్ కూడా పంపారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధమౌతుంది. మిగిల్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు, మిల్లర్లకు చేరవేస్తూ లక్షలు గడిస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడా ఉండే ఈ జాఢ్యం రానురానూ అనేక ప్రాంతాల్లోని ఎమ్మెల్‌ఎస్ పాయింట్లకు పాకింది. ముఖ్యంగా నరసరావుపేట డివిజన్లోని అనేక చోట్ల ఈ తరహా దోపిడీ జరుగుతూనే ఉంది. రేషన్ దుకాణాలకు బియ్యం బస్తాలు రాగానే వాటిని వెంటనే దిగుమతి చేసుకోవడం మినహా వారు కాటాలు వేసుకోకపోవడం అవినీతి అధికారులకు వరంగా మారింది. కొందరు రేషన్ డీలర్లు ఈ మోసాన్ని గుర్తించి ప్రశ్నిస్తే వారికి సరుకులు సక్రమంగా అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నరసరావుపేట ఎమ్మెల్‌ఎస్ పాయింట్లో అమ్మహస్తం పథకం సరుకుల తూకాల్లో తేడాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక్కడ అదే పరిస్థితి మళ్లీ తిరిగి కొనసాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు.. కొందరు అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై తూకంలో మిగిల్చిన బియ్యాన్ని అక్కడకు తరలిస్తూ వారితో లాలూచీ పడుతున్నారు. మిల్లర్లు ఇదే బియ్యాన్ని వేరే గోతాల్లోకి మార్చి తిరిగి పౌరసరఫరాలశాఖకు చేరుస్తున్నారు. ఈ విధంగా అధికారులు, మిల్లర్లు కూడబలుక్కుని అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. ఐదు నెలల క్రితం పల్నాడు ప్రాంతంలోని ఓ ఎమ్మెల్‌ఎస్ పాయింట్ డీటీ సంతకం చేయాలంటే డబ్బు డిమాండ్ చేస్తున్నాడంటూ ఏసీబీని ఆశ్రయించి పట్టించారు. రేషన్ డీలర్లకు వ్యవహారం తెలిసినప్పటికీ కొన్ని చోట్ల ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల నుంచే బ్లాక్ మార్కెట్‌కు బియ్యాన్ని తరలించేందుకు ఒప్పుకోరేమోననే భయంతో వారుకూడా మిన్నకుంటున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో మిల్లర్లు సైతం నూకలు అధికంగా కలుపుతూ నాణ్యలేని బియ్యాన్ని ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్నంతా గమనిస్తే చివరకు నష్టపోతుంది మాత్రం పేద ప్రజలే అనే విషయం స్పష్టమౌతుంది. ఇప్పటికైనా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి తూకాల్లో జరుగుతున్న మోసాలు, మిల్లర్లతో అధికారుల కుమ్మక్కు వ్యవహారాలను బట్టబయలు చేయాలని పలువురు కోరుతున్నారు. -
‘రేషన్’ కష్టమే..!
సాక్షి, ఒంగోలు: ఇకనుంచి రేషన్ సరకుల సరఫరా కష్టమవనుందా..? అవునంటున్నారు పౌరసరఫరాల శాఖ అధికారులు. ఇప్పటికే అమ్మహస్తం పథకం కింద తొమ్మిది రకాల సరుకుల పంపిణీలో ప్రభుత్వం చేతులెత్తేసింది. రానున్న రోజుల్లో పేదలకు దక్కాల్సిన బియ్యం కూడా గగనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయించిన నూతన ‘లెవీ’ సేకరణ విధానం నేపథ్యంలో భవిష్యత్‌లో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై సర్వత్రా విమర్శిస్తున్నారు. నూతన లెవీ సేకరణ విధానంతో పేదలకు అందాల్సిన బియ్యం నిల్వలు తగ్గిపోతాయని సామాజిక, పౌరసంస్థలు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రైవేటు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసి ప్రజాపంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం మీనమేషాలు లెక్కించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త విధానం ఇదీ... ప్రస్తుతం అమలులో ఉన్న లెవీ విధానం ప్రకారం మిల్లర్ల నుంచి 75 శాతం బియ్యాన్ని ప్రభుత్వమే లెవీగా సేకరించి..25 శాతంను మిల్లర్లు బయట ప్రైవేటుగా అమ్ముకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వం (ఎఫ్‌సీఐ) సేకరించిన లెవీ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి నిల్వపెట్టి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేస్తోంది. అలాంటిది, తాజాగా కేంద్రం అమలు చేయాలనుకుంటున్న లెవీ విధానం ప్రకారం 25 శాతమే లెవీకింద సేకరించి..మిగిలిన 75 శాతం బియ్యంను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చని మిల్లర్లకు అవకాశమివ్వనుంది. ఈ విధానంతో ప్రభుత్వం అవసరమైతే బయట మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసి ప్రజాపంపిణీకి అందజేయాల్సి ఉంటుంది. మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ కిలోబియ్యాన్ని రూ.22.50 కొనుగోలు చేసి వివిధ పథకాలకు అమలు చేస్తోంది. తాజా మార్పులతో బియ్యం బయట కొనుగోలు చేస్తే ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. జిల్లాలో ప్రతీనెలా 12,102 టన్నుల బియ్యాన్ని ప్రజాపంపిణీకి కేటాయిస్తున్నారు. తగ్గిపోనున్న ‘లెవీ’.. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 50 వేల టన్నులు లెవీ లక్ష్యంగా నిర్దేశించారు. మిల్లర్లు కేవలం 48 వేల టన్నులు మాత్రమే లెవీకింద ఇచ్చారు. అంతకు ముందు ఏడాది 62 వేల టన్నులు లక్ష్యం కాగా, సుమారు 52 వేల టన్నులే సేకరించారు. ఇకపై లెవీ చెల్లింపులు గణనీయంగా పడిపోనున్నాయి. జిల్లాలో సుమారు 300 మిల్లులున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతతో పాటు ఇతర సమస్యలతో సుమారుగా 60 వరకు మూతపడే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నుంచి నెలవారీ బిల్లులు రావడంతో మిల్లర్లు అంతంతమాత్రంగా వ్యాపారం చేస్తున్నారని.. పెద్ద మొత్తంలో బియ్యం ప్రైవేటుగా విక్రయించుకోవడం ఆర్థిక భారంతో కూడుకున్నదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త లెవీ విధానం అమలుచేస్తే మరో 100కు పైగా మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని మిల్లర్లు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా ప్రజాపంపిణీ సరుకుల కొరత తీవ్రంగా ఉండటంతో.. జిల్లాకు కేటాయించినంత నిల్వలనే లబ్ధిదారులకు సర్దుబాటు చేయడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భవిష్యత్‌లో ఈ పరిస్థితి మరింత పెరిగినట్లయితే, పేదలకు నెలవారీ బియ్యం అందించలేమనే ఆందోళనలో ఉన్నారు. -
అమ్మహస్తం..అస్తవ్యస్తం
ఖమ్మం కలెక్టరేట్ : పేదలకు రూ.185కే తొమ్మిదిరకాల నిత్యావసర సరుకులను అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా తయారైంది. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో పాటు మార్కెట్ ధరతో పోల్చితే పెద్దగా తేడా లేకపోవడంతో ఈ పథకానికి ప్రజల నుంచి ఆదరణ కొరవడింది. గత ఉగాది సందర్భంగా లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి వచ్చేసరికి ఘోరంగా విఫలమైంది. మూడు నెలలుగా అందని పామాయిల్... రేషన్ వ్యవ స్థపై అధికారుల అజమాయిషీ కొరవడింది. ప్రజలకు కావాల్సిన సరుకులు అందించడంలో ఇటు అధికారులు, అటు డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు ప్రతి నెల 7.70 లక్షల పామాయిల్ ప్యాకెట్లు అవసరం కాగా, గత మూడు నెలలుగా అసలు సరఫరానే లేదు. డీలర్లు తేవడం లేదా.. అసలు ప్రభుత్వమే సరఫరా చేయడమే లేదా.. అని వినియోగదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోజుల తరబడి రేషన్ షాపుల వద్దకు తిరుగుతున్నా సరుకుల అందని పరిస్థితి నెలకొంది. నాణ్యతకు తిలోదకాలు... అమ్మహస్తం ద్వారా అందించే తొమ్మిది రకాల నిత్యావసరాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముక్కిపోయిన కందిపప్పు, గింజ తీయని చింతపండు, పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి, ఘాటు లేని కారం పొడి, రుచిలేని నూనె ప్యాకెట్లు పంపిణీ చేస్తుండడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు వెనుకాడుతున్నారు. రూ.185కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. ఇటీవల పలు దుకాణాల్లో నాసిరకం సరుకులు ఇస్తున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి.. మూడు సరుకులపైనే ఆసక్తి .. ఈ పథకం కింద అందించే తొమ్మిది రకాల సరుకుల్లో వినియోగదారులు మూడు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ కొనుగోలు చేసి మిగితా వాటి జోలికి వెళ్లడం లేదు. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ పథకాన్ని ప్రారంభమైన మరుసటి రోజునే నాణ్యత లేని సరుకుల సరఫరా చేసిన ప్రభుత్వం తన అసలు రంగును బయటపెట్టింది. దీంతో సరుకులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చింతపండు, పసుపు ఏనాడూ సక్రమంగా పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ప్రచార అర్భాటమే... ‘అమ్మహస్తం’తో ప్రజలకు కలిగే లబ్ధి గోరంతే అయినా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నామని ప్రకటిం చింది. అయితే వీటిపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపు మాత్రం మార్కెట్ ధరకంటే ఎక్కువకే విక్రయిస్తుండటం గమనార్హం. డీలర్ల నిరాసక్తత... రేషన్ డీలర్లు సైతం ఈ తొమ్మిది రకాల సరుకులు తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. వీటి అమ్మకాలపై కమీషన్ గిట్టుబాటు కాకపోవడం, వాటిని వినియోగదారులు కొంటారనే నమ్మకం లేకపోవడంతో వారు తెచ్చేందుకు వెనుకాడుతున్నారు. తొమ్మిది సరుకులు(ఒక కిట్) విక్రయిస్తే లభించే కమీషన్ రూ.4.09 పైసలు మాత్రమే. అయితే ఇందులో సరుకుల దిగుమతి, రవాణా ఖర్చులే ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు సరుకులన్నీ అమ్ముడుపోకపోవడంతో తమకు నష్టం వస్తోందని డీలర్లు వాపోతున్నారు. -
రేషన్..పరేషాన్
మోర్తాడ్, న్యూస్‌లైన్: రేషన్ వినియోగదారులకు రెండు నెలలుగా పామోలిన్, గోధుమలు సరఫరా కాక పోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 రకాల సరుకులను సబ్సిడీ ధరపై ప్రభుత్వం సరఫరా చేసేది. తెల్ల రంగు కార్డుల వినియోగదారులకు సబ్సిడీ ధరపై పామోలిన్, పంచదార, గోధుమ పిండి, గోధుమలు, పసుపు, మిరప్పొడి, చింతపండు, ఉప్పు, కందిపప్పులను 185కు విక్రయించేవారు. అమ్మహస్తం పథకం సరుకులతో పాటు రూపాయికి కిలో బియ్యం, కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. తొమ్మిది రకాల సరుకులను సరఫరా చేయాల్సి ఉండగా, పామోలిన్, గోధుమలను మాత్రం అందివ్వడం లేదు. గోధుమలు మార్కెట్లో కిలోకు 14 ధర ఉండగా రేషన్ దుకాణంలో మాత్రం కిలో ఏడు రూపాయలకు లభిస్తాయి. పామోలిన్ లీటర్ ప్యాకెట్ ధర మార్కెట్లో 60 ఉండగా అమ్మహస్తం పథకం ద్వారా 40 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. పామోలిన్, గోధుమలకు డిమాండ్ ఉండగా ఆ సరుకులు మాత్రం సరఫరా కావడం లేదు. చింత పండు, పసుపు, కందిపప్పు, గోధుమ పిండి నాసిరకంగా ఉండటంతో వాటిని తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. పౌర సరఫరాల శాఖ గోదాంలలో గోధుమలు, పామోలిన్ నిలువలు తగ్గిపోవడంతో జిల్లాకు రావాల్సిన 70 టన్నుల గోధుమలు సరఫరా కాలేదు. అలాగే ఏడు లక్షల పామోలిన్ ప్యాకెట్లు కూడా సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల తెలుపు రంగు కార్డుల వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెల అన్ని రకాల సరుకులు సరఫరా అయితేనే వినియోగదారులకు అధికారులు డీలర్ల ద్వారా అమ్మహస్తం పథకం ద్వారా సరుకులను అందిస్తారు. ఎన్నికల బిజీలో ఉన్న అధికారులు సరుకులు సరఫరా కాక పోవడంపై శ్రద్ధ చూపక పోవడంతో రేషన్ వినియోగదారులకు అవసరం ఉన్న పామోలిన్, గోధుమలు సరఫరా కావడం లేదు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి గోధుమలు, పామోలిన్ సరఫరా అయ్యేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. -
‘మీసేవ’లో ముందున్నాం..
న్యూస్‌లైన్: జిల్లాలో ‘మీసేవ’ పరిస్థితి ఏమిటి? జేసీ: జిల్లాలో 270 కిపైగా మీసేవ సెంటర్లు ఉన్నాయి, వాటిలో ప్రస్తుతం 150రకాల సేవలు అందిస్తున్నాం. త్వరలోనే మరో 350 సేవలు రానున్నాయని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొత్తగా ఐదువేల జనాభా ఉండే గ్రామానికి ఒక మీ సేవ సెంటర్‌ను మంజూరుచేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి. న్యూస్‌లైన్: అన్నింటికీ ఆధారంమైన ఆధార్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందనే ఆరోపణలకు మీ సమాధానం? జేసీ: నిజమే కొన్ని ఏజెన్సీలు చేసిన నిర్లక్ష్యానికి ఇప్పటికీ జిల్లావాసుల్లో సగం మందిమాత్రమే ఆధార్‌కార్డు లు అందాయి. కానీ ఈ ప్రక్రియను వేగవంతం చేసేం దుకు ఇటీవల 32 శాశ్వత కేంద్రాలను ప్రారంభించాం. నగదు బదిలీ ఈనెలాఖరు నుంచి అమలుకానుంది. న్యూస్‌లైన్: ఆధార్, వెబ్‌ల్యాండ్ ప్రక్రియలో ఏన్నో స్థానంలో ఉన్నాం.. జేసీ: ఈరెండు ప్రక్రియలు చాలా వెనకబడ్డాయి. ఈ కారణంగా ఆధార్ 14వ స్థానం, వెబ్‌ల్యాండ్ 28వస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఓటర్ డ్రైవ్‌లో అధికారులు ఉండటంతోనే ఈపరిస్థితి నెలకొంది. నెలరోజుల్లో మొదటిస్థానానికి తీసుకొస్తాం. న్యూస్‌లైన్: జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మీ తీసుకుంటున్న చర్యలు? జేసీ: జిల్లాలో 600 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించాం, వీటిని రక్షించేందుకు రూ.70లక్షలతో కం చెలను ఏర్పాటుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కంచెల పూర్తిప్రక్రియకు మరో రూ.1.50కో ట్లు అవసరమని ఇటీవల సీసీఎల్ఏకు నివేదించాం.. న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాజెక్టుల కింద పునరావాసం పురోగతి ఏమిటి? జేసీ: జిల్లాలోని నెట్టెంపాడు, రాజీవ్ భీమా, ఎంజీఎల్ ఐ కింద 12 పునరావాస కేంద్రాలు ఉన్నాయి. బాధితులకు అన్ని వసతులు కల్పించాం. అలాగే పీజేపీ, నె ట్టెంపాడు ప్రాజెక్టు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అప్పట్లో పరిహారం చెల్లించింది. కానీ రికార్డుల్లో అమలుకాలేదు. దీనిపై ప్రత్యేకదృష్టి సారించి 21వేల ఎకరాల భూములను రికార్డుల్లో అమలుచేసి 20 ఏళ్ల సమస్యను తీర్చగలిగాం. న్యూస్‌లైన్: జిల్లాలో అమ్మహస్తం పథకం లోపభూయిష్టంగా మారిందనే ఫిర్యాదులపై మీరేమంటారు? జేసీ: అమ్మహస్తం ఇంతవరకు పంపిణీ చేసిన వాటిలో మన జిల్లానే ముందుంది. ఇక తొమ్మిది సరుకుల విషయానికొస్తే, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు కాదనలేం. పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక ఈ ఏడాది 70వేల ఏఏవై కార్డులిచ్చిన ఘనత మన జిల్లాకే దక్కింది. న్యూస్‌లైన్: రెండేళ్లలో జేసీగా మీ అనుభూతి.. అభిప్రాయం జేసీ: ఇంతకుముందు ఇదే జిల్లాలో నాగర్‌కర్నూల్ ఆర్డీఓగా పనిచేశాను. మళ్లీ ఇదే జిల్లాకు జేసీగా వచ్చాను. కలెక్టర్లు అందించిన సహకారంతోపాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది జిల్లా ప్రజల సహకారంతో రెండేళ్ల పాలన రెండు రోజుల్లా ముగిసింది. ఈ ఏడాదిలో కూడా జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందిస్తాను.