కారున్నా.. రేషన్‌కార్డు
- ఆసరా, ఆహార భద్రత మార్గదర్శకాల్లో సవరణలు
- ఆదాయం ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక
- మార్గదర్శకాల్లో సవరణలతో భారీగా పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య
- వివరాలను వెల్లడించిన సెర్ప్ సీఈవో మురళి
సాక్షి, హైదరాబాద్: మీకు కారు ఉందా? కుటుంబ వార్షికాదాయం మాత్రం ప్రభుత్వం నిర్ధేశించిన పరిమితి కంటే తక్కువగానే ఉందా? అయితే మీ కుటుంబసభ్యుల్లో అర్హులైన వారికి ఆహార భద్రత కార్డు, పింఛన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తప్పకుండా అందుతాయి. సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికకు సంబంధించి ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది.
ఈ వివరాలను శుక్రవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళి వెల్లడించారు. ఆ మార్గదర్శకాలను అనుసరించి ఆదాయ పరిమితిని బట్టి పథకాలు అందుతాయని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన ఎంపిక ప్రక్రియలో 24,21,342 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించామని.. తాజా సడలింపుల ప్రకారం లబ్ధిదారుల సంఖ్య గతంలో (29.11లక్షలు) కంటే కూడా పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పింఛన్లకు ఎంపికైన లబ్ధిదారుల్లో 43 శాతం మంది వృద్ధులు, 40 శాతం మంది వితంతువులు, 14 శాతం మంది వికలాంగులు, ఒక శాతం చేనేత, రెండు శాతం గీత కార్మికులు ఉన్నట్లు తెలిపారు.
గతంలో ప్రకటించిన మార్గదర్శకాల మేరకు కారు, భారీ వాహనాలు ఉన్న వారి కుటుంబ సభ్యులకు పింఛన్లు, ఆహార భద్రతా కార్డులు పొందడానికి అర్హత ఉండదు. అయితే చాలా మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని టాక్సీ, ఇతర రవాణా వాహనాలను నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్నందున.. వార్షికాదాయం పరిమితిని మించకుంటే పథకాలను వర్తింపజేయాలని ప్రభుత్వం భావించింది.
ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 ల క్షల ఆదాయ పరిమితికి లోబడి ఉన్న కుటుంబాల్లో అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లతో పాటు ఆహార భద్రత కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయ పరిమితిని కొలమానంగా తీసుకున్నందున.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, స్వయం ఉపాధి పొందేవారు, చిరు వ్యాపారులు, చిన్న దుకాణాల యజమానులు తదితర వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు.. ఆసరా, ఆహార భద్రత పథకాలకు అర్హులవుతారు.
పల్లెప్రగతికి రూ. 642కోట్లు
జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 150 మండలాల్లో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావి స్తున్నట్లు సెర్ప్ సీఈవో మురళి తెలిపారు. ఈ పథకానికి రూ. 642 కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపిందన్నారు. తొమ్మిది జిల్లాల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధుల్లో 70 శాతం ప్రపంచ బ్యాంకు, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉంటాయని ఆయన చెప్పారు. ప్రధానంగా వ్యవసాయాధారిత కార్యక్రమాలు, మాతా, శిశు మరణాల నివారణ చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి సాగు వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులను భారీగా పెంచడం, మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించి రైతుకు లాభాలు వచ్చేలా చేయడమే ‘పల్లె ప్రగతి’ ప్రధాన లక్ష్యమని చెప్పారు.