నెల్లూరు(అగ్రికల్చర్) : రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం విడిపించుకోక పోవడంతో రైతులకు తీవ్ర కష్టం వచ్చిపడింది. ఇంతకాలం రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించిన బ్యాంకు అధికారులు రైతులపై కొరడా ఝుళిపిస్తున్నారు. బంగారు రుణాలపై గడువు ముగియడంతో ఆయా బ్యాంకులు రైతులకు నోటీసులు పంపించాయి. బంగారు ఆభరణాలను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ మేరకు పత్రికల్లో వేలం ప్రకటనల తేదీలను కూడా ప్రకటించాయి. వడ్డీ కట్టించుకుని వేలం ఆపాలని బ్యాంకు అధికారుల కాళ్లవేళ్లా పడ్డా కనికరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సిందేనని అధికారులు చెప్పడంతో రైతులు దిక్కతోచక లబోదిబో మంటున్నారు. రైతులు బ్యాంకులోని తనఖా బంగారం విడిపించుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నూటికి రూ.10 వడ్డీకి అప్పు తీసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో పలు బ్యాంకులు వేలం తేదీలను ప్రకటించడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బంగారు విడిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు.
బంగారు రుణాలపై అదనపు భారం
జిల్లాలో బంగారు తనఖా పెట్టి 2,20,625 మంది రైతులు రూ.921 కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నారు. రైతులు తీసుకునే రుణం సకాలంలో చెల్లిస్తే 7 శాతం మాత్రమే వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వం మాఫీ చేయనందున 14 శాతం వడ్డీ చెలించాల్సి వచ్చింది. ఈ లెక్కన బంగారు తనఖా పెట్టిన రైతులకు పంట రుణాలు తీసుకున్న వారి కన్నా అధిక వడ్డీ పడుతుంది. అంటే రూ.లక్ష తీసుకున్న రైతుకు గడిచిన ఏడాదికి రూ.14 వేల వడ్డీ పడింది. జిల్లాలో మొత్తం రైతులు తీసుకున్న రుణం, వడ్డీతో కలిపి రూ.1600 కోట్లకు చేరింది. దీంతో రైతులపై రూ.579 కోట్ల అదనపు వడ్డీ భారం పడింది.
ప్రభుత్వం ప్రకటించిన మూడు విడతల అర్హుల జాబితాలో బంగారు రుణాలు తీసుకున్న 1,03,729 మంది రైతులు అర్హులని స్పష్టం చేసింది. వీరు తీసుకున్న రూ.206.7 కోట్లు మాఫీ చేస్తూ, ఇందులో 20 శాతం రూ.41.34 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము వడ్డీకి కూడా సరిపోలేదు. వడ్డీ, అసలు మిగిలిపోవడంతో ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షమందిపైగా రైతులు తీసుకున్న బంగారు రుణాలు మాఫీకి నోచుకోలేదు. దీంతో వీళ్లంతా అసలు, వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. తీసుకున్న రుణం మాఫీ కాకపోవడంతో అసలు వడ్డీ సహా చెల్లించాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిఫాల్టర్లుగా మారిన రైతులు
రుణాలు కట్టొద్దని ప్రోత్సహించి, మాఫీ అమల్లో అంతులేని జాప్యం చేస్తూ నిర్ణీత సమయంలోగా ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో రైతులు డీఫాల్టర్లుగా మారారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు 7 శాతం వడ్డీ భరించాల్సి వస్తోంది. ఈ ప్రకారం రైతులపై అదనపు భారం పడుతోంది. అయితే ఇందులోనూ 4 శాతం కేంద్రం, 3 శాతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లిస్తాయి. అంటే రైతులకు వడ్డీ లేని రుణాలు అందుబాటులో ఉంటాయన్నమాట. అయితే రుణమాఫీ వస్తుందని రైతులు రుణాలు చెల్లించకపోవడంతో జూలై 1 నుంచి రైతులు డీఫాల్టర్లుగా మారారు.
బాబూ.. ఇదేం మాఫీ
Published Mon, Sep 7 2015 3:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement