Onion subsidy
-
శవ రాజకీయాలు బాబుకు అలవాటే
-
శవ రాజకీయాలు బాబుకు అలవాటే : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఉల్లికి సంబంధించిన రాజకీయాలు చూస్తే బాధేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేజీ ఉల్లిని రూ. 25కే అందిస్తున్నామని చెప్పారు. ఉల్లిని తక్కువ ధరకు అందించడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇప్పటివరకు 38,496 క్వింటాళ్ల ఉల్లిని ప్రజలకు అందించామని వెల్లడించారు. శవ రాజకీయాలు చేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో ఉల్లి ధరలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కేజీ ఉల్లిని రూ. 200 అమ్ముతున్నారు.. కానీ రైతు బజార్లలో రూ. 25కే అందజేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మంచి చేయడంలో రాజీపడొద్దని అధికారులకు ఆదేశించినట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి మార్కెట్ యార్డ్‌ల్లో కూడా సబ్సిడీ ఉల్లి అందిస్తామని చెప్పారు. రైతు బజార్లలో ఇవాళ ఇంత క్యూలు ఉన్నాయంటే.. ప్రభుత్వం తక్కువ ధరకే ఉల్లి అందించడమే కారణమని తెలిపారు. ఈ విషయాలేవీ చంద్రబాబుకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో మరెక్కడా కూడా ప్రభుత్వం ఉల్లి ధరల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. ప్రతిపక్షం చేస్తున్నది ధర్మమేనా అని ప్రశ్నించారు. వారు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు. సాంబిరెడ్డి కుటుంబం ఉన్నత స్థితిలో ఉంది : కొడాలి నాని రాష్ట్రంలో ఎవరు మరణిస్తారా అని.. చంద్రబాబు నాయుడు చూస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అసెంబ్లీలో కొడాలి నాని మాట్లాడుతూ.. ‘సాంబిరెడ్డి కుటుంబం ఉన్నత స్థితిలో ఉంది. ఆయన ఉల్లి కోసం చనిపోలేదని వారి కుటుంబ సభ్యులే చెప్పారు. ఎల్లో మీడియా ప్రతినిధులు సాంబిరెడ్డి కుటుంబానికి ఫోన్ చేసి వారిపై సభ్యులపై ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వస్తుందని చెప్పారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని వారు చెప్పిన వినిపించుకోలేదు. సాంబిరెడ్డి వాకింగ్ చేస్తూ కురగాయలకు వెళ్తుండగా చనిపోయారు. చనిపోయిన వ్యక్తికి 15 ఏళ్లుగా గుండె జబ్బు ఉంద’ని తెలిపారు. అలాగే సాంబిరెడ్డి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. ఆ వ్యక్తి ఉల్లి కోసం చనిపోలేదు : పార్థసారథి టీడీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఓ వ్యక్తి చనిపోతే దానిని టీడీపీ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఉల్లి ధరలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ప్రతిపక్షం నీచ రాజకీయాలను మృతుడి కుటుంబ సభ్యులు తప్పుబట్టారని చెప్పారు. ఆ వ్యక్తి ఉల్లి సమస్యల వల్ల చనిపోలేదని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుకు ఏ విధంగా అండగా ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచించేవారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు పక్షపాతి అని మరోసారి స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు సబ్సిడీ మీద ఉల్లి సరఫరా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సమస్యను ముందుగానే గుర్తించి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. రూ. 5వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీని కూడా సరిగా చేయలేకపోయారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారు సూచనలు ఇవ్వాల్సింది పోయి.. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
‘ఉల్లి’(కి) పాట్లు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఉల్లిగడ్డ కిలో రూ.20 విక్రయ కేంద్రం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో ఉల్లి విక్రయ కేంద్రం వద్ద గంటల తరబడి ఎదురుచూసిన ప్రజలు.. స్టాక్ లేదంటూ చెప్పిన సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతు బజార్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉల్లిగడ్డల కోసం పడిగాపులు కాసిన జనం అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి లైన్లో నిలబడితే నామమాత్రంగా తక్కువ మందికి ఇచ్చి స్టాక్ లేదంటే ఎలా అని ప్రశ్నించారు. రోజుకు 15 క్వింటాళ్లు.. వందల మందికి సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపించారు. ఆధార్, రేషన్ కార్డు ఉంటేనే ఉల్లిగడ్డ ఇస్తున్నారని, కుటుంబసభ్యులకు సంబంధించిన కార్డు ఇచ్చినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరడంతో.. సిబ్బంది లోపల దాచి ఉంచిన స్టాక్‌ను తీసి అమ్మకాలు ప్రారంభించారు. అప్పుడే స్టాక్ లేదని చెప్పి.. ఇప్పుడెలా వచ్చిందంటూ అక్కడి వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కదారి పడుతోందా..? ఉల్లి ధర చుక్కల్ని తాకుతున్న తరుణంలో ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ.20కే అందించేందుకు జిల్లాలో 5 విక్రయ కేంద్రాలను రైతుబజార్లలో ఏర్పాటుచేసింది. వాటిని ఈనెల 5 నుంచి ప్రారంభించారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. కానీ.. అందుకు భిన్నంగా ఉందయం 11 నుంచి 12 గంటల వరకు, సాయత్రం 4 నుంచి 5 గంటల వరకే అందిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రోజుకు 15 క్వింటాళ్లకు పైగా అందిస్తున్నామని తెలుపుతున్నా.. అధికారులు మూడు క్వింటాళ్లు కూడా అందించడం లేదని వాపోతున్నారు. నిర్వాహకులే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎరుపు రంగు గడ్డలు, నాణ్యతలేని గడ్డలు జనాలకు అందిస్తూ.. మంచివి తెల్లగడ్డలు పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి అందిరికీ ఉల్లిగడ్డలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మూడు రోజులుగా వస్తున్నా.. ఇతర పనులు వదిలేసుకుని ఉల్లిగడ్డల కోసం మూడు రోజులుగా రైతుబజారు వస్తున్నా. మొదటి రోజు గుర్తింపు కార్డు కావలంటే డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్‌కార్డు చూపించినా ఇవ్వనన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటేనే తీసుకురావాలన్నారు. రెండో రోజు వారు సూచించిన కార్డులు తీసుకుని వచ్చినా పంపిణీ సమయం అయిపోయిందన్నారు. మూడో రోజు వచ్చి లైన్లో రెండు గంటలు ఎదురు చూసినా స్టాక్ అయిపోయిందని అంటున్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. - శ్రీనివాస్, టైలర్స్ కాలనీ, ఆదిలాబాద్ ఉదయం నుంచి లైన్లో నిలుచున్న ఉల్లిగడ్డల కోసం ఉదయం 10 గంటల నుంచి లైన్లో నిల్చొని ఉన్నా. నా వరకు వచ్చే వరకు ఉల్లిగడ్డలు అయిపోయాయని అంటున్నారు. మళ్లీ సాయంత్రం రావాలని చెప్పారు. కొంత మందికే ఇస్తున్నారు. దూరం నుంచి రూ.30 ఆటో చార్జి చెల్లించి వచ్చిన తర్వాత మళ్లీ ఎట్లా రావాలి. అందరికీ ఇచ్చేలా చూడాలి. - నిర్మల, నెహ్రూనగర్, ఆదిలాబాద్ ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా చేస్తున్నాం.. ప్రభుత్వం ద్వారా రాయితీపై రూ.20 కిలో ఉల్లిగడ్డలు రోజుకు 13 నుంచి 15 క్వింటాళ్ల వరకు సరఫరా చేస్తున్నాం. 600 నుంచి 700 మంది వరకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకువచ్చిన వారికి అందజేయడం జరుగుతుంది. వినియోగదారులు ఒకేసారి భారీ మొత్తంలో తరలిరావడంతో కొంత క్యూ పెరుగుతోంది. పైనుంచి స్టాక్ వచ్చినంత సరఫరా చేస్తున్నాం. - జయశీలం రాజ్, రైతుబజార్ ఎస్టేట్ సహాయ అధికారి