సాక్షి, రాజమండ్రి : రచ్చబండలో మంజూరు చేసిన కొత్త రేషన్‌కార్డులకు సర్కారు మళ్లీ మొండిచేయి చూపించింది. పాతవారికి ఆలస్యంగా రేషన్ ఇచ్చి కొత్తవారికి ఇంకా పంపిణీ చేయలేదు. దీంతో పండుగకు ఏం తినాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. కాగా పాత కార్డులకు కూడా బియ్యం తప్ప మిగిలిన సరుకులు అరకొరగా పంపిణీ చేయడంతో పండుగను ఎలా జరుపుకోవాలని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2561 రేషన్ డిపోలు ఉన్నాయి.
వీటి పరిధిలో సుమారు14.50 లక్షల తెలుపురేషన్ కార్డులున్నాయి. గత రచ్చబండలో మరో లక్షకు పైగా కార్డులు మంజూరు చేశారు. వీరిలో పాత కార్డుదారులకు ఈ నెల ఆరవ తేదీ వరకూ బియ్యం, పంచదార పంపిణీ చేశారు. కానీ కొత్త కార్డులకు మాత్రం ఇప్పటి వరకూ డిపోలకు సరుకులు చేరలేదు. దీంతో పండుగ సరుకు ఇంకెప్పుడిస్తారని కార్డుదారులు అడుగుతున్నారు. పండుగ సెలవుల నేపథ్యంలో కొత్త కార్డులకు సరుకు ఇవ్వాలంటే ఒక్క సోమవారం మాత్రమే మిగిలి ఉంది. కానీ సుమారు 80 శాతం రేషన్‌డిపోలకు ఇంకా సరుకులు చేరలేదు. ఒక్క సోమవారం సరుకులు డిపోలకు పంపడం, కార్డుదారులకు అందచేయడం సాధ్యంకాని పరిస్థితి అని డీలర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పండుగలోపు కొత్త కార్డులకు జనవరి రేషన్ అందే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది.
ఇతర సరుకులదీ అదే దారి
బియ్యం, పంచదార, కిరసనాయిల్ తప్ప డిపోలకు కందిపప్పు, పామాయిల్ తదితర మిగిలిన ఆరు వస్తువుల పంపిణీ అరకొరగా సాగుతోంది. దీంతో తాము కార్డుదారులకు సమాధానం చెప్పలేక పోతున్నామని డీలర్లు అంటున్నారు. ప్రతినెలా కందిపప్పు సాధారణ రేషన్ సమయం దాటిపోయాక పంపిణీ చేస్తున్నారు. దీంతో అది ఎప్పుడు వస్తుందో తెలియని కార్డుదారులు కేవలం ఇతర వస్తువులకు డిపోల వెంట పదే పదే తిరగలేక సరుకు తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో కొన్ని డిపోల్లో సరుకులు నిల్వ ఉండిపోయి పాడైపోతున్నాయి. దీనిని ఆసరాగా తీసుకుని తాము పంపిణీ చేసినా అమ్మహస్తం ఇతర సరుకులు జనం తీసుకోవడం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారు.
జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై పంపిణీ అధికారులను ప్రశ్నించగా ఇప్పటికే కొన్ని డిపోలకు సరుకులు తరలించామని పండుగ లోపే మిగిలిన డిపోలకు వెచ్చాలు తరలించి సరుకు ఇస్తామని చెబుతున్నారు. పండుగ తర్వాతైనా సరుకులు తీసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. డీలర్లు మాత్రం ‘ప్రతి నెలా 15వ తేదీలోగా సరుకులు పంపిణీ చేసి ఆ తర్వాత నివేదికలు అధికారులకు సమర్పించి మరుసటి నెలకు వెచ్చాలకు సొమ్ములు చెల్లించవలసి ఉందని, నెలాఖరు వరకూ డిపోలకు సరుకులు తరలిస్తూనే ఉంటే ఎలా పంపిణీ చేసేద’ని అడుగుతున్నారు.
కాగా కొందరు డీలర్లు సకాలంలో సరుకులకు డీడీలు తీయకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంటోందని జిల్లా పంపిణీ అధికారులు చెబుతున్నారు. ఇలా ఎవరి వాదనలను వారు బలపరుచుకుంటున్నారు త ప్ప మాకు మాత్రం సకాలంలో సరుకులు ఇవ్వడంలేదని జనం ఆవేదన వ్యక్త చేస్తున్నారు.
రచ్చబండ కార్డులకు ఉత్తచేయి!
Published Mon, Jan 13 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement