- రుణమాఫీకి భూమి సర్వే నంబర్ కావాలట
- జిల్లాలో 50శాతం మంది రైతులు దూరం
విశాఖ రూరల్ : వరికుప్పంత హామీనిచ్చి.. వడ్ల గింజంత రుణమాఫీకి చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంది. వారానికో ఉత్తర్వులతో రైతుల్ని హతాశుల్ని చేస్తోం ది. విస్తరి వేసి వడ్డన ఎగ్గొట్టినట్లు.. ఆర్భాటంగా ఇచ్చిన రుణమాఫీ హామీ నుంచి తప్పించుకోవడానికి శతవిధా లా యత్నిస్తోంది. ఇప్పటికే కుటుంబంలో ఒక్కరే మాఫీకి అర్హులని, ఉద్యానవన రైతులకు వర్తించదని ప్రకటించారు.
ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం వంటి నిబంధనలు విధించారు. తాజాగా.. అడ్డగోలుగా సర్వే నంబర్ అడ్డంకిని సృష్టించారు. దీంతో జిల్లా రైతుల్లో 50 శాతం మంది రుణమాఫీకి దూరం కానున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల తప్పిదాలు ప్రభుత్వానికి కలిసివస్తున్నాయి. భూమి క్రయవిక్రయాలు, వారసులకు రాసి చ్చిన తర్వాత అధికారులు రెవెన్యూ అడంగళ్లలో మార్పులు చేయకుండా, ఒకే సర్వే నంబర్‌ను నమోదుతో చాలా మంది రైతులు రుణమాఫీకి దూరం కానున్నారు.
ఒక్కరే అర్హులు..
ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మాఫీ అర్హతకు 31 అంశాలకు సంబంధించిన సమాచారం పొందుపర్చాలి. ఇందులో రైతులు పూర్తి చేయాల్సినవి కొన్ని కాగా, మిగిలినవి బ్యాంకులు నమోదు చేయాల్సినవి. ఇందుకు ప్రభుత్వం రూపొందించి, బ్యాంకులకు అందజేసిన సాఫ్ట్‌వేర్‌లో సర్వే నంబర్ కూడా చేర్చింది. ఒకే సర్వే నంబర్‌తో ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది రైతులు మాఫీకి దరఖాస్తు చేసుకుంటే.. కేవలం ఒక్కరి రుణమే మాఫీ అవుతుంది. ఒకే సర్వే నంబర్‌పై వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు పొందినా, ఒకరి కన్నా ఎక్కువ మంది ఒకే సర్వే నంబర్ ఇచ్చినా దానిని సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. అప్పుడు ప్రభుత్వం నియమించే టెక్నికల్ కమిటీ ఒకరిని మాత్రమే రుణమాఫీకి అర్హుడిగా ఎంపిక చేస్తుంది.
మాయోపాయాలు..
చాలా చోట్ల ఒక సర్వే నంబర్‌పై భూమి క్రయవిక్రయాలు జరిగాయి. సాధారణంగా తండ్రి ఆస్తిని అదే సర్వే నంబర్‌పై వారసులకు పంపిణీ చేసి రిజిస్టర్ చేస్తుంటారు. దీని ఆధారంగానే రెవెన్యూ అధికారులు వారికి టైటిల్‌డీడ్, పట్టాదారుపాస్‌పుస్తకాలను మంజూరు చేస్తున్నారు తప్పా సర్వే నంబర్ల సబ్ డివిజన్ చేసి, అడంగళ్లలో నమోదు చేయడం లేదు. సర్వే నంబర్ల సబ్ డివిజన్‌కు అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా పట్టించుకోవడం లేదు.
సాధారణంగా బ్యాంకులు సర్వే నంబర్‌తో సంబంధం లేకుండా టైటిల్ డీడ్, పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. పంట నష్టపోతే ప్రభుత్వం కూడా వీటి ఆధారంగానే పెట్టుబడి రాయితీ ఇస్తోంది. దీని వల్ల చాలా మంది రైతులు ఇప్పటి వరకు సర్వే నంబర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రుణమాఫీకి సర్వే నంబర్‌ను కూడా నమోదు చేయాలని చెప్పడంతో లబోదిబోమంటున్నారు.