ఒంగోలు : మూడో విడత రుణ విమోచన పథకానికి సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. జిల్లాలో మొత్తం 7,06,275 రుణ ఖాతాలను బ్యాంకర్లు అప్‌లోడ్ చేశారు. వాటికి సంబంధించిన మొత్తం రూ.6,500 కోట్లపైమాటే. కానీ వాటిలో కేవలం 4,59,226 ఖాతాలను మాత్రమే ఆమోదించారు. వీటికి కేటాయిస్తున్నట్లు ప్రకటించిన మొత్తం రూ.1937.34 కోట్లు.. అంటే 2,47,049 ఖాతాలను తిరస్కరించారు. వీటికి సంబంధించిన మొత్తం రూ.4,500 కోట్లకుపైమాటే కావడం గమనార్హం.
మూడో విడతలో 28 వేల ఖాతాలు అప్‌లోడ్...
తొలిదశలో మొత్తం 3,31,210 ఖాతాలను మాత్రమే అర్హమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి రూ.1,420 కోట్లు జమ చేస్తామని, అందులో తొలిదశగా రూ.376.80 కోట్లు బ్యాంకులకు విడుదల చేసింది. మిగిలిన మొత్తానికి బాండ్లు విడుదల చేయనున్నామని,రైతులు తమ బాకీని తామే చెల్లించుకొని బాండ్ల ద్వారా ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తాన్ని సమయానుకూలంగా పొందాలని సూచించింది. అయితే తొలిదశలో చాలామంది రైతులు తమకు అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.
కొన్ని రుణ ఖాతాలకు సంబంధించి సరైన సమాచారం పంపాలంటూ రైతు సాధికారత కార్పొరేషన్ చైర్మన్ కుటుంబరావు బ్యాంకర్లను ఆదేశించడంతో తమ వద్ద ఉన్న వివరాలను బ్యాంకర్లు పంపారు. కానీ ఈ దఫా కేవలం 1,28,016 ఖాతాలను మాత్రమే అర్హమైనవిగా పేర్కొంటూ వాటికి రూ. 517.34 కోట్లు విడుదల చేస్తామని పేర్కొంది. కానీ అందులో తొలిదఫా విడుదల చేసిన మొత్తం కేవలం రూ.193.60 కోట్లు మాత్రమే. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హైదరాబాదులో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తరలివచ్చిన దరఖాస్తుదారుల తాకిడి తట్టుకోలేక జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి ఫిర్యాదిదారుల వద్ద నుంచి పూర్తి వివరాలను సేకరించి తమకు పంపాలంటూ ఆదేశించింది. ఒకటిన్నర సంవత్సర కాలంపాటు రైతులు రుణమాఫీ కోసం వేచి ఉండాల్సి రావడం, ఈ లోపు వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయి రైతు నడ్డిని విరగదీశాయి. దీంతో భారం తడిసిమోపెడు కావడంతోపాటు 14శాతం వడ్డీని చెల్లించాల్సి రావడంతో రైతులు రుణాన్ని చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 66,500 ఖాతాలు రెన్యువల్ కావాల్సి ఉండగా కేవలం 10,700 ఖాతాలు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. దీని ప్రకారం 55,800 రుణ ఖాతాలకు సంబంధించి రూ. 365.67 కోట్ల మొత్తానికి 14 శాతం చొప్పున రైతులు వడ్డీ చెల్లించాల్సి వస్తుండడం గమనార్హం.
మూడో విడతపైనా ఉత్కంఠే
Published Sat, Aug 8 2015 4:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement