మాఫీలో కోత!
రుణమాఫీలో భాగంగా రెండవ విడతలో రెన్యువల్ చేస్తూ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. నాకు ఇచ్చే రుణమాఫీలో రూ. 1500 ఇన్సూరెన్స్ కట్ చేశారు. మొదటి విడత రుణమాఫీ సమయంలో కట్ చేశారు. ఇప్పుడు కట్ చేశారు. రుణమాఫీలో ఇన్సూరెన్స్ పేరుతో బ్యాంకు వారు తీసుకున్న డబ్బులను కూడా చెల్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తోంది. క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్ చేస్తున్నారని బ్యాంకు అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా ఇది స్టేట్ పాలసీ అని సమాధానం చెబుతున్నారు.
మిర్యాలగూడ : ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం గందరగోళంగా మారింది. రుణమాఫీని అమలు చేస్తున్న బ్యాంకర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మాఫీ డబ్బుల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అయినా రుణమాఫీ డబ్బులలో వడ్డీలు, ఇన్సూరెన్స్‌ల పేరుతో కోత విధిస్తున్నారు. రుణమాఫీ వర్తించిన రైతుల పంట రుణాలకు వడ్డీలు ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం ఆ మాటలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రెండవ విడతలో పంట రుణంలో 25 శాతం మాఫీ చేయాల్సి ఉండగా రుణాలను రెన్యువల్ చేస్తున్న బ్యాంకు అధికారులు ఇన్సూరెన్స్, వడ్డీ తీసుకొని మిగతా డబ్బులను మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు.
రుణమాఫీ వర్తించిన రైతులు ఆన్‌లైన్‌లో భూమి పహాణీతో పాటు రుణమాఫీ హామీ పత్రం, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జీరాక్స్ ప్రతులను బ్యాంకులో అందజేయాల్సి ఉంది. బ్యాంకు నిబంధనల మేరకు అన్ని సిద్ధంగా ఉంటే రెన్యువల్ దరఖాస్తులు ఇస్తున్నారు. రెన్యువల్ కోసం బ్యాంకుల చుట్టూ రైతులు తిరగాల్సి వస్తోంది. రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వచ్చినా నానా రకాల కొర్రీలు పెట్టి అందజేయడం లేదు. వచ్చిన డబ్బులలో ఇన్సూరెన్స్, వడ్డీలు తీసుకొని మిగతా డబ్బులు మాత్రమే రైతులకు అందజేస్తున్నారు. అందుకు రైతులు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దాంతోపాటు తనకు ఎన్ని డబ్బులు వస్తాయోనని రైతులు గందరగోళంలో పడుతున్నారు.
లెక్కలు చెప్పని అధికారులు
రైతు తీసుకున్న పంట రుణంలో తన చెతికి వచ్చింది కొద్దిగానే ఉండి, పాస్ పుస్తకంలో ఎక్కవ మొత్తం ఉండటం వల్ల అయోమయానికి గురైన రైతులు అధికారులను అడిగితే లెక్కలు చెప్పడం లేదు. కనీసం పాత రుణాలకు ఎంత శాతం వడ్డీ తీసుకున్న విషయం కూడా చెప్పడం లేదు. నిబంధనల ప్రకారం పంట రుణాలపై బ్యాంకులు కేవలం 7 శాతం వడ్డీలు తీసుకోవాల్సి ఉంది. అది కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా బ్యాంకులు మాత్రం వడ్డీలు కూడా తీసుకుంటున్నారు. వచ్చిన రుణమాఫీలో వడ్డీలు, ఇన్సూరెన్స్‌పోగా చేతికి కొంత డబ్బు మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్సూరెన్స్ పేరుతో
పంటలకు ఇన్సూరెన్స్ పేరుతో బ్యాంకర్లు రైతులకిచ్చే రుణాలలో కోత విధిస్తున్నారు. రూ.లక్ష రుణం తీసుకున్న రైతుకు రూ.2500 కోత విధిస్తున్నారు. బ్యాంకర్లు తీసుకున్న రూ.2500ను రైతులు తిరిగి చెల్లించడంతోపాటు దానికి సం బంధించిన వడ్డీలూ చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాకు పంటరుణాల మాఫీకింద రూ.584 కోట్లు వచ్చాయి. వాటిని జిల్లా వ్యాప్తంగా 4.86 లక్షల మంది రైతులకు అందజేయనున్నారు.
అప్పు ఎంత ఉందని కూడా చెప్పడం లేదు
రుణమాఫీ ఎంత వచ్చిందనే విషయం బ్యాంకు అధికారులు చెబుతున్నా వడ్డీ, ఇన్సూరెన్స్ పేరుతో సగం డబ్బులు తీసుకొని మిగతావి బ్యాంకు అకౌంట్‌లో వేస్తున్నారు. రుణం రెన్యువల్ చేసుకున్న వారికి మాత్రమే రుణ మాఫీ వర్తింపజేస్తున్నారు. రుణమాఫీలో 25 వాతం వస్తే ఎంత కట్ చేశారనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. తిరిగి బ్యాంకులో ఎంత అప్పు ఉందనే విషయం కూడా తెలియజేయడం లేదు.