సంక్షేమ పథకాల అర్హతకు సంబంధించి దరఖాస్తులు పోటెత్తాయి. గడువు ముగుస్తున్న నేపథ్యంలో అర్జీదారులు ఏకంగా తమ రోజువారీ కార్యక్రమాలు వదిలేసి దరఖాస్తులిచ్చేందుకు పరుగులు పెట్టారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాల అర్హతకు సంబంధించి దరఖాస్తులు పోటెత్తాయి. గడువు ముగుస్తున్న నేపథ్యంలో అర్జీదారులు ఏకంగా తమ రోజువారీ కార్యక్రమాలు వదిలేసి దరఖాస్తులిచ్చేందుకు పరుగులు పెట్టారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే సీను కనిపిం చింది. ఈనెల 15 నాటికి దరఖాస్తులు సమర్పించాలని, ఆ తర్వాత వాటిని తనిఖీ చేసి అర్హులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో అన్నివర్గాలు దరఖాస్తుకు ఉపక్రమించాయి.
అయితే దరఖాస్తు సమర్పనకు ప్రభుత్వం అతి తక్కువ విధించింది. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే దరఖాస్తు చేసుకోవాలనే తేల్చి చెప్పడంతో గ్రామాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు సమయం తక్కువగా ఉండడం, మరోవైపు దరఖాస్తులపైనా స్పష్టత కొరవడడంతో తొలిరెండ్రోజులు దరఖాస్తుల సమర్పణ నత్తనడకన సాగింది. సోమవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకోగా.. మంగళవారం నాటికి జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి 3.23లక్షల దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా పింఛన్లకు సంబంధించి 93,364 మంది దరఖాస్తు చేసుకున్నారు.
నిర్ణయంలో మార్పు.. గడువు పెంపు..
ప్రభుత్వం హడావుడిగా తలపెట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై తీవ్ర గందరగోళం నెలకొనడంతో లక్ష్యం నెరవేరలేదు. జిల్లా వ్యాప్తంగా 9.6లక్షల రేషన్ కార్డుదారులున్నారు. అదేవిధం గా 2.65లక్షల మంది సామాజిక పింఛ న్లు పొందుతున్నారు. తాజాగా వీరం తా దరఖాస్తు చేసుకోవల్సిందిగా.. ఇప్పటివరకు ఆహార భద్రత కార్డుల కోసం 31.2శాతం మంది, పింఛన్లకు సంబంధించి 35.19శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో 15నాటికి పూర్తిస్థాయి దరఖాస్తులంద డం కష్టమని గ్రహించిన ప్రభుత్వం.. గడువు పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఈనెల 20తేదీకి గడువును పొడిగించింది.
పెంచిన గడువు సరిపోయేనా?
సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మరో ఐదు రోజులు పెంచింది. ఈ క్రమంలో పెంచిన గడువులోగా వందశాతం దరఖాస్తులు స్వీకరించే అంశం ప్రశ్నార్థకంగానే ఉంది. వాస్తవానికి తొలి వారం రోజుల్లో కేవలం 35శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగిరమైనప్పటికీ.. కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు పెంచడంతో పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందే అవకాశంపై అధికారవర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం లబ్దిపొందే వారే కాకుండా కొత్తగా ప్రయోజనం పొందగోరేవారు సైతం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఐదు రోజుల గడువును మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.