అసలు కొంత.. వడ్డీ కొండంత
రుణ మాఫీ కలేనా?
1990లో రైతులకు రూ.1.20 కోట్ల రుణాలు మంజూరు
{పస్తుతం అది వడ్డీతో కలిపి రూ. 3 కోట్లు
అసలు ఎంత అయిందో.. వడ్డీ అంతేకంటే ఎక్కువైంది. పాతికేళ్ల కిందట జీసీసీ రైతులకు ఇచ్చిన వ్యవసాయ రుణాలు వసూలు కాకపోవడంతో... తీసుకున్న స్థాయి కంటే వడ్డీ పెరిగింది. ఇదంతా లెక్కకడితే రూ.3కోట్లకు చేరింది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తే మొత్తం రద్దవుతుందని జీసీసీ అధికారులు భావించారు. కానీ అంతా తలకిందులైంది. రుణాలు తీసుకున్న రైతుల్లో సగం మంది బతికి లేరు. మిగిలిన రుణం రైతుల నుంచి వచ్చే అవకాశం కనిపించడం లేదూ!!
- కొయ్యూరు
1990లో కొయ్యూరు జీసీసీఎంఎస్ సంఘం 9,400 మంది రైతులకు రూ.1.20 కోట్లు రుణాలు మంజూరు చేసింది. ఆప్కో నిధులను జీసీసీ ప్రధాన కార్యాలయానికి ఇస్తే వాటిని తిరిగి సంస్థ శాఖల ద్వారా రుణాలు అందజేసింది. అయితే రుణాలు తీసుకున్న రైతులు తిరిగి చెల్లించలేదు. ఈ విషయంలో గతంలో రైతులకు నోటీసులు పంపారు. దీనిపై రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అలాగే మహిళలకు కూడా జీసీసీ రుణాలు మంజూరు చేసింది. ఆ సొమ్ము కూడా వసూలు కాలేదు. దీంతో ఈ రుణాలన్నీ కలిపి వడ్డీతో సహా రూ. 3 కోట్లకు చేరాయి.
టీడీపీ అధికారంలోకి రాగానే రుణాలు రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో జీసీసీలో ఆశలు చిగురించాయి. శాఖలో ఉండిపోయిన రుణాలు మొత్తం రద్దవుతాయని ప్రధాన కార్యాలయానికి నివేదించారు. అయితే ప్రభుత్వం జీసీసీ రుణాలను రద్దు చేసేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు పాతికేళ్ల కిందట రుణాలు రద్దు చేసేందుకు అవకాశం లేదన్న వాదన కూడా ఉం ది. దీంతో రుణం వడ్డీతో కలుపుకుని కొండలా పేరిగింది. ఇది జీసీసీకి భారంగా మారింది. దీనిని వదిలించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా ఈ ఏడాది రైతులకు జీసీసీ రూ. 5 లక్షలు ఇచ్చింది కూడా!
రుణాలు రద్దు కాలేదు
రైతుల వ్యవసాయ రుణాలు రద్దవుతాయని భావించి పూర్తి వివరాలను ప్రధాన కార్యాలయంనకు పంపించాం. అయితే వాటిని రద్దు చేయలేదు. ఇప్పటికి అసలుకు వడ్దీతో కలుపుకుంటే సుమారుగా రూ.మూడు కోట్ల వరకు చేరింది. రుణాలు తీసుకున్న వారిలో కొందరు రైతులు మరణించారు. అయినా ప్రస్తుతం తక్కువ సంఖ్యలో రైతులకు రుణాలు ఇస్తున్నాం.
- కూర్మారావు, ఇన్‌చార్జి మేనేజర్, కొయ్యూరు శాఖ