సాక్షి, కడప : అధికారంలోకి రావడమే తరువాయి....తొలి సంతకంతోనే రుణమాఫీ అంటూ ‘దేశం’ నేతలు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టినా రుణమాఫీ మాత్రం అంతంత మాత్రమే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా రుణమాఫీలో మాత్రం బాలరిష్టాలను ఎదుర్కొంటోంది. మొదటి విడతలో రూ. 50 వేలలోపు ఉన్న రుణాలన్నింటినీ ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇక లక్ష రూపాయలు, ఆపైన రుణం తీసుకున్న వారికి తొలి విడతలో రూ. 20 వేలు వేస్తున్నట్లు పేర్కొన్నా...చివరకు బ్యాంకులలో రుణాలపై వడ్డీ మీదికి రావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.. మరికొంతమంది రైతులకు సంబంధించిన ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించడం ఆందోళన కలిగించే పరిణామం.
మొదటి విడత పోయింది..రెండో విడత ముగిసింది...మూడో విడత వచ్చింది...కాని ఎన్నిసార్లు పంపినా..కొందరు రైతుల పేర్లు మాత్రం అర్హుల జాబితాలో గల్లంతయ్యాయి. ఆధార్‌కార్డు సరిగా లేదనో....రేషన్‌కార్డులో తప్పులు ఉన్నాయనో....ఏదో ఒకసాకు చూపి తిరస్కరించడంతో ఎప్పుడు మాఫీ అవుతుందా అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. మూడో విడతకు సంబంధించి ప్రభుత్వం గడువుమీద గడువు పెంచుతూ పోయి చివరకు ఏడాది దాటిన తర్వాత ప్రకటించింది.. వైఎస్సార్ జిల్లాలో రుణమాఫీకి సంబంధించి 5,50,513 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి పాసు పుస్తకాలు, బంగారు తాకట్టు పెట్టి రూ. 6551.51 కోట్ల రుణం తీసుకున్నారు.
ఏడాది తర్వాత మూడో విడత మాఫీ
తెలుగుదేశం సర్కార్ రుణమాఫీ పేరుతో ఎంతో కొంత రైతుల ఖాతాల్లో జమచేసి మాఫీని మమ అనిపించింది. మెదటి విడతలో 2,78,078 మందిలో చాలామందికి అంతంత మాత్రంగా రుణమాఫీ పేరుతో రూ. 315 కోట్లు మాత్రమే కేటాయించారు.ఇందులోను పూర్తి స్థాయి మాఫీ ఏదో కొందరికి మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 5,50,513 మంది రైతులకు సంబంధించిన ఖాతాలను ప్రభుత్వానికి రుణమాఫీ అర్హుల జాబితాగా అప్‌లోడ్ చేసినా అందులో 2,78,078 మందికే వర్తించడం వెనుక మతలబు అర్థం కావడంలేదు.
రెండవ విడతలోను దాదాపు 2 లక్షల పైచిలుకు ఖాతాలను ప్రభుత్వానికి అప్‌లోడ్ చేయగా..1,33,045 రైతు ఖాతాలకు మాఫీ మంజూరు చేసి రూ. 133.15 కోట్లను కేటాయించింది. అనంతరం మూడవ విడతకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో రైతులు సమర్పించిన పత్రాలతోపాటు ఇతర రైతుల దరఖాస్తులు కలుపుకుని సుమారు 17,600 ఖాతాలను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. వీరేగాక జిల్లాలో మరో 60 వేల మందికి పైగా పండ్ల తోటల రైతులతోపాటు మరికొంతమంది సాధారణ రైతులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మూడోవిడతలో అప్‌లోడ్ చేసిన 17600 ఖాతాలకుగాను కేవలం 9400 ఖాతాలకు మాఫీ వర్తింపజేసి రూ.37.90 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 13 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం విడుదల చేసింది.
ఇచ్చిన సొమ్మంతా వడ్డీకే
రుణమాఫీ కింద ప్రభుత్వం అందజేస్తున్న సొమ్మంతా వడ్డీకే సరిపోతోంది. తొండూరు ఏపీజీబీ బ్యాంకులో బి.జయరామిరెడ్డి అనే రైతు సుమారు లక్ష రూపాయలు రుణం తీసుకుంటే...బాబు పుణ్యమా అని రుణమాఫీ కింద పోతుందిలేనని 2014లో రెన్యూవల్ చేయలేదు. 2015 జూన్‌లో రెన్యూవల్ చేసే నాటికి లక్షకు దాదాపు రూ. 26 వేలు వడ్డీ కట్టారు. మాఫీ మాత్రం రూ. 20 వేలు మాత్రమే వర్తించింది. అయితే, లక్ష రూపాయలు బ్యాంకులో అప్పు అలాగే ఉండగా, మాఫీ పోను రైతుకు వడ్డీ రూపంలో అదనంగా రూ. 6 వేలు పడడంతో ఆందోళన చెందుతున్నాడు.
మూడో ‘సారీ’
Published Mon, Aug 31 2015 2:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement