సాక్షి, అమరావతి : ఉల్లికి సంబంధించిన రాజకీయాలు చూస్తే బాధేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేజీ ఉల్లిని రూ. 25కే అందిస్తున్నామని చెప్పారు. ఉల్లిని తక్కువ ధరకు అందించడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇప్పటివరకు 38,496 క్వింటాళ్ల ఉల్లిని ప్రజలకు అందించామని వెల్లడించారు. శవ రాజకీయాలు చేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో ఉల్లి ధరలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కేజీ ఉల్లిని రూ. 200 అమ్ముతున్నారు.. కానీ రైతు బజార్లలో రూ. 25కే అందజేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మంచి చేయడంలో రాజీపడొద్దని అధికారులకు ఆదేశించినట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి మార్కెట్ యార్డ్‌ల్లో కూడా సబ్సిడీ ఉల్లి అందిస్తామని చెప్పారు.
రైతు బజార్లలో ఇవాళ ఇంత క్యూలు ఉన్నాయంటే.. ప్రభుత్వం తక్కువ ధరకే ఉల్లి అందించడమే కారణమని తెలిపారు. ఈ విషయాలేవీ చంద్రబాబుకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో మరెక్కడా కూడా ప్రభుత్వం ఉల్లి ధరల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. ప్రతిపక్షం చేస్తున్నది ధర్మమేనా అని ప్రశ్నించారు. వారు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు.
సాంబిరెడ్డి కుటుంబం ఉన్నత స్థితిలో ఉంది : కొడాలి నాని
రాష్ట్రంలో ఎవరు మరణిస్తారా అని.. చంద్రబాబు నాయుడు చూస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అసెంబ్లీలో కొడాలి నాని మాట్లాడుతూ.. ‘సాంబిరెడ్డి కుటుంబం ఉన్నత స్థితిలో ఉంది. ఆయన ఉల్లి కోసం చనిపోలేదని వారి కుటుంబ సభ్యులే చెప్పారు. ఎల్లో మీడియా ప్రతినిధులు సాంబిరెడ్డి కుటుంబానికి ఫోన్ చేసి వారిపై సభ్యులపై ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వస్తుందని చెప్పారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని వారు చెప్పిన వినిపించుకోలేదు. సాంబిరెడ్డి వాకింగ్ చేస్తూ కురగాయలకు వెళ్తుండగా చనిపోయారు. చనిపోయిన వ్యక్తికి 15 ఏళ్లుగా గుండె జబ్బు ఉంద’ని తెలిపారు. అలాగే సాంబిరెడ్డి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు.
ఆ వ్యక్తి ఉల్లి కోసం చనిపోలేదు : పార్థసారథి
టీడీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఓ వ్యక్తి చనిపోతే దానిని టీడీపీ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఉల్లి ధరలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ప్రతిపక్షం నీచ రాజకీయాలను మృతుడి కుటుంబ సభ్యులు తప్పుబట్టారని చెప్పారు. ఆ వ్యక్తి ఉల్లి సమస్యల వల్ల చనిపోలేదని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుకు ఏ విధంగా అండగా ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచించేవారని గుర్తుచేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులు పక్షపాతి అని మరోసారి స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు సబ్సిడీ మీద ఉల్లి సరఫరా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సమస్యను ముందుగానే గుర్తించి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. రూ. 5వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీని కూడా సరిగా చేయలేకపోయారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారు సూచనలు ఇవ్వాల్సింది పోయి.. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment