- ‘నకిలీ ఇన్సూరెన్సు’ గుట్టురట్టు
- రూ.100కే నకిలీ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డులు
- గుడివాడ, చల్లపల్లి కేంద్రాలుగా అక్రమ వ్యాపారం
- పోలీసుల అదుపులో తొమ్మిది మంది
గుడివాడ అర్బన్ : వాహనాలకు సంబంధించి నకిలీ బీమా పత్రాలను తయారు చేస్తున్న వారి గుట్టు రట్టయ్యింది. స్థానిక టూటౌన్ పోలీసులు పకడ్బందీగా దాడి చేసి నకిలీల ఆటకట్టించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లోని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ నకిలీ బాగోతానికి పట్టణానికి చెందిన ఓ యువకుడు సూత్రధారని పోలీసులు గుర్తించారు. వాహనాలకు సంబంధించిన బీమా కాగితాలను నకిలీవి తయారు చేస్తున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పట్టణంలోని కొన్ని ఇంటర్నెట్ సెంటర్లలో టూటౌన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో బీమా రెన్యువల్ పత్రాలతోపాటు ఆధార్, రేషన్, ఓటరు కార్డులను సైతం నకిలీవి తయారుచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇలా మొదలైంది...
గుడివాడకు చెందిన నాగగణేష్ అనే యువకుడు కొంతకాలం క్రితం స్థానిక ఆర్టీఏ కార్యాలయం వద్ద మకాం వేశాడు. వాహనచోదకులకు ఏమైనా సర్టిఫికెట్లు, దరఖాస్తులు అవసరమైతే సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ద్వి చక్రవాహనాలకు బీమా చేసే ఓ ప్రయివేటు సంస్థకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఫొటో షాప్‌లో ఫోర్జరీ చేయడం ప్రారంభించాడు. తమ వాహనాలకు బీమా గడువు ముగిసిందని ఎవరైనా ఆర్టీఏ కార్యాలయానికి వస్తే వారితో మాట్లాడి రూ.100 ఇస్తే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసిన కాగితాలు అందజేస్తానని నమ్మించేవాడు.
దీంతో వాహనదారులు బీమా కంపెనీకి రూ.2వేలు చెల్లించడం కన్నా ఇతనికి రూ.100 ఇస్తే పని జరిగిపోతుందని భావించి నకిలీ రెన్యువల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. క్రమంగా గణేష్ పట్టణంలోని అన్ని ఇంటర్నెట్ సెంటర్ల నుంచి తన కార్యకలాపాలను సాగించడం ప్రారంభించాడు. రోజుకు ఒక నెట్ సెంటర్ వద్ద ఉంటూ వాహనదారులకు అవసరమైన సర్టిఫికెట్లను తయారుచేసి అందజేస్తూ రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నాడు.
మోసం ఇలా...
తొలుత బీమా కంపెనీ వెబ్‌సైట్ నుంచి రెన్యువల్ కాపీలను డౌన్‌లోడ్ చేస్తాడు. ఆ కాపీని ఫొటోషాప్‌లో పేర్లు, సీరియల్ నంబర్లను మార్పు చేస్తాడు. అనంతరం వాహనదారులకు అందజేస్తాడు.
నెట్ సెంటర్ల నిర్వాహకులకు అలవాటు...
తొలిరోజుల్లో తాను మాత్రమే ఈ నకిలీ వ్యవహారాన్ని నడిపిన గణేష్ ఇటీవల పట్టణంలోని పలు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులకు కూడా అలవాటు చేశాడు. వారు బీమా రెన్యూవల్ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్, రేషన్, ఓటరు కార్డులను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. పలు నెట్ సెంటర్ల నిర్వాహకులు కంప్యూటర్‌లో తయారుచేసిన నకిలీ కార్డులు, ధ్రువీకరణ పత్రాలను ఈ-మెయిల్ ద్వారా డిజిటల్ కలర్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ల్యాబ్ వారు ఒక్కో కార్డుకు రూ.40 చొప్పున తీసుకుని ప్రింట్ తీసి లామినేషన్ చేసి అందజేస్తున్నారు. ఇదే విధంగా అవనిగడ్డ, చల్లపల్లిలలోనూ ఇంటర్నెట్, సెల్‌పాయింట్ షాపుల నిర్వాహకులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఏ సర్టిఫికెట్ అయినా తయారుచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పోలీసుల అదుపులో తొమ్మిది మంది
పోలీసులు పథకం ప్రకారం శనివారం రాత్రి గణేష్‌కు ఫోన్‌చేసి ఇన్సూరెన్స్ రెన్యువల్ సర్టిఫికెట్ కావాలని కోరారు. వెంటనే స్పందించిన గణేష్ ఓ ప్రదేశానికి రావాలని సూచించాడు. అతను సత్యనారాయణపురంలోని ఓ నెట్ సెంటర్‌కు చేరుకున్నాడు. క్షణాల్లో నకిలీ ఇన్సూరెన్స్ రెన్యువల్ సర్టిఫికెట్‌ను సిద్ధంచేసి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న గణేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో టూటౌన్ ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి చల్లపల్లి వెళ్లి ఓ వ్యక్తిని, యాకనూరు, కోడూరు, నాగాయలంకలలో ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆదివారం ఉదయం గుడివాడలో మరో నలుగురిని స్టేషన్‌కు తరలించారు. వీరందరినీ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.
అవనిగడ్డ ప్రాంతంలో కలకలం..
అవనిగడ్డ : ఆటోలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న గాజులవారి పాలేనికి చెందిన ఆటోడ్రైవర్ గాజుల అంకారావును గుడివాడ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి కొద్దిరోజుల కిందట నాగాయలంకకు చెందిన మరో ఆటోడ్రైవర్‌ను కూడా గుడివాడ పోలీసులే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అంకారావును అదుపులోకి తీసుకోవడం అవనిగడ్డ ప్రాంతంలో కలకలం సృష్టించింది.