పామాయిల్.. నిల్
జిల్లాలోని చౌక దుకాణాల్లో మూడు నెలల నుంచి పామాయిల్ పంపిణీ చేయడం లేదు. అధికారులు మాత్రం ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో లీటరు పామాయిల్ రూ.70 ఉంది. అదే చౌక దుకాణంలో రూ.40కే లభిస్తుంది. చౌక దుకాణాలకు పామాయిల్ సరఫరా నిలిచిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది.
జమ్మలమడుగు: జిల్లాలోని చౌకదుకాణాల్లో మూడునెలల నుంచి రేషన్‌కార్డుదారులకు పామాయిల్ అందడంలేదు. ఈ నెలలోనైనా పామాయిల్ సరఫరా అవుతుందా? అంటే అధికారులు మాత్రం లేదనే చెబుతున్నారు. జిల్లాలో దాదాపు 2500 వరకు చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి నుంచి 10లక్షల తెల్లరేషన్ కార్డు దారులు తక్కువ ధరకే పామాయిల్ కొనుగోలు చేసుకుం టున్నారు. బహిరంగ మార్కెట్‌లో లీటరు పామాయిల్ రూ.65 నుంచి రూ.70లు ఉంది.
అదే చౌకదుకాణాల్లో అయితే లీటరు రూ.40లకే వస్తుంది. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు చౌకదుకాణాల్లో పామాయిల్ కొనుగోలు చేసే వారు. ప్రభుత్వం సరఫరా చేయకపోవడం తో అదనంగా రూ.25 నుంచి రూ.30లు వరకు భారం పడుతోంది.
టెండర్ల ప్రక్రియ కొనసాగలేదని...
ప్రభుత్వానికి పామాయిల్ సరఫరా చేసే కంపెనీలకు సమయం దాటిపోయింది. తిరిగి రీటెం డర్ నిర్వహించకపోవడంతోనే పామాయిల్ రావ డం లేదని రేషన్‌షాపు డీలర్‌లు పేర్కొంటున్నా రు. అయితే అధికారులు మాత్రం కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ నిధులు రాకపోవడం తో మూడునెలలనుంచి పామాయిల్ సరఫరా కావడంలేదని చెబుతున్నారు. డీలర్లు ఒక మాట, అధికారులు మరో మాట చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా పామాయిల్ చౌకదుకాణాల్లో లభిం చక సామాన్యులు అవస్థలు పడుతున్నారు.
‘అమ్మహస్తం’ కూడా అంతంతే...
ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు అమ్మహస్తం పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతినెలా బియ్యం,పామాయిల్(లీటర్) కందిపప్పు(కిలో), చక్కెర(అరకిలో), గోధుమలు లేదా గోధుమ పిండి(కిలో), ఉప్పు(కిలో), చింతపండు(అరకిలో), కారంపొడి, పసుపుపొట్లాలను సరఫరా చేసే వారు. అయితే ప్రస్తుతం బియ్యం,చక్కెర, ఉప్పు, గోధుమలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. కారంపొడి,చింతపండు,పసుపు పొట్లాలు నాణ్యత లేవు.