పెన్షన్..టెన్షన్ | Pension Tension | Sakshi
Sakshi News home page

పెన్షన్..టెన్షన్

Published Thu, Sep 18 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

పెన్షన్..టెన్షన్

పెన్షన్..టెన్షన్

  • పెన్షన్‌దారుల కోసం 19, 20 తేదీల్లో ప్రత్యేక సర్వే
  •   ఆధార్ లేకపోతే పెన్షన్ కట్!
  •   ఇంట్లో ఒక్కరికే చాన్స్
  •   సర్వేకు కమిటీల్లో రాజకీయ నాయకులకు చోటు
  •   ఆందోళనలో లబ్ధిదారులు
  • మచిలీపట్నం : చంద్రబాబు ప్రభుత్వం మరో వంచనకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈసారి ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు అన్యాయం చేసే విషయంపై దృష్టిపెట్టింది. వారికి అందుతున్న సామాజిక పింఛన్లలో కోత విధించేందుకు సర్వే పేరుతో సిద్ధమైంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అక్టోబరు 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 చొప్పున పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 3,32,836 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో అభయహస్తం పథకం ద్వారా 20వేల మంది వరకు ఉన్నారు. ఈ లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం అకస్మాత్తుగా సర్వే చేపట్టిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    ఎంపీడీవోలకు విధివిధానాలు వివరించిన కలెక్టర్

    పెన్షన్ లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ బుధవారం సాయంత్రం జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విధివిధానాలను వివరించారు.
     
    సర్వే కమిటీలో సభ్యులు వీరే..

    సర్వే చేపట్టే కమిటీలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, డ్వాక్రా సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. పురపాలక సంఘాల్లో సర్వే నిర్వహించే బృందంలో వార్డు కౌన్సిలర్‌తో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేదా బిల్ కలెక్టర్ మిగిలిన సభ్యులు ఉంటారు. ఏదైనా గ్రామంలో, వార్డులో 250కు మించి పెన్షన్ పొందే లబ్ధిదారులు ఉంటే రెండో కమిటీని ఏర్పాటు చేస్తారు.
     
    విధి విధానాలు ఇవే..

    రేషన్ కార్డు ఉండి పెన్షన్ పొందుతూ ఆధార్‌కార్డు లేని వారిని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది.
     
    పింఛను పొందే లద్ధిదారులకు రెండు న్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్టభూమి ఉంటే అనర్హులుగా గుర్తిస్తారు.
     
    నాలుగు చక్రాల వాహనం ఉన్నా అనర్హులుగానే గుర్తిస్తారు.
     
    ఒకే కుటుంబంలో ఇద్దరు పెన్షన్ పొందుతుంటే వారిలో ఒకరికి రద్దు చేస్తారు.
     
    ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందతూ సామాజిక పెన్షన్ తీసుకుంటున్నా రద్దు చేస్తారు.
     
    ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తూ నెలవారీ జీతం తీసుకుంటున్న వారు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు అనర్హులు.
     
    స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతూ సామాజిక పెన్షన్ తీసుకుంటున్న వారికి నిలిపివేస్తారు.
     
    ఆధారాలు చూపాల్సిందే

    ఇప్పటి వరకు కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారని ప్రచారం జరిగింది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఏదైనా నిర్దేశిత ప్రదేశంలో కమిటీ సభ్యులు ఉంటారని, అక్కడికే లబ్ధిదారులు వచ్చి సరైన ఆధారాలు చూపాలని అధికారులు నిర్ణయించారు. సర్వే చేసే రెండు రోజుల పాటు లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే వారి పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది.
     
    రాజకీయ ప్రమేయం

    సర్వే కమిటీ సభ్యుల్లో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వార్డు కౌన్సిలర్, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు అధిక శాతం టీడీపీకి చెందిన వారే ఉన్నారు. కాబట్టి తమకు ఓటు వేయలేదనే అనుమానం ఉన్న వారికి పెన్షన్ రాకుండా చేసే అవకాశం ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో పెన్షన్‌దారులకు సంబంధించిన సర్వేను ముగించి, 21వ తేదీన నూతన  పెన్షన్ దరఖాస్తులు తీసుకునే అవకాశాన్ని కమిటీ సభ్యులకు కల్పించారు. ఈ అవకాశంతో ఇప్పటి వరకు పెన్షన్ పొందుతున్న వారిని పక్కనపెట్టి, తమకు ఇష్టం వచ్చిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయించేలా రాజకీయ నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    నిలిపివేయండి : నిడుమోలు

    పింఛనుదారులను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ రెండు రోజుల సర్వేను చేపట్టిందని, దీనిని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ బుధవారం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి చదువు ఉండదని, వారి వయసు ఎంతో వారే చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న కొద్దిపాటి పెన్షన్ కూడా నిలిపివేసేందుకే ఈ సర్వే చేపట్టిందని ఫిర్యాదులో వివరించారు. అర్హులైన పెన్షన్ దారులపై అనర్హత వేటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement