పెను విషాదం | Seven killed in road accident | Sakshi
Sakshi News home page

పెను విషాదం

Published Sun, Sep 7 2014 1:55 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

పెను విషాదం - Sakshi

పెను విషాదం

  • రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం  
  •  మృతులంతా గోదావరి జిల్లాల వాసులే
  •  వీరవల్లి వద్ద ఘటన
  • తమ బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న వారు కొందరు.. రుణమాఫీకి ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు మరికొందరు.. ఇలా కారణాలు వేరైనా వారందరూ కూలి కోసం పొట్ట చేతపట్టుకుని వెళుతున్న వారే. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సి ఉండగా, గాఢనిద్రలోనే రోడ్డు ప్రమాదం రూపంలో దూసుకొచ్చిన మృత్యుఒడికి చేరుకున్నారు. కళ్ల ఎదుటే తమ కుటుంబ సభ్యులు మరణించడంతో గాయపడి చికిత్స పొందుతున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  
     
    విజయవాడ సిటీ/వీరవల్లి (హనుమాన్‌జంక్షన్‌రూరల్) : వేర్వేరు ప్రాంతాలకు చెందిన బంధువులు, పరసర గ్రామాలకు చెందిన మరి కొందరు బతుకుదెరువు కోసం హైదరాబాదు వెళ్లారు. ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగొస్తూ మార్గమధ్యంలో రోడ్డుప్రమాదానికి గురై ఏడుగురు మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది. శనివారం తెల్లవారుజామున హనుమాన్ జంక్షన్ మండలం వీరవల్లి వద్ద  ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఆరుగురు గాయపడ్డారు.
     
    బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వస్తూ..

    ఇటీవల మృతిచెందిన బంధువు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెల్లిపల్లి శ్రీనివాసరావు, తన సోదరి, కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు, అతని బావ కోనాల మరాఠీ, మేనల్లుడు మణికంఠ, మనవడు శ్రీకృష్ణ మృత్యువాతపడ్డారు. వీరంతా పశ్చిమ గోదారి జిల్లా తాళ్లపూడి, వీరవల్లి మండలాలకు చెందిన వారు. వీరిలో శ్రీనివాసరావు భార్య నాగమణి, సోదరి సీతామాలక్ష్మి, కుమార్తె సత్యవేణి, ఆమె కుమారుడు ఆదిత్య విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
     
    రుణమాఫీ కోసం వస్తూ..

    ప్రభుత్వం రుణమాఫీ కోసం ఆధార్‌ను అనుసంధానం చేయించుకోవాలని చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వేములపాలెం, పెద్దిపాలెం గ్రామాలకు చెందిన పుట్టా నాగభూషణం, బంధం లవరాజు కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాసరావు బృందంతో కలిసి స్వస్థలానికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో నాగభూషణం, అతని భార్య నాగమణి, బంధం లోవరాజు మృతిచెందారు. లోవరాజు భార్య కాసులమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్టు సమాచారం తెలసుకొని బోరున విలపిస్తూ అక్కడికి వెళ్లారు.
     
    డ్రైవరు అజాగ్రత్త వల్లే..

    ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో వస్తూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు అజాగ్రత్తగా వ్యాన్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుకు లోనైన స్థితిలో డ్రైవరు ఆగి వున్న లారీని ఢీకొట్టినట్టు వివరించారు. ప్రమాద సమయంలో వ్యానులోని కెమికల్ పీపాలు పగిలి ఆవిర్లతో కూడిన పొగ దట్టంగా వ్యాపించింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు రక్షించేందుకు వెళ్లగా, కళ్లలో మంటలు రావడంతో భయభ్రాంతులకు గురై వెనుదిరిగారు. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికులు రాకుండా చర్యలు తీసుకున్నారు.
     
    ఆస్పత్రిలో బాధితుల ఆర్తనాదాలు

    విజయవాడ : ‘అమ్మా.. ముఖం మంట పుడుతుంది...’ అంటూ నాలుగేళ్ల చిన్నారి ఆర్తనాదాలు.. ‘అమ్మా... కాలు నొప్పిగా ఉంది.. మంచినీళ్లు ఇవ్వమ్మా..’ అంటూ పన్నెండేళ్ల బాలుడి కేకలు. వారి ఆర్తనాదాలు వినిలేని స్థితిలో తల్లులు.. ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్స విభాగంలో శనివారం ఉదయం నెలకొన్న పరిస్థితి ఇదీ. గాయాల బాధ భరించలేక ఆర్తనాదాలు చేస్తూనే పన్నెండేళ్ల మణికంఠ మృతి చెందాడు.

    పిల్లలు, భర్తలను కోల్పోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్న మహిళలు తమను పట్టించుకునేందుకు అయినవారెవరూ లేక ఆస్పత్రిలో అల్లాడిపోయారు. పశ్చిమగోదారి జిల్లా వీరవల్లి మండలం, అనంతపల్లికి చెందిన తమ్మిశెట్టి సత్యవేణి(25)కి భర్త కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె కుమారులు శ్రీకృష్ణ(6), ఆదిత్య(4)లను తీసుకుని తండ్రి వెల్లిపల్లి శ్రీనివాసరావుతో కలిసి హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఉంటోంది. కూలిపనులు చేసి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.

    శనివారం నాటి ప్రమాదంలో శ్రీకృష్ణ మృతి చెందగా, ఆదిత్య ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. సత్యవేణి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు కూడా ప్రమాదంలో మృతి చెందగా, తల్లి నాగమణి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, వారికి పరిచయస్తులైన ముగ్గురు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు, బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement