సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. ఇప్పటిదాకా కిలో రూ.1కే అందిస్తున్న బియ్యాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు (ఏడాది కాలం) ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 1.46 కోట్ల బియ్యం కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుదారులందరికీ ఏడాదిపాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు ప్రకటించింది.
ఏపీలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులతో సమానంగా నాన్ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ శనివారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రేషన్ దుకాణాలు, ఎండీయూ వాహనాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇది ఒక్క బియ్యానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ 1967కు లేదా 18004250082 నంబర్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. ఉచిత బియ్యం పంపిణీపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టి, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment