రేషన్ బియ్యంలో కోత!
- వచ్చే నెలలో తగ్గనున్న పంపిణీ
- బియ్యం ఎలాట్‌మెంట్ తగ్గించి డీడీలు తీస్తున్న డీలర్లు
- లక్షలమంది కార్డుదారుల్లో ఆందోళన
అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రేషన్‌కార్డుకు ఆధార్ అనుసంధానించలేదనే సాకు చూపుతూ రేషన్‌లో పెద్ద ఎత్తున కోత విధించనుంది. దీంతో లక్షలాదిమంది ఆకలితో అలమటించనున్నారు.
గుడ్లవల్లేరు : నిరుపేదల సంక్షేమ పథకాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కటిగా అటకెక్కుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త మోజులో సరికొత్త పథకాలు ప్రవేశ పెట్టకపోయినా... ప్రజా సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వాలు తలపెట్టిన పథకాల అమలు కూడా అంతంతమాత్రంగానే కొనసాగుతోందని నిరుపేదలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల కడుపు నింపుతున్న రేషన్ సరకులపై కన్నేసింది.
జిల్లాలో ఆధార్ అనుసంధానం కాకముందు గత ఆగస్టులో 15,746 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. వచ్చే నెలలో 14,249.602 టన్నుల రేషన్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు 10,46,106, ఏఏవె 66,649, అన్నపూర్ణ 466 ఉన్నాయి. ఆధార్ పేరుతో రేషన్ కార్డులకు రేషన్ రద్దు చేయడంతో జిల్లా మొత్తం మీద సుమారు 10 శాతం బియ్యం తగ్గే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
రేషన్ బియ్యం కేటాయింపును తగ్గిస్తూ డీలర్లతో తక్కువ మొత్తాలకు డీడీలు తీయించడమే అందుకు నిదర్శనం. దీనినిబట్టి రేషన్ డిపోలకు ముందుగా వచ్చే తెల్లకార్డుదారులకే బియ్యం పంపిణీ చేసే అవకాశం కనబడుతోంది. వినియోగదారులకు వీటిని సర్దుబాటు చేయడమెలాగో అర్థంగాక రేషన్ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.
ఆధార్ నంబర్లు లేకపోవడం వల్లే : డీఎస్‌వో
ఈ విషయమై డీఎస్‌వో సంధ్యారాణిని వివరణ కోరగా ఆధార్ నంబర్లు లేకపోవడం తదితర కారణాల వల్ల జిల్లాలో 5.36 లక్షల మందికి సరకుల పంపిణీని నిలిపివేశామన్నారు. వీరిలో ఎవరైనా తమ ఆధార్ నంబర్లతో పాటు అర్హతకు అవసరమైన నివేదికల్ని స్థానిక అధికారులకు అందజేస్తే వారిని అర్హులుగా గుర్తిస్తామని తెలిపారు. అర్హులకు పూర్తి స్థాయిలోనే రేషను బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.
వినియోగదారులకు ఏం చెప్పాలి?
ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని విడుదల చేసి, ఆ ప్రకారం ఏయే కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయొద్దంటే వారికి ఇవ్వకుండా ఉంటాం. ఆన్‌లైన్‌లో కేటాయింపును సరిదిద్దకుండా తక్కువ బియ్యం ఇస్తే, వినియోగదారులకు ఏ సమాధానం చెప్పాలి?
- పెయ్యల సురేష్‌బాబు, రేషన్ డీలర్ల సంఘ మండల కార్యదర్శి