సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడాను అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. లదాఖ్ ప్రతిష్టంభనపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. కరోనావైరస్ చికిత్సకు మెరుగైన ఔషధంగా ట్రంప్ భావిస్తున్న యాంటి మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపాలని అమెరికా కోరినపుడు మాత్రమే మోదీ చివరిసారిగా మాట్లాడారని వివరణ ఇచ్చాయి. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్)
భారత్, చైనా సరిహద్దు వివాదంలో ఇరు దేశాలు అంగీకరిస్తే మధ్య వర్తిత్వానికి తాను సిద్ధమనీ, దీనిపై మోదీ తో మాట్లాడినపుడు ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం ప్రభుత్వం స్పందించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ అంశానికి సంబంధించి భారత ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఆఖరి సంభాషణ ఏప్రిల్ 4 జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇద్దరు నాయకుల మధ్య ఇటీవలి కాలంలో ఎటువంటి పరస్పర చర్చలు జరగలేదని స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment