
పామాయిల్ ధర పతనం
- పెట్టుబడి కూడా రావడం లేదంటూ రైతుల గగ్గోలు
- పట్టించుకోని ప్రభుత్వం
నూజివీడు : ఒకప్పుడు సిరులు కురిపించే పంటగా అన్నదాతల మన్ననలు పొందిన ఆయిల్‌పామ్ తోటలకు ఆపదొచ్చింది. మద్ధతు ధర లభించక ఆయిల్‌పామ్ రైతులు నష్టాల బాట పడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌కు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు సొంత రాష్ట్రంలో పండిస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధరను కల్పించలేకపోతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయిల్‌పామ్ టన్ను ధర పడిపోవడంతో రైతాంగం పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో రూ.8,441 ఉన్న ధర ఆగస్టుకు వచ్చేసరికి రూ.7,000కు పతనమైనంది. ఎనిమిది నెలల కాలంలో టన్నుకు రూ.1,400 ధర తగ్గడంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు రూ. 10వేల నుంచి రూ.12వేల వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ పామాయిల్ ధరలు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయిల్‌ఫెడ్ వర్గాలు చెబుతుండగా, మలేషియా, ఇండోనేషియాల నుంచి విచ్చలవిడిగా పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడం వల్లే నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 25వేల ఎకరాలలో సాగు..
ఆయిల్‌పామ్‌ను రైతులు జిల్లాలో 25వేల ఎకరాలలో సాగుచేస్తున్నారు. నూజివీడు, ముసునూరు, బాపులపాడు, ఉంగుటూరు, చాట్రాయి, నందిగామ, జగ్గయ్యపేట మండలాల్లో పామాయిల్ సాగులో ఉంది. ఏటా దాదాపు లక్ష టన్నుల పామాయిల్ గెలలు దిగబడి వస్తుంది. ఈ గెలలను బాపులపాడు మండలం అంపాపురంలో ఉన్న రుచిసోయా కంపెనీకి రైతులు తీసుకెళతారు.
ఈగెలలకు సంబంధించిన ధరను క్రూడ్ పామాయిల్ ధరను బట్టి ఆయిల్‌ఫెడ్ ధరను నిర్ణయిస్తుంది. ఇండోనేషియా, మలేషియాలలో ఆయిల్‌పామ్ గెలల దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ ధర తగ్గిపోతుంది. ప్రపంచమార్కెట్ బట్టి ధరను నిర్ణయిస్తున్న నేపథ్యంలో, దేశంలోని ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపాడాల్సి ఉన్నప్పటికీ పామాయిల్ దిగుమతిపై కేంద్రం కేవలం 2.5శాతం మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తోంది. ఇంత తక్కువ పన్ను విధించడం వల్ల స్థానిక ఆయిల్‌పామ్ సాగుచేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించక నష్టాలలో కూరుకుపోతున్నారు.
రూ.9వేలు అయితే గిట్టుబాటు
ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు కనీసం రూ.9వేలు ధర లభిస్తేనే సాగు లాభదాయకంగా ఉంటుంది. కూలి ఖర్చులు, ఎరువుల ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు పెరగడంతో పెట్టుబడులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్ గెలల ధర తగ్గుతుండటంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి, దేశీయంగా ఉన్న రైతులను ప్రభుత్వమే ప్రోత్సహించాలి.
బొబ్బా వీరరాఘవరావు, ఆయిల్‌పామ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు