‘ఉల్లి’(కి) పాట్లు.. | Onion problems | Sakshi
Sakshi News home page

‘ఉల్లి’(కి) పాట్లు..

Published Sat, Aug 8 2015 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

Onion problems

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఉల్లిగడ్డ కిలో రూ.20 విక్రయ కేంద్రం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌లో ఉల్లి విక్రయ కేంద్రం వద్ద గంటల తరబడి ఎదురుచూసిన ప్రజలు.. స్టాక్ లేదంటూ చెప్పిన సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతు బజార్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉల్లిగడ్డల కోసం పడిగాపులు కాసిన జనం అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి లైన్‌లో నిలబడితే నామమాత్రంగా తక్కువ మందికి ఇచ్చి స్టాక్ లేదంటే ఎలా అని ప్రశ్నించారు.

రోజుకు 15 క్వింటాళ్లు.. వందల మందికి సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపించారు. ఆధార్, రేషన్ కార్డు ఉంటేనే ఉల్లిగడ్డ ఇస్తున్నారని, కుటుంబసభ్యులకు సంబంధించిన కార్డు ఇచ్చినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరడంతో.. సిబ్బంది లోపల దాచి ఉంచిన స్టాక్‌ను తీసి అమ్మకాలు ప్రారంభించారు. అప్పుడే స్టాక్ లేదని చెప్పి.. ఇప్పుడెలా వచ్చిందంటూ అక్కడి వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పక్కదారి పడుతోందా..?
 ఉల్లి ధర చుక్కల్ని తాకుతున్న తరుణంలో ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ.20కే అందించేందుకు జిల్లాలో 5 విక్రయ కేంద్రాలను రైతుబజార్లలో ఏర్పాటుచేసింది. వాటిని ఈనెల 5 నుంచి ప్రారంభించారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. కానీ.. అందుకు భిన్నంగా ఉందయం 11 నుంచి 12 గంటల వరకు, సాయత్రం 4 నుంచి 5 గంటల వరకే అందిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రోజుకు 15 క్వింటాళ్లకు పైగా అందిస్తున్నామని తెలుపుతున్నా.. అధికారులు మూడు క్వింటాళ్లు కూడా అందించడం లేదని వాపోతున్నారు.

నిర్వాహకులే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎరుపు రంగు గడ్డలు, నాణ్యతలేని గడ్డలు జనాలకు అందిస్తూ.. మంచివి తెల్లగడ్డలు పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి అందిరికీ ఉల్లిగడ్డలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
 మూడు రోజులుగా వస్తున్నా..
 ఇతర పనులు వదిలేసుకుని ఉల్లిగడ్డల కోసం మూడు రోజులుగా రైతుబజారు వస్తున్నా. మొదటి రోజు గుర్తింపు కార్డు కావలంటే డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్‌కార్డు చూపించినా ఇవ్వనన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటేనే తీసుకురావాలన్నారు. రెండో రోజు వారు సూచించిన కార్డులు తీసుకుని వచ్చినా పంపిణీ సమయం అయిపోయిందన్నారు. మూడో రోజు వచ్చి లైన్లో రెండు గంటలు ఎదురు చూసినా స్టాక్ అయిపోయిందని అంటున్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి.
 - శ్రీనివాస్, టైలర్స్ కాలనీ, ఆదిలాబాద్
 
 ఉదయం నుంచి లైన్లో నిలుచున్న
 ఉల్లిగడ్డల కోసం ఉదయం 10 గంటల నుంచి లైన్లో నిల్చొని ఉన్నా. నా వరకు వచ్చే వరకు ఉల్లిగడ్డలు అయిపోయాయని అంటున్నారు. మళ్లీ సాయంత్రం రావాలని చెప్పారు. కొంత మందికే ఇస్తున్నారు. దూరం నుంచి రూ.30 ఆటో చార్జి చెల్లించి వచ్చిన తర్వాత మళ్లీ ఎట్లా రావాలి. అందరికీ ఇచ్చేలా చూడాలి.
 - నిర్మల, నెహ్రూనగర్, ఆదిలాబాద్
 
 ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా చేస్తున్నాం..
 ప్రభుత్వం ద్వారా రాయితీపై రూ.20 కిలో ఉల్లిగడ్డలు రోజుకు 13 నుంచి 15 క్వింటాళ్ల వరకు సరఫరా చేస్తున్నాం. 600 నుంచి 700 మంది వరకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకువచ్చిన వారికి అందజేయడం జరుగుతుంది. వినియోగదారులు ఒకేసారి భారీ మొత్తంలో తరలిరావడంతో కొంత క్యూ పెరుగుతోంది. పైనుంచి స్టాక్ వచ్చినంత సరఫరా చేస్తున్నాం.
 - జయశీలం రాజ్, రైతుబజార్ ఎస్టేట్ సహాయ అధికారి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement