Sources
-
ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడాను అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. లదాఖ్ ప్రతిష్టంభనపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. కరోనావైరస్ చికిత్సకు మెరుగైన ఔషధంగా ట్రంప్ భావిస్తున్న యాంటి మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపాలని అమెరికా కోరినపుడు మాత్రమే మోదీ చివరిసారిగా మాట్లాడారని వివరణ ఇచ్చాయి. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్) భారత్, చైనా సరిహద్దు వివాదంలో ఇరు దేశాలు అంగీకరిస్తే మధ్య వర్తిత్వానికి తాను సిద్ధమనీ, దీనిపై మోదీ తో మాట్లాడినపుడు ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం ప్రభుత్వం స్పందించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ అంశానికి సంబంధించి భారత ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఆఖరి సంభాషణ ఏప్రిల్ 4 జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇద్దరు నాయకుల మధ్య ఇటీవలి కాలంలో ఎటువంటి పరస్పర చర్చలు జరగలేదని స్పష్టం చేశాయి. -
నగరిలో భారీ వర్షం
పిడుగుపడి రెండు పశువుల మృతి నగరి : మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పిడుగుపడటంతో కృష్ణరామాపురం గ్రామంలో లక్ష్మీదేవికి చెందిన ఆవు, ఎద్దు మృతి చెందాయి. మేతకు వాటిని చెరువు గట్టుకు తీసుకెళ్లిన సమయంలో ఆకస్మికంగా పిడుగుపడింది. ఆ సమయంలో లక్ష్మీదేవి దూరంగా ఉండటంతో ఆమెకు ప్రమాదం తప్పింది. మృతి చెందిన ఆవు, ఎద్దు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపింది. వీఆర్వో నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తహసీల్దార్‌కు నివేదిక సమర్పించారు. గంట సేపటికిపైగా భారీగా వర్షం కురవడంతో పట్టణ పరిధిలో జనజీవనం స్తంభించింది. వాహనాలు కూడా రోడ్లపై కాసేపు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆకస్మికంగా వర్షం పడటంతో ఇటుకల తయారీదారులు నష్టపోయారు. పాలసముద్రం మండలంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. -
దాంపత్యం ఓకే... బంగారం!
దాంపత్యం గురించి చెప్పుకోవాలంటే అజయ్ దేవగణ్, కాజోల్ జంట గురించే చెప్పుకోవాలి అంటుంటారు చాలామంది. వాళ్లిద్దర్ని చిలకాగోరింకలు అని కూడా పొగుడుతుంటారు. బయటి వాళ్ల పొగడ్తల సంగతి సరే, అజయ్‌ను కాజల్ గురించి అడిగి చూడండి... నాన్‌స్టాప్ పొగడ్తలు... కాజల్‌ను అజయ్ గురించి అడిగి చూడండి... సేమ్ టు సేమ్. అప్పుడెప్పుడో మానసిక విశ్లేషకులు ఒక మాట చెప్పారు - ‘కలహాల కాపురానికి చెక్ పెట్టడానికి... పొగడ్తలను మించిన గొప్ప ప్రత్యామ్నాయం ఏదీ లేదు’ అని. ఈ సూత్రం అజయ్-కాజల్ దాంపత్యానికి బానే వర్క్‌వుట్ అయింది. ఇది మాత్రమే కాదు... ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకోవడంలో ఇద్దరూ ముందుంటారు. ఒకరి అభిరుచిని మరొకరి మీద బలవంతంగా రుద్దుకోరు. పిల్లల కంపెనీని ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తారు. ‘నేను భర్తను కాబట్టి నా మాట వినాలి’ ‘నేను భార్యను కాబట్టి నా మాట వినాలి’ అనే వైఖరి వారిలో ఎప్పుడూ కనిపించదు. ఒకరి ఇష్టాలను మరొకరు... ‘ఓకే... బంగారం’ అంటూ గౌరవించుకోవడమే వారి ఆదర్శ దాంపత్యానికి సక్సెస్ మంత్ర కావచ్చు! -
కదులుతున్న ‘నకిలీ’ల డొంక
వెలుగుచూస్తున్న మరిన్ని విషయాలు యూనివర్సిటీ సర్టిఫికెట్లు సైతం తయారీ పెరుగుతున్న నిందితుల సంఖ్య ఒక్క దివిసీమలోనే 600 ఆటోలకు నకిలీ బీమా ! గుడివాడ అర్బన్/ చల్లపల్లి : నకిలీ సర్టిఫికెట్ల కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. రెండు రోజులుగా టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్న 9మంది నిందితులు వెల్లడిస్తున్న వాస్తవాలు తీవ్ర సంచలనానికి దారి తీస్తున్నాయి. దీంతో మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరు కార్డులే కాకుండా యూనివర్సిటీస్థాయి ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ పట్టాలను సైతం నకిలీవి సృష్టించి ఇస్తున్నట్లు విచారణలో గణేష్ అనే నిందితుడు బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఈ తరహా సర్టిఫికెట్లను తయారు చేసే వారిని, వీరి వద్ద నుంచి సర్టి ఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉన్నతోద్యోగాల్లో ఉన్న వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వెలుగు చూసిందిలా.... ఇటీవల గుడివాడ సివిల్ కోర్టుకు చెందిన ఓ ఉన్నతాధికారి భర్త ద్విచక్ర వాహనం బీమా రెన్యూవల్ చేయించమని కారు డ్రైవర్‌కు ఇచ్చారు. కారు డ్రైవర్ నకిలీ పత్రాలు సృష్టించే గణేష్‌ను ఆశ్రయించాడు. అతను ఇన్సూరెన్స్ పత్రాన్ని అందించాడు. ఇన్సూరెన్స్ పత్రం తీసుకున్న తరువాత కూడా కంపెనీ నుంచి యజమానికి ఫోన్ రావడంతో నెట్లో ఇన్సూరెన్స్‌ను చెక్ చేశాడు. ఇన్సూరెన్స్ రె న్యూవల్ చేయించలేదని తేలడంతో కారు డ్రైవర్ని నిలదీశాడు. గణేష్ అనే యువకుడు రెన్యూవల్ చేసి ఇచ్చాడని చెప్పాడు. దీంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వలపన్ని శనివారం రాత్రి గణేష్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల అదుపులో ఉన్నవారిని ప్రశ్నించడంతో 17ప్రైవేటు కంపెనీలకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ సర్టిఫికెట్‌నైనా సృష్టిస్తాడు.. ఏ సర్టిఫికెట్లనైనా సునాయాసంగా సృష్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి గణేష్ అని పోలీసుల విచారణలో బయటపడింది. ఇన్సూరెన్స్, ఆధార్, రేషన్, ఓటరుకార్డులతో పాటు ఆచార్య నాగార్జున, అంబేద్కర్, ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి అమ్ముతున్నాడు. రూ.2000నుంచి రూ.3000 తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. అదుపులో 15మంది నిందితులు.. ఆదివారం అదుపులోకి తీసుకున్న 9మంది నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. ఈ తరహా సర్టిఫికెట్లను ఏ నెట్ సెంటర్ నిర్వాహకులు తయారుచేస్తారని అడగడంతో మరో ఆరుగురు పేర్లను చెప్పారు. దీంతో ఆ ఆరుగురిని పోలీసులు ఆదివారం రాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఈ కేసులో మరో 20మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. గుడివాడలో 35శాతం అక్రమ ఆధార్‌లే.. గుడివాడలో నివసిస్తున్న వారిలో ఆధార్ కార్డులు పొందినవారిలో 35శాతం వరకూ అక్రమ కార్డులు పొందినవారేనని సమాచారం. ఒక్క గుడివాడ పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన కేసులు చాలా ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. బెంబేలెత్తుతున్న ఆటో డ్రైవర్లు.... దివిసీమలో వెలుగుచూసిన నకిలీబీమా పత్రాలు ఆటో డ్త్రెవర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నకిలీ పత్రాల వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎలాంటి బీమా సౌకర్యం వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారికి భద్రత లేకుండా పోయింది. దివిసీమ కేంద్రంగా ఏడాదిన్నర నుంచి సంబంధిత శాఖాధికారులకు తెలిసి ఈ బాగోతం సాగుతున్నా ముడుపులు తీసుకుని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. రూ.3,893 బీమా రూ.1,500లకే! ఆటోకు సంబంధించి పెంచిన ధరల ప్రకారం ఏడాదికి రూ.11,500 వరకూ బీమా చెల్లించాల్సి ఉంది. ప్రమాదం జరిగినపుడు ఆటోకు, వాహనం నడిపే డ్త్రెవర్, అందులోని ముగ్గురు ప్రయాణికులకు ప్రమాద తీవ్రతను బట్టి బీమా సొమ్ము చెల్లిస్తారు. అలాకాకుండా చాలా మంది డ్రెవర్లు థర్డ్‌పార్టీకి మాత్రమే బీమా చేయిస్తుంటారు. ఇందుకోసం ఏడాదికి రూ.3,893 చెల్లించాల్సి ఉండగా, ఇదికూడా భారంగా భావిస్తున్న డ్త్రెవ ర్ల కోసం అక్రమార్కులు ప్రత్యేక స్కీం పెట్టారు. కొంతమంది ఆటోడ్త్రెవర్లకు ఈ విషయాన్ని చెప్పి రూ.3,893 విలువగల బీమా పత్రాలను రూ.1,500కే అందజేస్తున్నారు. తనిఖీల సమయంలో బీమా రెన్యూవల్ అయిందా లేదా అని మాత్రమే సంబంధిత అధికారులు పరిశీలిస్తుండటంతో నకిలీ బీమా పత్రాలు చెల్లుబాటవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి దివిసీమలో ఇలాంటి పత్రాలు 600ఆటోలకు అందజేసినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. -
బీమాయగాళ్లు దొరికారు
‘నకిలీ ఇన్సూరెన్సు’ గుట్టురట్టు రూ.100కే నకిలీ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డులు గుడివాడ, చల్లపల్లి కేంద్రాలుగా అక్రమ వ్యాపారం పోలీసుల అదుపులో తొమ్మిది మంది గుడివాడ అర్బన్ : వాహనాలకు సంబంధించి నకిలీ బీమా పత్రాలను తయారు చేస్తున్న వారి గుట్టు రట్టయ్యింది. స్థానిక టూటౌన్ పోలీసులు పకడ్బందీగా దాడి చేసి నకిలీల ఆటకట్టించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లోని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నకిలీ బాగోతానికి పట్టణానికి చెందిన ఓ యువకుడు సూత్రధారని పోలీసులు గుర్తించారు. వాహనాలకు సంబంధించిన బీమా కాగితాలను నకిలీవి తయారు చేస్తున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పట్టణంలోని కొన్ని ఇంటర్నెట్ సెంటర్లలో టూటౌన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో బీమా రెన్యువల్ పత్రాలతోపాటు ఆధార్, రేషన్, ఓటరు కార్డులను సైతం నకిలీవి తయారుచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా మొదలైంది... గుడివాడకు చెందిన నాగగణేష్ అనే యువకుడు కొంతకాలం క్రితం స్థానిక ఆర్టీఏ కార్యాలయం వద్ద మకాం వేశాడు. వాహనచోదకులకు ఏమైనా సర్టిఫికెట్లు, దరఖాస్తులు అవసరమైతే సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ద్వి చక్రవాహనాలకు బీమా చేసే ఓ ప్రయివేటు సంస్థకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని ఫొటో షాప్‌లో ఫోర్జరీ చేయడం ప్రారంభించాడు. తమ వాహనాలకు బీమా గడువు ముగిసిందని ఎవరైనా ఆర్టీఏ కార్యాలయానికి వస్తే వారితో మాట్లాడి రూ.100 ఇస్తే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసిన కాగితాలు అందజేస్తానని నమ్మించేవాడు. దీంతో వాహనదారులు బీమా కంపెనీకి రూ.2వేలు చెల్లించడం కన్నా ఇతనికి రూ.100 ఇస్తే పని జరిగిపోతుందని భావించి నకిలీ రెన్యువల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. క్రమంగా గణేష్ పట్టణంలోని అన్ని ఇంటర్నెట్ సెంటర్ల నుంచి తన కార్యకలాపాలను సాగించడం ప్రారంభించాడు. రోజుకు ఒక నెట్ సెంటర్ వద్ద ఉంటూ వాహనదారులకు అవసరమైన సర్టిఫికెట్లను తయారుచేసి అందజేస్తూ రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నాడు. మోసం ఇలా... తొలుత బీమా కంపెనీ వెబ్సైట్ నుంచి రెన్యువల్ కాపీలను డౌన్లోడ్ చేస్తాడు. ఆ కాపీని ఫొటోషాప్‌లో పేర్లు, సీరియల్ నంబర్లను మార్పు చేస్తాడు. అనంతరం వాహనదారులకు అందజేస్తాడు. నెట్ సెంటర్ల నిర్వాహకులకు అలవాటు... తొలిరోజుల్లో తాను మాత్రమే ఈ నకిలీ వ్యవహారాన్ని నడిపిన గణేష్ ఇటీవల పట్టణంలోని పలు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులకు కూడా అలవాటు చేశాడు. వారు బీమా రెన్యూవల్ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్, రేషన్, ఓటరు కార్డులను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. పలు నెట్ సెంటర్ల నిర్వాహకులు కంప్యూటర్లో తయారుచేసిన నకిలీ కార్డులు, ధ్రువీకరణ పత్రాలను ఈ-మెయిల్ ద్వారా డిజిటల్ కలర్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ల్యాబ్ వారు ఒక్కో కార్డుకు రూ.40 చొప్పున తీసుకుని ప్రింట్ తీసి లామినేషన్ చేసి అందజేస్తున్నారు. ఇదే విధంగా అవనిగడ్డ, చల్లపల్లిలలోనూ ఇంటర్నెట్, సెల్పాయింట్ షాపుల నిర్వాహకులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఏ సర్టిఫికెట్ అయినా తయారుచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల అదుపులో తొమ్మిది మంది పోలీసులు పథకం ప్రకారం శనివారం రాత్రి గణేష్‌కు ఫోన్‌చేసి ఇన్సూరెన్స్ రెన్యువల్ సర్టిఫికెట్ కావాలని కోరారు. వెంటనే స్పందించిన గణేష్ ఓ ప్రదేశానికి రావాలని సూచించాడు. అతను సత్యనారాయణపురంలోని ఓ నెట్ సెంటర్‌కు చేరుకున్నాడు. క్షణాల్లో నకిలీ ఇన్సూరెన్స్ రెన్యువల్ సర్టిఫికెట్‌ను సిద్ధంచేసి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న గణేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో టూటౌన్ ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి చల్లపల్లి వెళ్లి ఓ వ్యక్తిని, యాకనూరు, కోడూరు, నాగాయలంకలలో ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆదివారం ఉదయం గుడివాడలో మరో నలుగురిని స్టేషన్‌కు తరలించారు. వీరందరినీ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతంలో కలకలం.. అవనిగడ్డ : ఆటోలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న గాజులవారి పాలేనికి చెందిన ఆటోడ్రైవర్ గాజుల అంకారావును గుడివాడ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి కొద్దిరోజుల కిందట నాగాయలంకకు చెందిన మరో ఆటోడ్రైవర్‌ను కూడా గుడివాడ పోలీసులే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అంకారావును అదుపులోకి తీసుకోవడం అవనిగడ్డ ప్రాంతంలో కలకలం సృష్టించింది. -
గ్యాస్‌కు, రేషన్‌కు ఆధార్‌తో ముడిపెట్టొద్దు
అధికారులకు మంత్రి సునీత ఆదేశం విశాఖపట్నం : గ్యాస్‌కు, రేషన్‌కు ఆధార్‌తో ముడిపెట్టొద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎప్పటిలాగే ఈ రెండు నిత్యావసరాలను వినియోగదారులకు అందించాలని పౌరసరఫరాల అధికా రులను ఆదేశించారు. నగరంలోని సిరిపురం జంక్షన్లో గల వాల్తేర్ అప్లేండ్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆధార్‌ను దేనికీ అనుసంధానం చేసేలా ప్రభుత్వం ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. బోగస్‌కార్డులు, బోగస్ పెన్షన్లు వెలికితీయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పట్టణప్రాంతాల్లో ఆధార్ నమోదు సంతృప్తికరంగా ఉన్నా, గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో నమోదు మందకొడిగా ఉండటంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఆధార్ నమెదు తక్కువగా ఉన్న గ్రామాలకు అవసరమైతే మొబైల్ వాహనాలను పంపించి అరందరికీ ఆధార్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
మరో ని‘బంధనం’
రుణమాఫీకి భూమి సర్వే నంబర్ కావాలట జిల్లాలో 50శాతం మంది రైతులు దూరం విశాఖ రూరల్ : వరికుప్పంత హామీనిచ్చి.. వడ్ల గింజంత రుణమాఫీకి చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంది. వారానికో ఉత్తర్వులతో రైతుల్ని హతాశుల్ని చేస్తోం ది. విస్తరి వేసి వడ్డన ఎగ్గొట్టినట్లు.. ఆర్భాటంగా ఇచ్చిన రుణమాఫీ హామీ నుంచి తప్పించుకోవడానికి శతవిధా లా యత్నిస్తోంది. ఇప్పటికే కుటుంబంలో ఒక్కరే మాఫీకి అర్హులని, ఉద్యానవన రైతులకు వర్తించదని ప్రకటించారు. ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం వంటి నిబంధనలు విధించారు. తాజాగా.. అడ్డగోలుగా సర్వే నంబర్ అడ్డంకిని సృష్టించారు. దీంతో జిల్లా రైతుల్లో 50 శాతం మంది రుణమాఫీకి దూరం కానున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల తప్పిదాలు ప్రభుత్వానికి కలిసివస్తున్నాయి. భూమి క్రయవిక్రయాలు, వారసులకు రాసి చ్చిన తర్వాత అధికారులు రెవెన్యూ అడంగళ్లలో మార్పులు చేయకుండా, ఒకే సర్వే నంబర్‌ను నమోదుతో చాలా మంది రైతులు రుణమాఫీకి దూరం కానున్నారు. ఒక్కరే అర్హులు.. ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మాఫీ అర్హతకు 31 అంశాలకు సంబంధించిన సమాచారం పొందుపర్చాలి. ఇందులో రైతులు పూర్తి చేయాల్సినవి కొన్ని కాగా, మిగిలినవి బ్యాంకులు నమోదు చేయాల్సినవి. ఇందుకు ప్రభుత్వం రూపొందించి, బ్యాంకులకు అందజేసిన సాఫ్ట్‌వేర్‌లో సర్వే నంబర్ కూడా చేర్చింది. ఒకే సర్వే నంబర్‌తో ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది రైతులు మాఫీకి దరఖాస్తు చేసుకుంటే.. కేవలం ఒక్కరి రుణమే మాఫీ అవుతుంది. ఒకే సర్వే నంబర్‌పై వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు పొందినా, ఒకరి కన్నా ఎక్కువ మంది ఒకే సర్వే నంబర్ ఇచ్చినా దానిని సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. అప్పుడు ప్రభుత్వం నియమించే టెక్నికల్ కమిటీ ఒకరిని మాత్రమే రుణమాఫీకి అర్హుడిగా ఎంపిక చేస్తుంది. మాయోపాయాలు.. చాలా చోట్ల ఒక సర్వే నంబర్‌పై భూమి క్రయవిక్రయాలు జరిగాయి. సాధారణంగా తండ్రి ఆస్తిని అదే సర్వే నంబర్‌పై వారసులకు పంపిణీ చేసి రిజిస్టర్ చేస్తుంటారు. దీని ఆధారంగానే రెవెన్యూ అధికారులు వారికి టైటిల్‌డీడ్, పట్టాదారుపాస్‌పుస్తకాలను మంజూరు చేస్తున్నారు తప్పా సర్వే నంబర్ల సబ్ డివిజన్ చేసి, అడంగళ్లలో నమోదు చేయడం లేదు. సర్వే నంబర్ల సబ్ డివిజన్‌కు అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా పట్టించుకోవడం లేదు. సాధారణంగా బ్యాంకులు సర్వే నంబర్‌తో సంబంధం లేకుండా టైటిల్ డీడ్, పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. పంట నష్టపోతే ప్రభుత్వం కూడా వీటి ఆధారంగానే పెట్టుబడి రాయితీ ఇస్తోంది. దీని వల్ల చాలా మంది రైతులు ఇప్పటి వరకు సర్వే నంబర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రుణమాఫీకి సర్వే నంబర్‌ను కూడా నమోదు చేయాలని చెప్పడంతో లబోదిబోమంటున్నారు. -
పెన్షన్..టెన్షన్
పెన్షన్‌దారుల కోసం 19, 20 తేదీల్లో ప్రత్యేక సర్వే ఆధార్ లేకపోతే పెన్షన్ కట్! ఇంట్లో ఒక్కరికే చాన్స్ సర్వేకు కమిటీల్లో రాజకీయ నాయకులకు చోటు ఆందోళనలో లబ్ధిదారులు మచిలీపట్నం : చంద్రబాబు ప్రభుత్వం మరో వంచనకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈసారి ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు అన్యాయం చేసే విషయంపై దృష్టిపెట్టింది. వారికి అందుతున్న సామాజిక పింఛన్లలో కోత విధించేందుకు సర్వే పేరుతో సిద్ధమైంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అక్టోబరు 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 చొప్పున పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 3,32,836 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో అభయహస్తం పథకం ద్వారా 20వేల మంది వరకు ఉన్నారు. ఈ లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం అకస్మాత్తుగా సర్వే చేపట్టిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీడీవోలకు విధివిధానాలు వివరించిన కలెక్టర్ పెన్షన్ లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ బుధవారం సాయంత్రం జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విధివిధానాలను వివరించారు. సర్వే కమిటీలో సభ్యులు వీరే.. సర్వే చేపట్టే కమిటీలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, డ్వాక్రా సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. పురపాలక సంఘాల్లో సర్వే నిర్వహించే బృందంలో వార్డు కౌన్సిలర్‌తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ లేదా బిల్ కలెక్టర్ మిగిలిన సభ్యులు ఉంటారు. ఏదైనా గ్రామంలో, వార్డులో 250కు మించి పెన్షన్ పొందే లబ్ధిదారులు ఉంటే రెండో కమిటీని ఏర్పాటు చేస్తారు. విధి విధానాలు ఇవే.. రేషన్ కార్డు ఉండి పెన్షన్ పొందుతూ ఆధార్‌కార్డు లేని వారిని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. పింఛను పొందే లద్ధిదారులకు రెండు న్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్టభూమి ఉంటే అనర్హులుగా గుర్తిస్తారు. నాలుగు చక్రాల వాహనం ఉన్నా అనర్హులుగానే గుర్తిస్తారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పెన్షన్ పొందుతుంటే వారిలో ఒకరికి రద్దు చేస్తారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందతూ సామాజిక పెన్షన్ తీసుకుంటున్నా రద్దు చేస్తారు. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తూ నెలవారీ జీతం తీసుకుంటున్న వారు, ఔట్సోర్సింగ్ పద్ధతిపై ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు అనర్హులు. స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతూ సామాజిక పెన్షన్ తీసుకుంటున్న వారికి నిలిపివేస్తారు. ఆధారాలు చూపాల్సిందే ఇప్పటి వరకు కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారని ప్రచారం జరిగింది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఏదైనా నిర్దేశిత ప్రదేశంలో కమిటీ సభ్యులు ఉంటారని, అక్కడికే లబ్ధిదారులు వచ్చి సరైన ఆధారాలు చూపాలని అధికారులు నిర్ణయించారు. సర్వే చేసే రెండు రోజుల పాటు లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే వారి పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. రాజకీయ ప్రమేయం సర్వే కమిటీ సభ్యుల్లో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వార్డు కౌన్సిలర్, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు అధిక శాతం టీడీపీకి చెందిన వారే ఉన్నారు. కాబట్టి తమకు ఓటు వేయలేదనే అనుమానం ఉన్న వారికి పెన్షన్ రాకుండా చేసే అవకాశం ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో పెన్షన్‌దారులకు సంబంధించిన సర్వేను ముగించి, 21వ తేదీన నూతన పెన్షన్ దరఖాస్తులు తీసుకునే అవకాశాన్ని కమిటీ సభ్యులకు కల్పించారు. ఈ అవకాశంతో ఇప్పటి వరకు పెన్షన్ పొందుతున్న వారిని పక్కనపెట్టి, తమకు ఇష్టం వచ్చిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయించేలా రాజకీయ నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిలిపివేయండి : నిడుమోలు పింఛనుదారులను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ రెండు రోజుల సర్వేను చేపట్టిందని, దీనిని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ బుధవారం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి చదువు ఉండదని, వారి వయసు ఎంతో వారే చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న కొద్దిపాటి పెన్షన్ కూడా నిలిపివేసేందుకే ఈ సర్వే చేపట్టిందని ఫిర్యాదులో వివరించారు. అర్హులైన పెన్షన్ దారులపై అనర్హత వేటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
పెను విషాదం
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం మృతులంతా గోదావరి జిల్లాల వాసులే వీరవల్లి వద్ద ఘటన తమ బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న వారు కొందరు.. రుణమాఫీకి ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు మరికొందరు.. ఇలా కారణాలు వేరైనా వారందరూ కూలి కోసం పొట్ట చేతపట్టుకుని వెళుతున్న వారే. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సి ఉండగా, గాఢనిద్రలోనే రోడ్డు ప్రమాదం రూపంలో దూసుకొచ్చిన మృత్యుఒడికి చేరుకున్నారు. కళ్ల ఎదుటే తమ కుటుంబ సభ్యులు మరణించడంతో గాయపడి చికిత్స పొందుతున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. విజయవాడ సిటీ/వీరవల్లి (హనుమాన్‌జంక్షన్‌రూరల్) : వేర్వేరు ప్రాంతాలకు చెందిన బంధువులు, పరసర గ్రామాలకు చెందిన మరి కొందరు బతుకుదెరువు కోసం హైదరాబాదు వెళ్లారు. ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగొస్తూ మార్గమధ్యంలో రోడ్డుప్రమాదానికి గురై ఏడుగురు మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది. శనివారం తెల్లవారుజామున హనుమాన్ జంక్షన్ మండలం వీరవల్లి వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఆరుగురు గాయపడ్డారు. బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వస్తూ.. ఇటీవల మృతిచెందిన బంధువు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెల్లిపల్లి శ్రీనివాసరావు, తన సోదరి, కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు, అతని బావ కోనాల మరాఠీ, మేనల్లుడు మణికంఠ, మనవడు శ్రీకృష్ణ మృత్యువాతపడ్డారు. వీరంతా పశ్చిమ గోదారి జిల్లా తాళ్లపూడి, వీరవల్లి మండలాలకు చెందిన వారు. వీరిలో శ్రీనివాసరావు భార్య నాగమణి, సోదరి సీతామాలక్ష్మి, కుమార్తె సత్యవేణి, ఆమె కుమారుడు ఆదిత్య విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుణమాఫీ కోసం వస్తూ.. ప్రభుత్వం రుణమాఫీ కోసం ఆధార్‌ను అనుసంధానం చేయించుకోవాలని చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వేములపాలెం, పెద్దిపాలెం గ్రామాలకు చెందిన పుట్టా నాగభూషణం, బంధం లవరాజు కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాసరావు బృందంతో కలిసి స్వస్థలానికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో నాగభూషణం, అతని భార్య నాగమణి, బంధం లోవరాజు మృతిచెందారు. లోవరాజు భార్య కాసులమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్టు సమాచారం తెలసుకొని బోరున విలపిస్తూ అక్కడికి వెళ్లారు. డ్రైవరు అజాగ్రత్త వల్లే.. ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో వస్తూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు అజాగ్రత్తగా వ్యాన్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుకు లోనైన స్థితిలో డ్రైవరు ఆగి వున్న లారీని ఢీకొట్టినట్టు వివరించారు. ప్రమాద సమయంలో వ్యానులోని కెమికల్ పీపాలు పగిలి ఆవిర్లతో కూడిన పొగ దట్టంగా వ్యాపించింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు రక్షించేందుకు వెళ్లగా, కళ్లలో మంటలు రావడంతో భయభ్రాంతులకు గురై వెనుదిరిగారు. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో బాధితుల ఆర్తనాదాలు విజయవాడ : ‘అమ్మా.. ముఖం మంట పుడుతుంది...’ అంటూ నాలుగేళ్ల చిన్నారి ఆర్తనాదాలు.. ‘అమ్మా... కాలు నొప్పిగా ఉంది.. మంచినీళ్లు ఇవ్వమ్మా..’ అంటూ పన్నెండేళ్ల బాలుడి కేకలు. వారి ఆర్తనాదాలు వినిలేని స్థితిలో తల్లులు.. ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్స విభాగంలో శనివారం ఉదయం నెలకొన్న పరిస్థితి ఇదీ. గాయాల బాధ భరించలేక ఆర్తనాదాలు చేస్తూనే పన్నెండేళ్ల మణికంఠ మృతి చెందాడు. పిల్లలు, భర్తలను కోల్పోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్న మహిళలు తమను పట్టించుకునేందుకు అయినవారెవరూ లేక ఆస్పత్రిలో అల్లాడిపోయారు. పశ్చిమగోదారి జిల్లా వీరవల్లి మండలం, అనంతపల్లికి చెందిన తమ్మిశెట్టి సత్యవేణి(25)కి భర్త కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె కుమారులు శ్రీకృష్ణ(6), ఆదిత్య(4)లను తీసుకుని తండ్రి వెల్లిపల్లి శ్రీనివాసరావుతో కలిసి హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఉంటోంది. కూలిపనులు చేసి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. శనివారం నాటి ప్రమాదంలో శ్రీకృష్ణ మృతి చెందగా, ఆదిత్య ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. సత్యవేణి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు కూడా ప్రమాదంలో మృతి చెందగా, తల్లి నాగమణి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, వారికి పరిచయస్తులైన ముగ్గురు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు, బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
దారుణ మాఫీ
రైతులకు సవాలక్ష ఆంక్షలు 30 అంశాలతో ప్రొఫార్మా ఆధార్, రేషన్‌కార్డు, మొబైల్ నెంబర్ తప్పనిసరి ఇవ్వనిపక్షంలో మాఫీ లేనట్లే వివరాల సేకరణ విధి విధానాలపైనేడు కలెక్టర్ సమీక్ష రుణమాఫీకి విధిస్తున్న ఆంక్షలతో రైతులకు తల తిరిగిపోతోంది. సాధ్యమైనంతగా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోంది. సాగుబాటలో పల్లేరు ముళ్లు పరుస్తోంది. 30 అంశాలతో సృష్టించిన ప్రొఫార్మాతో అన్నదాతకు అడుగు ముందుకు సాగని పరిస్థితి ఎదురవుతోంది. దా‘రుణమాఫీ’ నాటకాన్ని గమనిస్తున్న కర్షకుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. విశాఖ రూరల్ : రుణమాఫీపై ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత కుదించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం 30 అంశాలతో ఒక ప్రొఫార్మా తయారు రైతుల వివరాలను సేకరించాలని బ్యాంకర్లను ఆదేశించింది. ప్రధానంగా ఆధార్, రేషన్‌కార్డులతో పాటు మొబై ల్ నెంబర్ కూడ తప్పకుండా ఇవ్వాలన్న నిబంధన పెట్టింది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా రుణం మాఫీ జరిగే అవకాశం లేకుండా చేసింది. దీంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. ఈ వివరాల సేకరణ విధానంపైనే కాకుండా జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు, ఎంతమొత్తం మాఫీ చేయాల్సి ఉందో అధికారులు 14 రోజుల్లో నివేదిక తయారు చేయనున్నారు. దీనిపై కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, వ్యవసాయాధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. 14 రోజుల్లో జాబితా : జిల్లాలో గత రబీ, ఖరీఫ్ సీజన్లలో అన్ని రకాల పంట రుణాలు కలిపి రూ.1040 కోట్ల మేర రైతులు బ్యాంకర్లకు బకాయి పడ్డారు. చంద్రబాబు రుణాలు రద్దు చేస్తామని ప్రకటించడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. తాజాగా రైతులతో పాటు అన్ని పక్షాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 174 జీవోను జారీ చేసింది. రైతు కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వంతున పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. లబ్ధిదారుల ఏరివేత కోసం 30 అంశాలతో ఒక ప్రొఫార్మాను రూపొందించింది. గత ఏడాది రుణాలు పొందిన రైతుల నుంచి ఆ వివరాలన్నింటినీ సేకరించి 14 రోజుల్లో జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ బాధ్యతలను కలెక్టర్‌కు అప్పగించింది. ఇదిలా ఉంటే జిల్లాలో ఇప్పటికీ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు లేని వారు అనేకమంది ఉన్నారు. అటువంటి వారికి రుణాలు రద్దయ్యే అవకాశం లేదు. ఏజెన్సీలో ైరె తులకు ఫోన్ నెంబర్లు ఉండవు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. నేటి నుంచి కసరత్తు : జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితా రూపకల్పనకు మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో ఎంత మంది రైతులు ఎంత మొత్తంలో పంట రుణాలు పొందారో స్పష్టమైన వివరాలు అధికారుల వద్ద లేదు. తాజాగా ఒక కుటుంబానికి రూ.1.5 లక్షలు మాత్రమే రుణాలు రద్దు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ దిశగా లబ్ధిదారుల వడపోత జరగనుంది. ఒక కుటుంబంలో ఎంత మంది బ్యాంకు రుణాలు పొందారో రేషన్‌కార్డు, ఓటరు కార్డుల ద్వారా అధికారులు వివరాలను సేకరించనున్నారు. ఈ వివరాలు ఇవ్వని వారికి రుణమాఫీ వర్తించే అవకాశం లేదు. రెండు వారాల్లో ఈ జాబితాను తయారు చేయాల్సి ఉండడంతో వివర ల సేకరణ ఏ విధంగా చేపట్టాలన్న విషయంపై కలెక్టర్ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రుణాలు పొందిన వారు ప్రొఫార్మాలో ఉన్న వివరాలను బ్యాంకులకు ఇవ్వాలని ప్రకటిస్తే ఒక్కసారిగా రైతులందరూ బ్యాంకులకు క్యూలు కట్టే అవకాశమున్నందున వారం రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఈ ప్రక్రియను చేపట్టాలన్న విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తియితే జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు, ఎంత మొత్తంలో రుణాలు రద్దవుతాయన్న విషయం స్పష్టమవుతుందని కలెక్టర్ తెలిపారు.