దారుణ మాఫీ | Inquisitiveness restrictions on farmers | Sakshi
Sakshi News home page

దారుణ మాఫీ

Published Tue, Aug 19 2014 12:49 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

దారుణ మాఫీ - Sakshi

దారుణ మాఫీ

  •     రైతులకు సవాలక్ష ఆంక్షలు
  •      30 అంశాలతో ప్రొఫార్మా
  •      ఆధార్, రేషన్‌కార్డు, మొబైల్  నెంబర్ తప్పనిసరి
  •      ఇవ్వనిపక్షంలో మాఫీ లేనట్లే
  •      వివరాల సేకరణ విధి విధానాలపైనేడు కలెక్టర్ సమీక్ష
  • రుణమాఫీకి విధిస్తున్న ఆంక్షలతో రైతులకు తల తిరిగిపోతోంది. సాధ్యమైనంతగా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోంది. సాగుబాటలో పల్లేరు ముళ్లు పరుస్తోంది. 30 అంశాలతో సృష్టించిన ప్రొఫార్మాతో అన్నదాతకు అడుగు ముందుకు సాగని పరిస్థితి ఎదురవుతోంది. దా‘రుణమాఫీ’ నాటకాన్ని గమనిస్తున్న కర్షకుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది.
     
    విశాఖ రూరల్ : రుణమాఫీపై ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత కుదించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం 30 అంశాలతో ఒక ప్రొఫార్మా తయారు రైతుల వివరాలను సేకరించాలని బ్యాంకర్లను ఆదేశించింది. ప్రధానంగా ఆధార్, రేషన్‌కార్డులతో పాటు మొబై ల్ నెంబర్ కూడ తప్పకుండా ఇవ్వాలన్న నిబంధన పెట్టింది.

    వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రుణం మాఫీ జరిగే అవకాశం లేకుండా చేసింది. దీంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. ఈ వివరాల సేకరణ విధానంపైనే కాకుండా జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు, ఎంతమొత్తం మాఫీ చేయాల్సి ఉందో అధికారులు 14 రోజుల్లో నివేదిక తయారు చేయనున్నారు. దీనిపై కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, వ్యవసాయాధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
     
    14 రోజుల్లో జాబితా : జిల్లాలో గత రబీ, ఖరీఫ్ సీజన్లలో అన్ని రకాల పంట రుణాలు కలిపి రూ.1040 కోట్ల మేర రైతులు బ్యాంకర్లకు బకాయి పడ్డారు. చంద్రబాబు రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. తాజాగా రైతులతో పాటు అన్ని పక్షాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 174 జీవోను జారీ చేసింది.

    రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వంతున పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. లబ్ధిదారుల ఏరివేత కోసం 30 అంశాలతో ఒక ప్రొఫార్మాను రూపొందించింది. గత ఏడాది రుణాలు పొందిన రైతుల నుంచి ఆ వివరాలన్నింటినీ సేకరించి 14 రోజుల్లో జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది.

    ఈ బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగించింది. ఇదిలా ఉంటే జిల్లాలో ఇప్పటికీ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు లేని వారు అనేకమంది ఉన్నారు. అటువంటి వారికి రుణాలు రద్దయ్యే అవకాశం లేదు. ఏజెన్సీలో ైరె తులకు ఫోన్ నెంబర్లు ఉండవు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.
     
    నేటి నుంచి కసరత్తు : జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితా రూపకల్పనకు మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఎంత మంది రైతులు ఎంత మొత్తంలో పంట రుణాలు పొందారో స్పష్టమైన వివరాలు అధికారుల వద్ద లేదు. తాజాగా ఒక కుటుంబానికి రూ.1.5 లక్షలు మాత్రమే రుణాలు రద్దు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ దిశగా లబ్ధిదారుల వడపోత జరగనుంది.

    ఒక కుటుంబంలో ఎంత మంది బ్యాంకు రుణాలు పొందారో రేషన్‌కార్డు, ఓటరు కార్డుల ద్వారా అధికారులు వివరాలను సేకరించనున్నారు. ఈ వివరాలు ఇవ్వని వారికి రుణమాఫీ వర్తించే అవకాశం లేదు. రెండు వారాల్లో ఈ జాబితాను తయారు చేయాల్సి ఉండడంతో వివర ల సేకరణ ఏ విధంగా చేపట్టాలన్న విషయంపై కలెక్టర్ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

    రుణాలు పొందిన వారు ప్రొఫార్మాలో ఉన్న వివరాలను బ్యాంకులకు ఇవ్వాలని ప్రకటిస్తే ఒక్కసారిగా రైతులందరూ బ్యాంకులకు క్యూలు కట్టే అవకాశమున్నందున వారం రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఈ ప్రక్రియను చేపట్టాలన్న విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తియితే జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు, ఎంత మొత్తంలో రుణాలు రద్దవుతాయన్న విషయం స్పష్టమవుతుందని  కలెక్టర్ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement